వాల్‌నట్స్ చేసే మ్యాజిక్ గురించి మీకు తెలుసా..? రోజు నానబెట్టి రెండూ తిన్నా చాలు..!
గుండె ఆరోగ్యానికి కొలెస్ట్రాల్ ను నియంత్రించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ (HDL) ను పెంచుకోవాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాత్రి నానబెట్టిన వాల్‌నట్స్ ఉదయం తినడం వల్ల ఈ లక్ష్యం నెరవేరుతుంది.

మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్‌లు ఉంటాయి. ఒకటి HDL (మంచి కొలెస్ట్రాల్), మరొకటి LDL (చెడు కొలెస్ట్రాల్). ఈ కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా LDL స్థాయిలు పెరిగితే గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. తప్పుడు ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వంటి అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా చాలా మందిలో కొలెస్ట్రాల్ సమస్యలు వస్తున్నాయి. అందుకే ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
నిపుణుల సలహా ఏంటి..?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాత్రిపూట నీటిలో నానబెట్టిన రెండు వాల్‌నట్స్ ఉదయం తినడం వల్ల కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. నానబెట్టిన వాల్‌నట్స్‌లో ఉండే పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయని వారు తెలిపారు.
వాల్‌నట్స్ ప్రయోజనాలు
- ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్.. ఇవి శరీరంలో LDL ఉత్పత్తిని తగ్గించి రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడానికి సహాయపడతాయి.
- ఫైబర్.. వాల్‌నట్స్‌లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థలో కొలెస్ట్రాల్‌ను పట్టుకుని.. అది శరీరానికి శోషించబడకుండా బయటకు పంపేస్తుంది.
- మంచి కొలెస్ట్రాల్ పెంపు.. వాల్‌నట్స్ మంచి కొలెస్ట్రాల్ (HDL) ను పెంచుతాయి. ఈ HDL రక్తనాళాల్లోని అదనపు కొలెస్ట్రాల్‌ను తిరిగి కాలేయానికి చేరవేస్తుంది.
ఎంత మోతాదులో తీసుకోవాలి..?
మంచి ఫలితాల కోసం రోజుకు సుమారు 28 గ్రాములు (ఒక గుప్పెడు) నానబెట్టిన వాల్‌నట్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని ఓట్స్, పండ్లు, కూరగాయలతో కలిపి తింటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. రెగ్యులర్ గా వాల్‌నట్స్ తీసుకోవడం వల్ల మొత్తం కొలెస్ట్రాల్, LDL, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయని, HDL స్థాయిలు పెరుగుతాయని అనేక అధ్యయనాలు నిరూపించాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




