Health Tips: ఈ అలవాటు మీకు ఉన్నట్లయితే.. వెంటనే మానేయండి.. లేదంటే అంతే సంగతులు!
Health Tips: ఇలా కాస్త కూడా గ్యాప్ ఇవ్వకుండా టీవీలకు అతుక్కుపోవడం మీ ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా.? అవునండీ.! ఒకే చోట కాస్త బ్రేక్ కూడా ఇవ్వకుండా..
ఎంటర్టైన్మెంట్ కోసం ఈ రోజుల్లో చాలామంది టీవీలపై దృష్టి సారిస్తున్నారు. ప్రతీ ఛానెల్‌లోనూ కొత్త కొత్త ప్రోగ్రామ్స్, లేటెస్ట్ సినిమాలు వస్తుండటంతో జనాలకు కావల్సినంత వినోదం లభిస్తోంది. ఇంకేముంది ‘వర్క్ ఫ్రమ్ హోం’(Work From Home)లో ఆఫీస్ వర్క్ చేస్తున్న ఉద్యోగులు, ఆన్ లైన్ క్లాసుల(Online Classes)తో సతమతమవుతున్న పిల్లలు తీరిక దొరికితే చాలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అయితే ఒక్కోసారి వాళ్లకి టీవీలో నచ్చిన సినిమాలు వరుసగా వస్తే చాలు.. టైం అనేది తెలియకుండానే గంటల తరబడి వాటికి అతుక్కుపోతున్నారు. కానీ ఇలా కాస్త కూడా గ్యాప్ ఇవ్వకుండా టీవీలకు అతుక్కుపోవడం మీ ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా.? అవునండీ.! ఒకే చోట కాస్త బ్రేక్ కూడా ఇవ్వకుండా నిరంతరంగా 4 గంటల కంటే ఎక్కువసేపు టీవీ చూడటం మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని తాజా అధ్యయనంలో వెల్లడైంది. రక్తం గడ్డకట్టడం(Blood Clots) లాంటి అనారోగ్య సమస్యలు వస్తాయని పరిశోధకులు అంటున్నారు. జాతీయ మీడియా ఆజ్ టక్(Aaj Tak)లో ఈ అధ్యయనం గురించి ఓ కథనం ప్రచురితమైంది. ఆ వివరాలు ఇవే..
శారీరకంగా చురుగ్గా ఉండే వారికి కూడా ఈ సమస్య రావచ్చు..
యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీ ప్రచురించిన తాజా అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అమెరికా, జపాన్ దేశాల్లో 40, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 1,31,421 మంది వ్యక్తుల టీవీ చూసే సమయాన్ని అంచనా వేసిన పరిశోధకులు.. రెండు గంటల పాటు టీవీ చూసే వారికంటే.. నాలుగు గంటల పాటు నిరంతరం టీవీ చూసే వ్యక్తుల్లో 35 శాతం ఎక్కువగా రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉందని గుర్తించారు. అయితే వీళ్లంతా కూడా వయసు పైబడినవారు కదా.! శారీరికంగా చురుకుదనం కలిగిన వారికి ఇలాంటి సమస్యలు తలెత్తవని మీరు అనుకోవచ్చు. కానీ శారీరికంగా చురుకుగా ఉండే వ్యక్తులు కూడా 4 గంటల కంటే ఎక్కువ సమయం నిరంతరం టీవీ చూసినా.. వారికి కూడా రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు తలెత్తుతాయని డాక్టర్ సెట్టర్ కునుట్సర్ వెల్లడించారు.
టీవీ చూసేటప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి తినొద్దు..
మీకు ఇష్టమైన సినిమా ఏదైనా టీవీలో ప్రసారమవుతున్నప్పుడు.. మీరు కచ్చితంగా మధ్యలో బ్రేక్ తీసుకోకుండా నిరంతరం టీవీ చూస్తారు. అయితే ఇలా ఎక్కువసేపు టీవీ చూస్తున్నట్లయితే.. తప్పనిసరిగా ప్రతీ 30 నిమిషాలకు ఒకసారి విరామం తీసుకోవాలని డాక్టర్ సెటర్ కునుత్సోర్ చెప్పారు. అంతేకాకుండా ఈ సమయంలో ఫాస్ట్ ఫుడ్ లేదా స్నాక్స్ లాంటివి తినొద్దని సూచించారు. ఒకవేళ తింటే ఊబకాయం లేదా అధిక రక్తపోటు వంటి సమస్యలు తలెత్తవచ్చునని.. ఈ వ్యాధుల కారణంగా రక్తం గడ్డకట్టే ప్రమాదం ఏర్పడవచ్చునని తెలిపారు.
కాగా, డాక్టర్ సెటర్ కునుత్సోర్, ఆయన సహచరులు కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఈ పరిశోధనలో టీవీ ఎక్కువ సమయం చూసే కొంతమందికి కాళ్లలో రక్తం గడ్డకట్టినట్లుగా కనుగొన్నారు. కొన్ని సందర్భాల్లో, రక్తం గడ్డకట్టడం విరిగి వదులుగా ప్రసరణ ద్వారా ఊపిరితిత్తులకు చేరుకోవచ్చు. ఇది మరింత ప్రాణాంతకంగా మారుతుంది. అందుకే టీవీ చూసే ప్రతీ 30 నిమిషాలకోసారి కాళ్ళను స్ట్రెచ్ చేస్తూ ఉందని పరిశోధకులు సూచించారు.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వివిధ అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల ఆధారంగా తీసుకున్నవి. దీనితో టీవీ9, టీవీ9 తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు.