Covid Vaccine : కరోనా సెకండ్‌వేవ్‌ను అడ్డుకోడానికి కేంద్రం వడివడి అడుగులు.. దేశంలోని ప్రముఖ డాక్టర్లతో మోదీ కీలక సమావేశం
Corona Vaccine : జడలు విప్పుతోన్న కరోనా సెకండ్‌వేవ్‌ను అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది.
Corona Vaccine : జడలు విప్పుతోన్న కరోనా సెకండ్‌వేవ్‌ను అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సినేషన్ వయోపరిమితిని తగ్గించింది. అంతేకాదు, కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో భాగంగా ఇప్పటికే ఫార్మా కంపెనీలు, వైద్య నిపుణులతో పలు కీలక భేటీలు నిర్వహిస్తోన్న ప్రధాని నరేంద్రమోదీ రేపు మరో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. రేపు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు దేశంలో ప్రముఖ డాక్టర్లతో ప్రధాని మోదీ కరోనా కట్టడిపై వర్చువల్ గా సమావేశమవుతారు. దేశంలో రోజుకు రెండున్నర లక్షలకుపైగా కరోనా కేసులు నమోదు అవుతున్నవేళ, ప్రధాని నిర్వహించే సమావేశంలో డాక్టర్లు ఇచ్చే సూచనలు ఏంటి అన్నది ఆసక్తిగా మారింది. ఇక, దేశంలో ఒకవైపు వ్యాక్సిన్లకు కొరత ఉందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ డోసులను గణనీయంగా పెంచుతోంది కేంద్రప్రభుత్వం. 18 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్లు ఇస్తున్నారంటే – దేశంలో కోట్లాది సంఖ్యలో ఉన్నవారికి కరోనా టీకాలు ఇస్తున్నట్లు అర్థం. కరోనాను ఎదుర్కొనేందుకు ఈ నాలుగు నుంచి ఆరువారాల సమయం కీలకం అని డాక్టర్లు హెచ్చరిస్తున్న నేపథ్యంలో- కేంద్రం తీసుకున్న నిర్ణయం- గేమ్‌ఛేంజర్ అవుతుందా అనే పాయింట్ తెరమీదకు వచ్చింది.
ఇక, కేంద్రం తాజా నిర్ణయం మేరకు మే ఒకటో తేదీ నుంచి 18 ఏళ్లకు పైబడిన వారు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ఇది మూడో కీలకదశ అని చెప్పవచ్చు. ఒకటో దశలో వ్యాక్సిన్లను ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ఇచ్చారు. ఆ తర్వాతి దశలో 60 ఏళ్లపైబడిన వారికి కరోనా వ్యాక్సినేషన్ ఇచ్చారు. ఆ తర్వాత 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్లు ఇచ్చారు. మరో 10 రోజులు ఆగితేచాలు.. 18 ఏళ్లు పైబడిన వారికి సైతం వ్యాక్సినేషన్ ఇస్తారు. ఆసుపత్రుల్లో పెరుగుతున్న కోవిడ్ బాధితుల రద్దీని దృష్టిలో పెంచుకుని వ్యాక్సినేషన్ వయోపరిమితిని తగ్గించింది కేంద్రప్రభుత్వం.