Anemia: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే రక్తహీనత కావచ్చు.. ఈ పదార్థాలు తీసుకోండి..!
Anemia: ప్రస్తుతమున్న రోజుల్లో అనారోగ్యం బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. తినే ఆహారం, ఒత్తిడి, మానసిక ఆందోళన తదితర కారణాల వల్ల వివిధ వ్యాధులు చుట్టుముట్టేస్తున్నాయి..
Anemia: ప్రస్తుతమున్న రోజుల్లో అనారోగ్యం బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. తినే ఆహారం, ఒత్తిడి, మానసిక ఆందోళన తదితర కారణాల వల్ల వివిధ వ్యాధులు చుట్టుముట్టేస్తున్నాయి. ఇక మన శరీరంలో రక్తం అనేది ముఖ్యమైనది. ఇందులో ముఖ్యమైనవి ఎర్ర రక్తకణాలు. వీటిలో హిమోగ్లోబిన్ ఉంటుంది. ఈ కణాలు ప్రాణ వాయువును శరీరంలోని అన్ని భాగాలకు అందించి, కార్బన్-డై-ఆక్సైడ్‌ను ఊపిరితిత్తులకు చేరవేస్తాయి. శరీరంలో ఎర్ర రక్తకణాలు లేదా హిమోగ్లోబిన్ తగ్గడమే ‘రక్తహీనత’. దీన్నే ‘ఎనీమియా’ అంటారు.
రక్తహీనతను తొలిదశలో గుర్తించడం కష్టమే. కానీ ఆ ప్రభావం శరీరంపైనా, మెదడుపైనా తీవ్రంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా జ్ఞాపకశక్తి మందగించడం, మాటలు సరిగా రాకపోవడం, గణితంలో ప్రావీణ్యత తగ్గడం.. అలాగే శారీరకంగా అలసట, ఆకలి తగ్గడం, ఆట-పాటలలో వెనుకబడటం, వ్యాధి నిరోధకత సన్నగిల్లడం.. తదితర కారణాలు కనిపిస్తుంటాయి. అంటు వ్యాధులు చాలావేగంగా తీవ్రస్థాయికి చేరే ఆస్కారం ఉంటుంది. ఆ తరువాత వైద్యం చేసినా దుష్ప్రభావాలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి.
పిల్లల్లో రక్తహీనత:
మన దేశంలో 25-40 శాతం పిల్లలు వివిధ వయసులలో రక్తహీనతకు గురవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. దీంతో కళ్లు, గోళ్ళు తెల్లగా మారుతాయి. ఆకలి బాగా తగ్గిపోతుంది. మట్టి, సున్నం, కాగితాలు, బలపాలు, చాక్‌పీస్‌లు తింటూ ఉంటారు. పాలు తాగడానికి ఆసక్తి చూపుతారు.
కారణాలు ఏమిటి?
అయితే తినే ఆహారంలో తగినంత ఐరన్ లేకపోవడం, మితిమీరిన పాల వినియోగం వల్ల ఘన పదార్థాలు తగ్గుతాయి. ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి-12 లేకపోవడం ప్రధాన కారణాలు. వీటితోపాటు జంక్‌ఫుడ్స్ తినడం, శీతల పానీయాలు తాగడం, కడుపులో నులి పురుగులు కూడా కారణాలేనని నిపుణులు వెల్లడిస్తున్నారు.
నివారణ చర్యలేమిటి?
కాగా, ఐరన్ ఎక్కువగా ఉండే ఆకు కూరలు, ఎండు ఫలాలు, దానిమ్మ, చిక్కుళ్లు, మాంసాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. పిల్లలందరికీ ఐరన్ మందులు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. భారత ప్రభుత్వం ‘ఎనీమియా ముక్త్ భారత్’ కార్యక్రమంలో భాగంగా వారానికి రెండుసార్లు.. ఆరు నెలల వయసు నుంచి ఐదు సంవత్సరాల వారికి ఐరన్ సిరప్, 6-19 సంవత్సరాల వారికి ఐరన్ మాత్రలు ఇస్తారు. దీంతోపాటు సంవత్సరానికి రెండుసార్లు ఆరు నెలల వ్యత్యాసంతో నులి పురుగుల మందు ఇవ్వాలి. ఐరన్ సిరప్ ఆహారానికి ముందు ఇస్తే ఒంటికి బాగా పడుతుంది. సిరప్ వల్ల పళ్లు తాత్కాలికంగా రంగు మారకుండా, నీటితో పుక్కిలించి మింగాలి. మలం కూడా తాత్కాలికంగా నల్లరంగులో ఉంటుంది. అయినా, భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.