Sleep Apnoea: నిద్రలో ఆ సమస్యను దెయ్యం అనుకుని భయపడుతున్నారా..? భారత్ లో విస్తరిస్తున్న కొత్త వ్యాధి!
ప్రపంచవ్యాప్తంగా దాదాపు వంద కోట్ల మందిని ప్రభావితం చేస్తున్న 'అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA)' అనే నిద్ర సంబంధిత సమస్య, వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా మరింత తీవ్రంగా మారవచ్చు, దీని బారిన పడే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరగొచ్చు అని ఒక కొత్త అధ్యయనం తేల్చింది. 'నేచర్ కమ్యూనికేషన్స్' జర్నల్‌లో ప్రచురించిన ఈ నివేదిక, గ్లోబల్ వార్మింగ్ నిద్రలో శ్వాస తీసుకోవడంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియజేస్తుంది.

న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) 2023లో ‘స్లీప్ మెడిసిన్ రివ్యూస్’ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, భారతదేశంలో పని చేసే వయస్సు గల 10.4 కోట్ల మంది అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాతో బాధపడుతున్నారు. వీరిలో దాదాపు 50 శాతం మంది మధ్యస్థ లేదా తీవ్రమైన రూపంలో ఈ సమస్యను కలిగి ఉన్నారు. వాతావరణ మార్పులు ఈ సంఖ్యను మరింత పెంచవచ్చని ప్రస్తుత అధ్యయనం హెచ్చరిస్తోంది.
స్లీప్ అప్నియా అంటే ఏమిటి?
స్లీప్ అప్నియా అనేది ఒక సాధారణ నిద్ర రుగ్మత. నిద్రిస్తున్నప్పుడు సరిగా శ్వాస తీసుకోలేకపోవడమే దీని ప్రధాన లక్షణం. ఈ స్థితిలో గొంతులోని కండరాలు శ్వాస మార్గాలను ఇరుకుగా మార్చడం వల్ల శ్వాస తీసుకోవడం, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు ప్రభావితమవుతాయి. దీని గురించి అవగాహన లేని వారు చాలా మంది తమ మీద దెయ్యం వచ్చి వాలిందని, గొంతునులుముతోందని చెప్తుంటారు. నిజానికి ఈ సమస్య ఉన్నవారిలో ఇలా జరుగుతుంటుంది. స్లీప్ అప్నియా వల్ల గుండె సంబంధిత వ్యాధులు, ఆందోళన, నిరాశ, డిమెన్షియా, పార్కిన్సన్స్ వ్యాధి వంటి మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని గత అధ్యయనాలు తెలిపాయి.
అధ్యయనంలో కీలక అంశాలు:
అధిక ఉష్ణోగ్రతలు ఉన్న రోజుల్లో స్లీప్ అప్నియా వచ్చే అవకాశాలు 45 శాతం వరకు పెరగవచ్చని ఈ అధ్యయనం కనుగొంది. వాతావరణ మార్పుల ప్రభావం యూరోపియన్ దేశాల్లో మరింత బలంగా ఉండొచ్చని అంచనా. అయితే, భారతదేశం, ఇజ్రాయెల్, బ్రెజిల్ వంటి తక్కువ తలసరి స్థూల దేశీయ ఉత్పత్తి (GDP) ఉన్న దేశాల జనాభాలో ఈ ప్రభావాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
పారిశ్రామికీకరణకు ముందు స్థాయిల కంటే ప్రపంచ వాతావరణ ఉష్ణోగ్రత 1.8 డిగ్రీల సెల్సియస్ పెరిగితే, 2100 నాటికి అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా వల్ల కలిగే భారం, ప్రభావాలు, ఖర్చులు రెట్టింపు కావచ్చని అధ్యయనం అంచనా వేసింది. 2023లో గ్లోబల్ వార్మింగ్ కారణంగా స్లీప్ అప్నియా పెరగడం వల్ల 29 దేశాలలో 7.8 లక్షలకు పైగా ఆరోగ్యకరమైన జీవిత సంవత్సరాలు, 10.5 కోట్ల కార్యాలయ పని దినాలు కోల్పోయినట్లు రచయితలు పేర్కొన్నారు. దీనివల్ల మొత్తం 98 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని, ఇందులో కార్యాలయ ఉత్పాదకత నష్టం 30 బిలియన్ డాలర్లు, జీవన నాణ్యత నష్టం 68 బిలియన్ డాలర్లుగా ఉందని వివరించారు.
ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ హెల్త్ అండ్ మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ స్లీప్ హెల్త్ నుండి డాక్టర్ బాస్టియన్ లీచాట్, ఈ అధ్యయనం తమకు వాతావరణ కారకాలు ఓఎస్‌ఏ తీవ్రతను ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవడానికి సహాయపడిందని తెలిపారు. “గ్లోబల్ వార్మింగ్ నిద్రలో శ్వాస తీసుకోవడాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది, ప్రపంచ ఆరోగ్యం, శ్రేయస్సు, ఆర్థిక వ్యవస్థపై ఎలా ప్రభావం చూపుతుంది అనే అంశంపై రూపొందించిన మొదటి అధ్యయనం ఇదే” అని డాక్టర్ లీచాట్ అన్నారు.
అధ్యయనం తీరు:
ఈ అధ్యయనం కోసం 41 దేశాల నుండి 1,16,620 మంది ప్రజల 500 రాత్రులకు పైగా నిద్ర డేటాను (మొత్తం సుమారు 6.2 కోట్ల రాత్రులు) విశ్లేషించారు. పాల్గొన్న వారి పరుపుల కింద ఉంచిన సెన్సార్‌లను ఉపయోగించి ఈ డేటాను సేకరించారు. ఆపై, ఈ నిద్ర డేటాను వాతావరణ నమూనాలతో సేకరించిన వివరణాత్మక 24 గంటల ఉష్ణోగ్రత సమాచారంతో పోల్చారు.
