AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayurveda: ఆయుస్సుని పెంచేది ఆయుర్వేదం.. ఈ వైద్యంలో కళ్ళలో, చెవుల్లో, ముక్కుల్లో డ్రాప్స్ వేయడానికి కారణం ఏమిటంటే..

Ayurvedic Treatment: ఆయుస్సుని కాపాడి వృద్ధి చేసే వేదం ఆయుర్వేదం. ఇది భారత దేశంలో అతిపురాతనమైన వైద్యం. 5000 సంవత్సరాలకు పూర్వం ఆధ్యాత్మిక గడ్డ అయిన..

Ayurveda: ఆయుస్సుని పెంచేది ఆయుర్వేదం.. ఈ వైద్యంలో కళ్ళలో, చెవుల్లో, ముక్కుల్లో డ్రాప్స్ వేయడానికి కారణం ఏమిటంటే..
Ayurveda
Surya Kala
|

Updated on: Jun 05, 2021 | 7:07 PM

Share

Ayurvedic Treatment: ఆయుస్సుని కాపాడి వృద్ధి చేసే వేదం ఆయుర్వేదం. ఇది భారత దేశంలో అతిపురాతనమైన వైద్యం. 5000 సంవత్సరాలకు పూర్వం ఆధ్యాత్మిక గడ్డ అయిన భారతదేశంలో ఆవిర్భవించింది. ప్రపంచంలోనే అత్యంత పురాతన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మరియు దీనిలో వైద్యం మరియు తాత్విక ఆలోచనలు మిళితమై ఉంటాయి. ఆధునిక వైద్యం వచ్చిన తరువాత ఆయుర్వేదం కొంచం వెనకబడినా ప్రస్తుతకాలంలో తిరిగి ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. శస్త్రచికిత్స చేసే కొన్ని వైద్యరీతుల్లో ఆయుర్వేదం ఒకటి. శాఖోపశాఖలుగా విస్తరించిన ఈ వైద్య ప్రక్రియలు ఆధునిక వైద్యానికి లొంగని కొన్ని రకాలైన దీర్ఘకాలిక వ్యాధుల్ని, మొండి వ్యాధుల్ని సైతం నయం చేస్తాయని చెబుతారు. అయితే కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం ఆయుర్వేదంలో మందులున్నాయంటూ కృష్ణపట్నం ఆనందయ్య చెప్పడంతో మళ్ళీ ఆయుర్వేద వైద్యం పై చర్చ మొదలైంది. అయితే ఆనందయ్య వైద్య విధానంలో ఒకటి కంటిలో పసరు పోయడం. అసలు కరోనా వ్యాధికి కంటిలో మందు ఎందుకు..? కళ్ళల్లో మందు వేస్తే ఊపిరితిత్తులకు ఎలా వెళ్తుంది…? వంటి అనేకమంది ప్రశ్నలు వేస్తున్న తరుణంలో ఆయుర్వేద వైద్యం గొప్పతనం మళ్ళీ ప్రపంచానికి తెలియాలంటే.. ఆయుర్వేదంలో పరిశోధనలు మొదలు పెట్టండి..అద్బుత సత్యాలు, సాంకేతికతలు వెలుగు చూస్తాయని సంప్రదాయవాదులు అంటున్నారు.

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం… ఒక వ్యక్తి గుండె కొట్టుకోవడం ఆగినంత మాత్రానా లేదా శ్వాస ఆడనంత మాత్రాన అంటే ప్రాణవాయువు సంచరించనంత మాత్రాన శ్వాసకోశ వ్యవస్థ పనిచేయనంత మాత్రాన చనిపోయినట్లు కాదు…నాడి పరీక్షించాలి… నాడి ఆడుతున్నట్లయితే కొన ఊపిరితో ఉన్నట్లు.. ఈ నాడీ వ్యవస్థకు ఉదాన వాయువు ప్రధాన ఆధారం… ఈ వాయువుకు అత్యవసర ద్వారాలు కళ్ళు.. కళ్ళ ద్వారా సరైన ఔషధం ప్రాణవాయువుకు అందించగలిగితే అది నాడీ మండలమును చైతన్య పరుస్తుంది.. నాడీ మండలము శరీరమంతా వ్యాపించి ఉంటుంది కావున శరీరమంతటా వ్యాపించి యున్న వ్యాన వాయువును చైతన్య పరుస్తుంది. ఈ వ్యాన వాయువు ఉత్తేజమైతే అపాన, సమాన, ప్రాణవాయువు లను చైతన్య పరచును. అపాన వాయువు చైతన్యం వల్ల విసర్జక వ్యవస్థ, సమాన వాయువు చైతన్యం వల్ల జీర్ణ వ్యవస్థ, ప్రాణవాయువు చైతన్యం వల్ల శ్వాసకోశ వ్యవస్థ చైతన్యం పొందుతాయి.. ఈ విధంగా ఊపిరితిత్తులకు మళ్ళీ చలనం వస్తుంది.. పంచప్రాణాలు పంచేంద్రియాలు అనబడు అత్యవసర ద్వారాలతో అనుసంధానించబడి ఉంటాయి… 1. ప్రాణ వాయువు – ముక్కు 2. సమాన వాయువు – నాలుక 3. అపాన వాయువు – చెవులు 4. వ్యాన వాయువు – చర్మం 5. ఉదాన వాయువు – కళ్ళు అలాగే పంచప్రాణాలు… వాటి కేంద్ర స్థానాలు.. 1. ప్రాణ వాయువు – గుండె 2. సమాన వాయువు – నాభి 3. అపాన వాయువు – పాయువు 4. వ్యాన వాయువు – శరీరమంతటా 5. ఉదాన వాయువు – కంఠం ఉదాన వాయువు అనబడు పంచమ ప్రాణం గాలిలో కలవనంత వరకు పంచ ప్రాణాలు ఉన్నట్లే..నని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు.

ఆయుర్వేదం ఆయుః ఆరోగ్య ఆధ్యాత్మిక ఆనంద రసాత్మక సకలశాస్త్ర విజ్ఞానం..కళ్ళతో శ్వాసక్రియ ఎలా అనే సందేహంచాలామందికి కలగవచ్చు .. దానికి సమాధానం విజ్ఞానంలో కూడా ఉంది. అది ఏమిటంటే కప్ప చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటుంది కదా..? అలాగే అత్యవసర పరిస్థితుల్లో మనిషికి పంచేంద్రియాలు శ్వాసేంద్రియాల అంటే ఇప్పటి భాషలో చెప్పాలంటే వెంటిలేటర్స్ అవుతాయి.. ఉదాహరణకు ఈతరాక నీటిలో మునిగిపోయిన వారిని రక్షించిన తరువాత వారి పొట్ట పై నొక్కుతారు. నోటిలో నుండి నీళ్ళు బయటకు వచ్చిన తర్వాత అరికాళ్ళు, అరిచేతులు బాగా రుద్దుతారు.. తలను గుడ్డ తో తుడిచి బట్టలు మార్చి చలిమంట దగ్గర కూర్చోబెడతారు.. ఈ ప్రథమ చికిత్స ఇంగ్లీష్ వైద్యం రాక ముందు లేదా.? మరి దాన్ని నాటు చికిత్స అందామా ? దాని శాస్త్రీయత కూడా ఇదే… శరీరమంతా వ్యాపించి ఉన్న నాడీ మండల వ్యవస్థను చైతన్య పరచడం ద్వారా వ్యానవాయువును తద్వారా అపాన, సమాన, ప్రాణవాయువు లను చైతన్య పరచడం… ఇక్కడ వెంటిలేటర్ గా చర్మం (అరికాళ్ళు, అరిచేతులు, తల, ఒళ్ళు రుద్దడం, తుడవడం) ద్వారా చికిత్స చేస్తాం… పాము కరచినప్పుడు కొంతమంది ఆయుర్వేద వైద్యులు రావి ఆకుల కొనలను రెండు చెవుల్లో ఉంచడం ద్వారా బ్రతికిస్తారు. ఎలాగంటే పైన చెప్పినట్లు అపాన వాయువు/విసర్జక వ్యవస్థ (విషాన్ని బయటకు విసర్జింప చేయడం) పని చేయనప్పుడు చెవులు అత్యవసర ద్వారాలవుతాయి.. చెవుల ద్వారా శ్వాసక్రియ జరిపించి పాము విష ప్రభావమును వికటింపచేసి మనిషిని కాపాడుతారు..కాలక్రమంలో ఆయుర్వేదంలో నైపుణ్యం కలిగిన వైద్యులు అంతరించిపోయారు. అయినప్పటికీ ఆయుర్వేద వైద్యంలోని పద్ధతులు అసత్యం కాదు. అందుకనే ఇకనైనా భారతీయ వైద్యవిధానమైన ఆయుర్వేదంపై ఆయుర్వేదంతో ఉన్న ఉపయోగాలు మొదలు పెట్టాలని.. అప్పుడు అద్బుత సత్యాలు, సాంకేతికతలు వెలుగు చూస్తాయని పెద్దలు చెబుతున్నారు.

Also Read: బొప్పాయిపండును తిని.. గింజలు పడేస్తున్నారా.. వాటి వల్ల కలిగే ఆరోగ్యాలు తెలుసా..!