తుమ్ము వస్తున్నప్పుడు ఆపేస్తున్నారా..? ఎంత ప్రమాదమో తెలుసా..?
మన శరీరంలో తుమ్ము అనేది ఒక సహజ రక్షణ వ్యవస్థ. చాలా మంది తమకు ఇబ్బందిగా ఉంటుందనో, ఇతరుల ముందు తుమ్మడం బాగుండదనో తుమ్ము ఆపడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ అలవాటు మానేయాలి. ఎందుకంటే తుమ్మును ఆపడం వల్ల కొన్ని అనూహ్యమైన శారీరక ఇబ్బందులు వస్తాయి.

వాతావరణ మార్పులు, దుమ్ము, అలర్జీలు లేదా శరీరంలోకి హానికరమైన సూక్ష్మజీవులు ప్రవేశించకుండా ఆపడానికే తుమ్ము వస్తుంది. ఇది ఒక రక్షణ చర్యగా పనిచేస్తుంది. మనం తుమ్మినప్పుడు శరీరం లోపలికి వచ్చే హానికర పదార్థాలను సుమారు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో బయటకు పంపిస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా చాలా పెద్ద ప్రమాదాలను మనం తప్పించుకుంటాం.
చాలా మంది జనం ఉన్నచోట తుమ్మును ఆపడానికి ప్రయత్నిస్తారు. ఇది పెద్ద తప్పు. తుమ్ము సహజంగా బయటకు వెళ్లాల్సిన సమయంలో దాన్ని అడ్డుకోవడం వల్ల శరీరంలోని లోపలి అవయవాలపై చాలా ఒత్తిడి ఏర్పడుతుంది. ముఖ్యంగా చెవులు, కళ్ళు, మెదడు వంటి కీలక భాగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది.
తుమ్ముతో బయటకు వెళ్లాల్సిన గాలి లోపలే నిలిచిపోయి గట్టిగా ఒత్తిడి పెరగొచ్చు. దీని వల్ల కళ్ళలోని రక్తనాళాలు పగిలే ప్రమాదం ఉంది. ఇది చూపుపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది.
తుమ్మును బలవంతంగా ఆపినప్పుడు ఆ గాలి ఒత్తిడి చెవుల వైపు మళ్లే ప్రమాదం ఉంది. ఇది చెవుల్లో ఒత్తిడిని పెంచుతుంది. తీవ్రంగా అయితే చెవిపొరలు చిరిగిపోవచ్చు. దీని వలన శాశ్వతంగా వినికిడి తగ్గే ప్రమాదం కూడా ఉంటుంది.
కొంతమందికి తుమ్ము ఆపడం వల్ల మెడ పట్టేయవచ్చు. కొన్నిసార్లు మెదడుకు వెళ్లే నరాలలో ఒత్తిడి ఏర్పడి అది నరాల నష్టం (నర్వ్ డ్యామేజ్) లేదా పక్షవాతం లాంటి పరిస్థితులకు దారితీయవచ్చు. ఇది చాలా అరుదుగా జరుగుతుంది కానీ.. ప్రమాదం మాత్రం ఉంది.
తుమ్ము వచ్చేటప్పుడు దాన్ని అడ్డుకోవడం కాకుండా.. శుభ్రంగా తుమ్మడం అలవాటు చేసుకోవాలి. నోటికీ, ముక్కుకూ బట్ట లేదా టిష్యూ పట్టుకొని తుమ్మాలి. చేతి మడమలోకి తుమ్మడం కూడా మంచి అలవాటు. ఈ విధంగా తుమ్మడం ద్వారా ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
తుమ్ము అనేది మన శరీరానికి ఒక సహజ శుభ్రత ప్రక్రియ. దాన్ని అడ్డుకోవడం మంచిది కాదు. తుమ్ము రావడాన్ని నియంత్రించకుండా.. శుభ్రంగా, గాలిని బయటకు పంపే విధంగా తుమ్మడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అవసరమైతే చుట్టూ ఉన్నవారిని గమనించి మర్యాదగా తుమ్మే అలవాటు పెంచుకోవాలి. దాన్ని ఆపడం వల్ల తలెత్తే ప్రమాదాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి.