Rohit Sharma: ఆ రోజే క్రికెట్ వదిలేద్దామనుకున్నా.. కానీ.! రిటైర్మెంట్‌పై ఓపెన్‌గా చెప్పేసిన హిట్‌మ్యాన్
2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి అనంతరం రిటైర్మెంట్ గురించి అలోచించినట్టుగా రోహిత్ శర్మ చెప్పాడు. ఆ ఓటమి తనను తీవ్రంగా నిరాశకు గురి చేసిందని చెప్పుకొచ్చాడు. కానీ బలం కూడగట్టుకుని 2024 టీ20 ప్రపంచకప్‌పై దృష్టి సారించానన్నాడు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

తన రిటైర్మెంట్‌పై టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో అనూహ్య ఓటమి ఎడుర్కున్నాక క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్నా.. ఆ ఓటమి తనను తీవ్రంగా నిరాశకు గురి చేసిందన్నాడు రోహిత్ శర్మ. ఈ మెగా టోర్నమెంట్‌లో రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు లీగ్ దశలో వరుసగా తొమ్మిది విజయాలు సాధించి.. అనూహ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ప్రపంచకప్ గెలవడమే తన ఏకైక లక్ష్యమని, ఆ కల నెరవేరకపోవడంతో తాను కుంగిపోయానని రోహిత్ శర్మ అన్నాడు. ఆ ఓటమి బాధ నుంచి కోలుకోవడానికి తనకు రెండు నెలల సమయం పట్టిందని.. అదే సమయంలో 2024లో జరగనున్న టీ20 ప్రపంచకప్ తన ముందుందని గ్రహించి, దానిపైనే తన దృష్టి సారించానన్నాడు.
పరిస్థితులు ఏడాది లోపే పూర్తిగా మారిపోయాయని.. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ జట్టు 2024 టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచింది. ఆపై రోహిత్ టీ20లకు వీడ్కోలు పలికాడు. టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత కేవలం ఎనిమిది నెలల్లోనే భారత జట్టు మరో ఐసీసీ ట్రోఫీని కూడా గెలుచుకుంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి టైటిల్‌ను దక్కించుకుంది రోహిత్ సేన. ప్రస్తుతం రోహిత్ శర్మ వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంగా తన ఫిట్ నెస్.. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాడు. ఈలోగా, విజయ్ హజారే ట్రోఫీలో ముంబై జట్టు తరపున మొదటి మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు రోహిత్ శర్మ.
