Woman protest : తన భూమికి పట్టా చేయాలని తహసీల్దార్ ఆఫీసు చుట్టూ తిరిగి.. తిరిగి, చివరికి తాళిబొట్టు కట్టింది
తాళిబొట్టు తీసుకొని తన భూమి తనకు పట్టా చేయాలని ఓ మహిళ నిరసనకు దిగింది...
Woman protest against Rudrangi Tahsildar : తాళిబొట్టు తీసుకొని తన భూమి తనకు పట్టా చేయాలని ఓ మహిళ నిరసనకు దిగింది. తన భూమి పట్టా కోసం.. మంగళసూత్రాన్ని.. తహసీల్దార్ ఆఫీసుకు కట్టింది ఆ మహిళ. తహసీల్దార్ ఆఫీసు చుట్టూ తిరిగి.. తిరిగి విసిగి వేశారిపోయి చివరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్ని సార్లు అధికారులను బ్రతిమాలినా పట్టించుకోలేదని, పట్టా కోసం యేళ్ల తరబడి తిరుగుతునే ఉన్నా ఫలితం లేకపోవడంతో చివరికి ఆమె, తన మాంగళ్యాన్ని ఆఫీసు గుమ్మానికి వ్రేలాడగట్టింది.
వివరాల్లోకి వెళితే, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన దంపతులు పొలాస రాజేశం, మంగ. వీరికి సర్వే నెంబర్ 130/14లో 2 ఎకరాల భూమి ఉంది. అయితే, మంగ భర్త రాజేశం మూడు సంవత్సరాల క్రితం చనిపోగానే వేరే వాళ్ళకి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఆ భూమిని పట్టా చేశారు. అయితే, తన భూమిని అన్యాయంగా వేరే వాళ్లకి పట్టా చేశారని.. తన భూమిని తనకు పట్టా చేయాలని మూడు సంవత్సరాలుగా ఆఫీస్ ల చుట్టూ తిరుగుతునే ఉంది మంగ. అయినా అధికారుల్లో చలనం లేకపోయింది.
దీంతో విసిగిపోయిన బాధితురాలు ఈ రోజు విస్తుపోయే నిర్ణయం తీసుకుంది. తన భర్త ఎలాగూ లేడంటూ.. తన తాళిబొట్టు తీసి ఆఫీస్ గేట్ కి వ్రేలాడదీసింది. తాళిబొట్టును లంచంగా తీసుకొని తన భూమిని తనకు పట్టా చేయాలని వేడుకుంది. వేరే వాళ్లు తన భూమిని ఎంక్వైరీ చేయించుకున్నారు.. అధికారులు కూడా సహకరించారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. భర్త లేకపోవడంతో తనను తీవ్రంగా వేధిస్తున్నారని.. కనీసం తనకు ఆధారమైన భూమినైన ఇప్పించాలని ఆమె వేడుకుంటుంది.