World Heart Day 2021: ఈ లక్షణాలు కూడా గుండెపోటుకు సంకేతాలే.. వీటిని అశ్రద్ధ చేస్తే సమయం మించిపోవచ్చు!
ఛాతీ నొప్పి..మంట అనేది గుండెపోటు అత్యంత సాధారణ లక్షణాలు. చాలామందికి ఇది తెలుసు. కానీ, గుండెపోటును సూచించే కొన్ని ఇతర లక్షణాలు కూడా ఉన్నాయి.
World Heart Day 2021: ఛాతీ నొప్పి..మంట అనేది గుండెపోటు అత్యంత సాధారణ లక్షణాలు. చాలామందికి ఇది తెలుసు. కానీ, గుండెపోటును సూచించే కొన్ని ఇతర లక్షణాలు కూడా ఉన్నాయి. అయితే, ఈ లక్షణాలను రోగులు గుర్తించలేరు. సాధారణమైన లక్షణాలుగా భావిస్తారు. దీంతో చివరి నిమిషం వరకూ గుండేనొప్పి గురించి తెలుసుకోలేరు.
అమెరికాలోని పెన్ స్టేట్ హెర్షే హార్ట్ అండ్ వాస్కులర్ ఇనిస్టిట్యూట్ ఎండీ డాక్టర్ చార్లెస్ ఛాంబర్స్ చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన గుండె నొప్పికి కారణమయ్యే లక్షణాలను కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవం. ఈ సందర్భంగా, గుండెపోటును సూచించే 7 ప్రధాన లక్షణాల గురించి తెలుసుకోండి …
- చేతుల్లో నొప్పి: శరీరం ఎడమ వైపు నొప్పి అనుభూతి గుండెపోటును సూచిస్తుంది. ఈ నొప్పి ఛాతీ నుంచి మొదలై శరీరం వైపుకు చేరుకుంటుందని ఛాంబర్స్ చెప్పారు. నేను కొంతమంది రోగులను పరిశీలించాను. వారి చేతుల్లో నొప్పి ఉన్నట్టు చెప్పారు. తరువాత వారిని పరీక్షించాను. అప్పటికే వారిలో గుండెనొప్పి పరిస్థితి వచ్చేసింది. అందువల్ల, అటువంటి లక్షణాలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.
- గొంతు – దవడలో నొప్పి: గొంతు- దవడలో నొప్పి కూడా గుండెపోటు లక్షణం కావచ్చు. ఛాతీలో ఒత్తిడి ఉన్నప్పుడు, దాని ప్రభావం గొంతు- దవడలో నొప్పి రూపంలో కనిపిస్తుంది. ఇది జరిగితే, వీలైనంత త్వరగా వైద్య సలహా తీసుకోండి. తద్వారా నివారణ సకాలంలో చేయవచ్చు.
- మైకం: మైకం కూడా గుండెపోటుకు సంకేతమని నిపుణులు అంటున్నారు. నిజానికి, గుండెపోటు వచ్చినప్పుడు, గుండె రక్తాన్ని పంప్ చేయలేకపోతుంది. ఫలితంగా, బీపీ తక్కువగా ఉంటుంది. శరీరం కదులుతున్నట్లు రోగి భావిస్తాడు.
- పాదాలు.. చీలమండలలో వాపు: పాదాలు.. చీలమండలలో వాపుకు అనేక కారణాలు ఉన్నాయి. మీరు గుండె జబ్బుల రిస్క్ జోన్‌లో ఉంటే, ఈ లక్షణాన్ని అస్సలు విస్మరించవద్దు. ఇది గుండెపోటుకు సంకేతం. కారణాన్ని అర్థం చేసుకోవడానికి డాక్టర్‌తో మాట్లాడండి. గుండెపోటుకు ముందు శరీరం రక్తాన్ని సరిగా పంప్ చేయకపోతే అలాంటి పరిస్థితి తలెత్తుతుంది.
- నయంకాని దగ్గు: మీరు ఇప్పటికే గుండెకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. మీకు దగ్గు తగ్గకుండా వస్తుంటే.. మీరు రిస్క్ జోన్‌లో ఉంటారని నిపుణులు చెబుతున్నారు. తెలుపు, లేత గులాబీ శ్లేష్మం వస్తుంటే, అది గుండె జబ్బుకు సంకేతం. శరీర అవసరాలకు అనుగుణంగా మీ గుండె పనిచేయలేనప్పుడు ఇది జరుగుతుంది.
- చెమటలు పట్టడం: మీరు చల్లని వాతావరణంలో కూడా చెమటలు పడుతున్నట్లయితే, అప్రమత్తంగా ఉండటం అవసరం. ఎందుకంటే ఇది గుండెపోటుకు సంకేతం కూడా కావచ్చు. ఇది మీకు జరుగుతున్నట్లయితే .. దానికి కారణం మీకు అర్థం కాకపోతే, వెంటనే వైద్య సలహా తీసుకోండి.
- కడుపు నొప్పి, వాంతులు.. అజీర్ణం: కొంతమందికి గుండెపోటు వచ్చే ముందు వాంతులు అవుతాయని ఛాంబర్స్ చెప్పారు. ఈ లక్షణాలు పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇది కాకుండా, కడుపు నొప్పి.. అజీర్ణం విషయంలో అప్రమత్తంగా ఉండండి. భయపడవద్దు, వైద్యుడిని సంప్రదించండి ఎందుకంటే కొన్ని సాధారణ కడుపు వ్యాధులు కూడా ఈ లక్షణాలను చూపుతాయి.
Heart Stroke: ఈ 9 లక్షణాలు ఉన్నట్లయితే.. గుండెపోటుకు సంకేతమే.! వెంటనే అలెర్ట్ అవ్వండి..