AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్లీప్ బ్యాంకింగ్ అంటే ఏంటి..? ఇది ఎలా పని చేస్తుంది..? బిజీగా ఉన్నప్పుడు బాగా పనికొస్తదట..!

ఎప్పుడైనా ఒక రాత్రి నిద్ర సరిగా లేకపోవడంతో మరుసటి రోజు మొత్తం అలసటగా గడిపిన అనుభవం మీకు ఎప్పుడైనా ఉందా..? లేదా బిజీ షెడ్యూల్ ముందు ఒత్తిడితో నిద్ర పట్టక మనసులో ఆందోళనతో బాధపడ్డారా..? ఇలాంటి సందర్భాల్లో స్లీప్ బ్యాంకింగ్ అనే కొత్త నిద్ర వ్యూహం చాలా ఉపయోగపడుతుంది. ఇది తాజాగా ప్రాచుర్యం పొందుతున్న ఆరోగ్యకరమైన విధానం. ముందుగా సరిపడినంత నిద్రపోవడం ద్వారా తర్వాత వచ్చే నిద్రలేమి వల్ల కలిగే దుష్పరిణామాలను తగ్గించుకోవచ్చు.

స్లీప్ బ్యాంకింగ్ అంటే ఏంటి..? ఇది ఎలా పని చేస్తుంది..? బిజీగా ఉన్నప్పుడు బాగా పనికొస్తదట..!
Sleeping
Prashanthi V
|

Updated on: Jun 11, 2025 | 8:13 PM

Share

స్లీప్ బ్యాంకింగ్ ఏంటంటే.. ఇది ఒక విధమైన ముందస్తు జాగ్రత్త చర్య. మనం ముందుగా కొన్ని రోజులు ఎక్కువ నిద్ర తీసుకుని.. రాబోయే నిద్రలేమి పరిస్థితులను తేలికగా ఎదుర్కోవడమే స్లీప్ బ్యాంకింగ్. పరీక్షల సమయం, ప్రాజెక్ట్ డెడ్‌ లైన్లు, అంతర్జాతీయ ప్రయాణాలు వంటివి నిద్రకు విఘాతం కలిగించే అవకాశం ఉంటుంది.

అలాంటి సమయాల్లో శరీరానికి, మనసుకు ముందుగానే విశ్రాంతి ఇవ్వడం ద్వారా ఆ ఒత్తిడిని సులభంగా ఎదుర్కోవచ్చు. ఈ విధానం శారీరకంగా, మానసికంగా చురుకుగా ఉండటానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యంగా ఆందోళనలకు లోనయ్యే వారికి చాలా మేలు చేస్తుంది. ముందుగానే విశ్రాంతిగా ఉన్న శరీరం, మనస్సు ఒత్తిడిని తేలికగా తట్టుకోగలుగుతుంది.

ఇది ఎలా పని చేస్తుంది.. స్లీప్ బ్యాంకింగ్‌ ను మీరు డబ్బు పొదుపులా భావించవచ్చు. అవసరానికి ముందే నిద్రగా ఒక జమా చేసుకుంటారు. ఆ నిద్ర మీ శరీరానికి నిల్వ శక్తిలా పని చేస్తుంది. ఇది ఊహాగానంగా కాదు.. శాస్త్రీయంగా నమ్మదగిన విధానమే. దీని వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  • గమనించే శక్తి మెరుగవుతుంది.. నిద్ర ఎక్కువగా తీసుకున్నప్పుడు మనం ఎక్కువగా ఏకాగ్రతతో పని చేయగలుగుతాం.
  • శరీర సామర్థ్యం మెరుగుపడుతుంది.. శరీరం త్వరగా తేరుకోవడం, శక్తివంతంగా ఉండటం గమనించవచ్చు.
  • వ్యాధులపై రక్షణ పెరుగుతుంది.. నిద్ర సరిగ్గా ఉండే వారు సులభంగా జలుబు, వైరస్‌ లను ఎదుర్కొంటారు.
  • మానసిక స్థిరత్వం ఉంటుంది.. ఎలాంటి ఒత్తిడికైనా మనసు తేలికగా స్పందించగలదు.

స్లీప్ బ్యాంకింగ్ ఎలా పాటించాలి.. ఈ పద్ధతిని పాటించాలంటే ముందుగానే సరైన ప్రణాళిక వేసుకోవాలి. ఉదాహరణకు ఒక బిజీ వారం రానుందని తెలిసినప్పటి నుంచే ముందస్తుగా సిద్ధం కావాలి. అందుకోసం వచ్చే 3 నుంచి 4 రోజులు ప్రతి రాత్రి సాధారణ నిద్రకు గంట పాటు అదనంగా నిద్రించండి. అంటే సాధారణంగా 7 గంటలు నిద్రపోతే ఆ రోజుల్లో 8 గంటలు నిద్రించేలా చూడండి. ఇలా చేస్తే రానున్న అలసటభరితమైన రోజుల్లో నిద్రలేమి వల్ల కలిగే ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. మీ శరీరానికి కావాల్సిన శక్తిని ముందుగానే అందించినట్లవుతుంది.

నిద్ర ఎక్కువగా తీసుకుంటున్నప్పటికీ.. నాణ్యతగల నిద్రకే ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి రోజు ఒకే సమయానికి పడుకోవడం, లేవడం అలవాటు చేసుకోండి. నిద్రగది చల్లగా, నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోవాలి. రాత్రి సమయంలో కాఫీ లేదా మసాలా భోజనాలను మానేయడం మంచిది.

నిద్రకు ముందు పుస్తకాలు చదవడం లేదా ప్రశాంతంగా మాట్లాడటం లాంటి శరీరం, మనసు రిలాక్స్ అయ్యే అలవాట్లను పాటించండి. అలాగే చిన్న నిద్రలు 15 నుంచి 30 నిమిషాలు శరీరానికి తాత్కాలిక ఉల్లాసాన్ని ఇవ్వగలవు. అయితే ఇవి రాత్రి నిద్రకు ప్రత్యామ్నాయంగా తీసుకోవద్దు. ఎక్కువ అలసటగా ఉన్నపుడే ఈ న్యాప్‌ లను ఉపయోగించాలి.

స్లీప్ బ్యాంకింగ్ అనేది సోమరితనం కాదు.. ఇది శరీరం మెదడు రెండింటికీ ముందుగానే సపోర్ట్ ఇచ్చే తెలివైన పద్ధతి. ఇది శాస్త్రీయంగా నమ్మదగిన పద్ధతిగా గుర్తింపు పొందుతోంది. మీరు ముందే నిద్రకు ప్రాధాన్యతనిస్తే.. రానున్న ఒత్తిడిని తేలికగా ఎదుర్కొనవచ్చు. ఈ అలవాటును రోజువారీ జీవితంలో భాగంగా చేసుకుంటే.. నిద్ర సంబంధిత సమస్యలు తగ్గి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.