AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cold Waves: చలికాలం వచ్చేసింది.. గజగజలాడిస్తోంది.! బామ్మా జర జాగ్రత్త..

చలి కాలం వచ్చేసింది. చలి పులిని వెంట తీసుకొచ్చింది. చల్లని గాలులతో వణికిస్తూ ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోతూ ఆరోగ్యాన్ని ఆగమాగం చేసేందుకు సిద్దమవుతోంది. అన్నీ కాలాలు ఒక ఎత్తు చలి కాలం ఒక ఎత్తు అన్నట్టుగా తన ప్రతాపం చూపేందుకు రెడీ అయింది. ఉదయం వెచ్చదనాన్ని పంచుతూనే రాత్రి వేళల్లో గజగజవణికిస్తూ వామ్మో అనిపిస్తోంది.

Cold Waves: చలికాలం వచ్చేసింది.. గజగజలాడిస్తోంది.! బామ్మా జర జాగ్రత్త..
Cold Waves
Naresh Gollana
| Edited By: |

Updated on: Nov 12, 2025 | 1:20 PM

Share

శీతాకాలం వస్తూ వస్తూ జబ్బులను మోసుకొస్తుంది‌. వాతవరణంలో మార్పులతో ఒంట్లోను పెను మార్పులే చోటు చేసుకుంటాయి. ఈ కాలంలో జలుబు, దగ్గు, జ్వరాలు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. పైగా జలుబు, దగ్గు అంటు వ్యాధులు. సులభంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి కూడా. ఇక ఆస్తమా ఉన్న వాళ్లకైతే చలికాలం నరకమే‌..‌ ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊపిరితిత్తులపై చల్లని వాతావరణం చాలా ప్రభావం చూపుతుంది. వృద్దులు, చంటి పిల్లలు, పిల్లల తల్లులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా పసిపిల్లలు చలికి అసలు తట్టుకోలేరు. స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు తప్పనిసరిగా స్కూల్ డ్రెస్ తో పాటు జర్కిన్ లేదా కోటు వేసుకోవాలి. మంకీక్యాప్ లు ధరించాలి. రాత్రిళ్లు పొగమంచు కురిసే అవకాశం ఉంటుంది కనుక.. అత్యవసరమైతే తప్ప ఇల్లుదాటి బయటకి వెళ్లకపోవడమే ఉత్తమం.

గర్భిణీలు, వృద్దులు చలి నుంచి బయటపడాలంటే ఉదయం వాకింగ్, సాయంత్రం బయటకెళ్లడం మానేయాలి. ఈ కాలంలో చాలా మందిలో డి విటమిన్ లోపం కనిపిస్తుంది. అలాంటి వాళ్లు తప్పనిసరిగా ఎండ వచ్చినప్పుడు కొంతసేపైనా సూర్య కిరణాలు శరీరంపై పడేలా చూసుకోవాలి. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు, బాలింతలు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు జాగ్రత్తలు తప్పని సరి పాటించాలి. మూడు పూటలా వేడి ఆహారమే తీసుకోవాలి. చలికాలంలో ఆహారం, నీటితో అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంటుంది కనుక.. కాచి చల్లార్చిన గోరు వెచ్చని నీటినే తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం పూట వాకింగ్ వెళ్లే అలవాటు ఉన్నవారు కూడా ఎండ వచ్చాక వాకింగ్ వెళ్లడం ఉత్తమమని చెప్తున్నారు వైద్యులు. పొగమంచు కారణంగా శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉందని.. అందుకే కాస్త ఎండ వచ్చాక వాకింగ్ చేయడం మంచిదని చెప్తున్నారు. అలా వీలుకాకపోతే సాయంత్రం పూట వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు.

ఇక వయో వృద్దులకు చలికాలంలో ఇబ్బందులు ఎక్కువ కావటానికి రోగనిరోధకశక్తి తగ్గటం, ఎక్కువసేపు ఇంట్లోనే కూర్చొని ఉండటం వంటి రకరకాల అంశాలు దోహదం చేస్తుంటాయి. జలుబు, ఫ్లూ, న్యుమోనియా వంటివి చలికాలంలో ప్రభావం చూపుతాయి. శారీరక శ్రమ తగ్గడంతో కీళ్లు బిగుసుకోవటానికి, రక్త ప్రసరణ తగ్గటానికి దారితీస్తుంది. దీంతో కీళ్లనొప్పులు, మధుమేహం వంటి జబ్బులు వృద్దులకు తీవ్రమవుతాయి. ఈ కాలంలో మామూలు గానే దాహం అంతగా వేయదు. దీంతో నీళ్లు సరిగా తాగక ఒంట్లో నీటిశాతం తగ్గుతుంది. ఈకారణంగా శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. దీని మూలంగా అప్పటికే ఉన్న మూత్ర ఇన్ఫెక్షన్లు, కిడ్నీ సమస్యలు మరింత తీవ్రమవుతాయి. చలి, పొడి గాలి శ్వాసకోశాన్ని చికాకు పరుస్తుంది. దీంతో సీవోపీడీ, ఉబ్బసం, ఇతర ఛాతీ సమస్యలు ఉదృతమవుతాయి. చలికాలంలో ఇల్లు వెచ్చగా ఉంచుకోవటం తప్పని సరి. కానీ ఈ క్రమంలో లోపల గాలి నాణ్యత పడిపోయే ప్రమాదముంటుంది.

ఇదీ ఇబ్బందులు పెరిగేలా చేస్తుంది. చలికాలం హార్మోన్ల నియంత్రణ మీదా ప్రభావం చూపుతుంది. కణాలు ఇన్సులిన్ లకు సరిగా స్పందించకపోవచ్చు. దీంతో మధుమేహం గలవారిలో రక్తంలో గ్లూకోజు మోతాదులు ఇంకాస్త పెరుగుతాయి. ప్రధానంగా శారీరక శ్రమ తగ్గటంతోనే రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరుగుతుంటాయి. మరోవైపు చలిని తట్టుకోవటానికి విడుదలయ్యే ఒత్తిడి హార్మోన్లు కూడా ఇన్సులిన్ పనితీరును అడ్డుకుంటాయి. ఇవీ రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరిగేలా చేస్తాయి. మధుమేహం ఎక్కువ కావటం వల్ల నాడులు దెబ్బతినటం, పుండ్లు త్వరగా మానకపోవటం, గుండెజబ్బుల వంటి సమస్యల ముప్పు పెరుగుతుంది. మందులు క్రమం తప్పకుండా వేసుకోవాలి. ఉప్పుతో చేసే చిరుతిళ్లు, మిఠాయిలు, జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి. ధ్యానం, ప్రాణాయామం, యోగా వంటి వాటితో ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఇవి నిరంతరంగా పాటిస్తే చలికాలంలో ఆరోగ్యంగా ఉండటం సులువే.