అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..! ఆరోగ్యానికి మంచిది కాదు..!
స్నానం చేసిన వెంటనే నీరు తాగితే ఆరోగ్యం పై ఎలాంటి ప్రభావం పడుతుందో మీకు తెలుసా..? చాలా మంది స్నానం తర్వాత వెంటనే నీరు తాగడం అలవాటుగా చేసుకుంటారు. కానీ ఇది కొన్ని ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

స్నానం చేసిన వెంటనే చాలా మందికి దాహం వేయడం సహజమే. శరీర ఉష్ణోగ్రతలో మార్పు రావడం వల్ల దాహం ఎక్కువగా అనిపించవచ్చు. అయితే ఈ సమయంలో వెంటనే నీరు తాగడం మంచిదా..? అనే విషయంపై కొంతమందికి స్పష్టత ఉండదు. నిజానికి స్నానం చేసిన వెంటనే నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్నానం సమయంలో శరీర ఉష్ణోగ్రత మారుతూ ఉంటుంది. బాగా వేడిగా ఉన్నప్పుడు చల్లటి నీరు తాగితే ఆకస్మికంగా శరీర ఉష్ణోగ్రతలో మార్పు చోటుచేసుకుంటుంది. ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపించవచ్చు. ముఖ్యంగా, రక్తప్రసరణ వేగంగా జరిగే సమయంలో చల్లటి నీరు తాగితే గుండెపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది.
స్నానం చేసిన తర్వాత మన శరీరంలో రక్తప్రసరణ పెరుగుతుంది. ఆ సమయంలో ఒక్కసారిగా నీరు తాగితే రక్త నాళాలపై ఒత్తిడి పెరిగి చలికి గురయ్యే అవకాశం ఉంది. ఇది తలనొప్పి, నీరసం, అలసట వంటి సమస్యలకు దారి తీస్తుంది. అందువల్ల స్నానం చేసిన వెంటనే నీరు తాగకుండా 10-15 నిమిషాల గడువు తీసుకుని తాగడం ఉత్తమం.
కేవలం స్నానం చేసిన వెంటనే మాత్రమే కాదు.. భోజనం చేసిన వెంటనే నీరు తాగడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. భోజనం చేసిన తర్వాత జీర్ణక్రియ సక్రమంగా జరిగేందుకు కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో నీరు తాగితే కడుపులోని ఆమ్లాలు పలుచబడిపోతాయి. ఫలితంగా ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోవచ్చు. దీని వల్ల అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది.
నిపుణుల సూచన ప్రకారం భోజనం చేసిన 30-45 నిమిషాల తర్వాత మాత్రమే నీరు తాగాలి. ఇలా చేస్తే జీర్ణక్రియ సహజంగా జరిగి శరీరానికి పోషకాలు అందుతాయి. బయట ఎండలో గడిపి ఇంటికి వచ్చినప్పుడు చాలా మందికి వెంటనే చల్లటి నీరు తాగాలనిపిస్తుంది. కానీ ఇది కూడా శరీరానికి మంచిది కాదు. మనం ఎండలో ఎక్కువ సేపు ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అటువంటి సమయంలో ఒక్కసారిగా చల్లటి నీరు తాగితే శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా తగ్గిపోతుంది. దీని వల్ల తలనొప్పి, జలుబు, జ్వరం లాంటి సమస్యలు రావచ్చు.
నీరు తాగడానికి సరైన సమయం
- స్నానం చేసిన వెంటనే నీరు తాగకుండా 10-15 నిమిషాల తర్వాత తాగాలి.
- భోజనం చేసిన వెంటనే నీరు తాగకూడదు. 30-45 నిమిషాల గడువు తీసుకోవాలి.
- బయట నుంచి ఇంటికి వచ్చిన వెంటనే చల్లటి నీరు తాగకూడదు. కొద్దిసేపు గ్యాప్ తీసుకుని గోరు వెచ్చటి నీరు తాగాలి.
- వ్యాయామం చేసిన వెంటనే చల్లటి నీరు తాగకుండా కొద్దిగా గోరు వెచ్చటి నీరు తాగాలి.
స్నానం చేసిన వెంటనే, భోజనం చేసిన వెంటనే లేదా ఎండలో గడిపిన వెంటనే నీరు తాగడం ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవడం ఎంత అవసరమో.. నీరు తాగే సరైన సమయం పాటించడమూ అంతే ముఖ్యము. ఈ చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆరోగ్య సమస్యలను నివారించుకోవచ్చు.