Hair Health: ఒత్తుగా, పొడవుగా జుట్టు పెరగాలంటే ఈ ఫుడ్స్ తినాల్సిందే..!
ఆకర్షణీయమైన దట్టమైన జుట్టు ఎవరికైనా కావాలనిపిస్తుంది. అయితే మనం ఉపయోగించే కొన్ని ఆయిల్ లు, క్రీమ్ లు శాశ్వత పరిష్కారం ఇవ్వకపోగా.. మరిన్ని సమస్యలను సృష్టిస్తాయి. కానీ మన శరీరానికి లోపలి నుండి పోషణ అందేలా కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటే.. జుట్టు సహజంగానే ఆరోగ్యంగా పెరుగుతుంది. అలాంటి ముఖ్యమైన ఐదు పోషక పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గుడ్డులో జుట్టు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన బయోటిన్, విటమిన్ B12, విటమిన్ D, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. వీటిలోని ప్రోటీన్ జుట్టును బలంగా ఉంచి తెగిపోకుండా కాపాడుతుంది. రోజూ ఉదయం ఒక గుడ్డు తీసుకుంటే.. జుట్టుకు లోతైన పోషణ లభించి జుట్టు బలంగా, మెరిసేలా పెరుగుతుంది.
బాదంలో బయోటిన్, విటమిన్ E, ఒమేగా 3 కొవ్వులు మెగ్నీషియం వంటి శక్తివంతమైన పోషకాలు ఉంటాయి. ఇవి తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి జుట్టు రాలే సమస్యలను తగ్గిస్తాయి. మెగ్నీషియం తలకు రక్త ప్రసరణను మెరుగుపరచి జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. రోజుకు కొన్ని బాదం గింజలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
బచ్చలికూరలో విటమిన్ A, విటమిన్ C, ఐరన్, ఫోలేట్ బయోటిన్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టుకు కావాల్సిన ఆక్సిజన్ ను అందించి జుట్టు నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయి. విటమిన్ A తల చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతుంది. ఈ ఆకుకూరను వేపుడు, కూర లేదా సలాడ్ రూపంలో తీసుకుంటే జుట్టుకు గట్టి బలం లభిస్తుంది.
సాల్మన్ చేపలో ఉన్న ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, బయోటిన్, విటమిన్ Dలు తలపైన రక్త ప్రసరణను మెరుగుపరచి.. జుట్టు వేగంగా పెరిగేలా చేస్తాయి. జుట్టు పొడిబారకుండా తేమగా ఉంచడంలో ఇది సహాయపడుతుంది. వారానికి కనీసం రెండు సార్లు సాల్మన్ ను ఆహారంలో చేర్చుకోవడం జుట్టు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
చియా, అవిసె గింజలు అలాగే వాల్ నట్స్, గుమ్మడి గింజలు వంటివి ముఖ్యమైన తృణధాన్యాలు. వీటిలో జింక్, సెలీనియం, బయోటిన్, ఒమేగా 3 వంటి జుట్టుకు అవసరమైన పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టుకు రక్త ప్రసరణను మెరుగుపరచి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. వీటిని రోజూ తక్కువ మొత్తంలో తినడం లేదా సలాడ్ లలో కలిపి తీసుకోవడం ఎంతో మంచిది.
జుట్టు కోసం బయట బాధపడాల్సిన అవసరం లేదు. పైన చెప్పిన ఆహారాలను మీరు క్రమం తప్పకుండా తీసుకుంటే జుట్టు ఆరోగ్యంగా మారి సహజంగా వేగంగా పెరుగుతుంది.




