AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jowar Roti: రోజూ జొన్న రొట్టెలు తింటే ఆ వ్యాధికి చెక్ పెట్టినట్టే.. శుభవార్త చెప్పిన పరిశోధకులు

ఈరోజుల్లో చాలామంది ఆరోగ్యం కోసం జొన్న రొట్టెలను ఎంచుకుంటున్నారు. బరువు తగ్గాలన్నా, ఊబకాయం నివారించాలన్నా ఇవే ఉత్తమమని నిపుణులు కూడా సిఫార్సు చేస్తున్నారు. అయితే, ఇవి మాత్రమే కాదు రోజూ జొన్న రొట్టెలు తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు మన జోలికి రావట. మరి జొన్న రొట్టెలు తినడం వల్ల శరీరంలో ఇంకా ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Jowar Roti: రోజూ జొన్న రొట్టెలు తింటే ఆ వ్యాధికి చెక్ పెట్టినట్టే.. శుభవార్త చెప్పిన పరిశోధకులు
Jowar Roti Benefits
Bhavani
|

Updated on: Apr 05, 2025 | 3:42 PM

Share

బరువు తగ్గాలని కోరుకునేవారు, మధుమేహ సమస్య ఉన్నవారు రాత్రి భోజనంలో అన్నం బదులు చపాతీలను ఎక్కువగా తింటున్నారు. ఇటీవలి కాలంలో జొన్న రొట్టెలకు ఆదరణ బాగా పెరిగింది. జొన్నల్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉన్నాయని ఎన్ఐహెచ్ (నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్) నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇతర ధాన్యాలతో పోలిస్తే, జొన్నల్లో శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు, ఫినోలిక్ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడమే కాక, దీర్ఘకాలిక రోగాల ప్రమాదాన్ని తగ్గిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. రోజూ వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందో ఇక్కడ చూద్దాం.

పోషక విలువలు

జొన్నల్లో విటమిన్ బి1, బి2, బి3తో పాటు ఫైబర్, ప్రోటీన్, ఇనుము, కాల్షియం వంటి ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడంతో పాటు కండరాలను బలోపేతం చేస్తాయి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ ఈ పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అంటున్నారు. అలాగే, రక్తంలో ఆక్సిజన్ సరఫరాకు అవసరమైన ఇనుము జొన్న రొట్టెల్లో ఎక్కువగా ఉంటుంది.

ఎముకలకు బలం

జొన్న రొట్టెల్లో కాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు మరియు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. రోజూ వీటిని తీసుకోవడం ద్వారా ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మధుమేహానికి చెక్ పెట్టొచ్చు..

గోధుమలతో పోల్చితే జొన్నల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంటే, రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా, స్థిరంగా పెరుగుతాయి. దీని వల్ల మధుమేహం ఉన్నవారికి జొన్న రొట్టెలు ఎంతో ఉపయోగకరం. 2017లో ‘జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం’లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో, జొన్న రొట్టెలు తినడం వల్ల టైప్-2 డయాబెటిస్ రోగుల్లో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గాయని పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ కుమార్ బృందం తెలిపింది.

ఇతర ప్రయోజనాలు

రోగ నిరోధక శక్తి: జొన్న రొట్టెలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

జీర్ణ శక్తి: ఇందులోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను సమర్థవంతంగా పనిచేయడానికి తోడ్పడుతుంది.

బరువు నియంత్రణ: రెండు జొన్న రొట్టెలు తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది, ఇది బరువు తగ్గాలనుకునేవారికి ఎంతో ఉపయోగం.

మంట తగ్గింపు: జొన్నల్లోని యాంటీఆక్సిడెంట్లు మరియు ఫైటోకెమికల్స్ శరీరంలో మంటను తగ్గిస్తాయి.

గుండె ఆరోగ్యం: కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.

రోజూ జొన్న రొట్టెలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గడంతో పాటు శరీరం సమతులంగా, ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం జొన్న రొట్టెలు మంచి ఎంపిక.