Obesity: ఊబకాయులూ బీ అలర్ట్.. పొంచి ఉన్న క్యాన్సర్ మహమ్మారి.. మారకపోతే కష్టమే..
అధిక బరువు కారణంగా క్యాన్సర్ మహమ్మారి మనిషి ముంచేస్తోందని పరిశోధకులు గుర్తించారు. క్యాన్సర్ ఊబకాయుల్లో ప్రాణనష్టాన్ని పెంచుతోందని, చికిత్స తీసుకుంటున్నా అది ప్రాణాంతకంగా మారుతోందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఇటీవల కాలంలో మనిషిని వేధిస్తోన్న ప్రధానమైన సమస్యలలో ఊబకాయం కూడా ఒకటి. శారీరక శ్రమలేని జీవన విధానం.. ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం కారణంగా చాలా మంది ఊబకాయులుగా మారిపోతున్నారు. దీని వల్ల అనేక వ్యాధులు చుట్టుముడతున్నాయి. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఇప్పుడు ఈ అధిక బరువు కారణంగా మరో మహమ్మారి మనిషి ముంచేస్తోందని పరిశోధకులు గుర్తించారు. ఆ మహమ్మారి క్యాన్సర్. ఈ క్యాన్సర్ ఊబకాయుల్లో ప్రాణనష్టాన్ని పెంచుతోందని, చికిత్స తీసుకుంటున్నా అది ప్రాణాంతకంగా మారుతోందని చెబుతున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం.. మనిషికి సోకుతున్న క్యాన్సర్‌లలో 4 నుంచి 8 శాతం స్థూలకాయం కారణంగానే వస్తున్నాయి. ముఖ్యంగా రొమ్ము, కొలోరెక్టల్, ఎండోమెట్రియల్, మూత్ర పిండాలు, అన్నవాహిక, ప్యాంక్రియాటిక్, కాలేయం, పిత్తాశయ క్యాన్సర్‌లకు ఈ అధిక బరువే కారణమని నిపుణులు నొక్కి చెబుతున్నారు.
అధ్యయనం చెబుతోంది ఇది..
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఇటీవల ఓ అధ్యయనం చేసింది. దీనిలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. 18 నుంచి 40 ఏళ్ల వయస్సున్న భారీకాయుల్లో 18 రకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్ లో ప్రచురించారు. స్పెయిన్‌లోని కాటలోనియాలో 2.6 మిలియన్ల ప్రజలకు సంబంధించిన డిజిటల్ ఆరోగ్య డేటాను పరిశోధకులు తీసుకొని అధ్యయనం చేశారు. వారిలోని బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ) క్యాన్సర్ ప్రమాదాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో నిరంతరం పర్యవేక్షించారు. బరువుతో ముడిపడి ఉన్న కొత్త క్యాన్సర్లలో లుకేమియా, నాన్ హాడ్కిన్ లింఫోమా వంటివి వస్తున్నట్లు గుర్తించారు. అలాగే ధూమపానం అలవాటు లేని వారిలో తల, మెడ, మూత్రాశయ క్యాన్సర్లు ఉన్నట్లు నిర్ధారించారు.
ఊబకాయానికి క్యాన్సర్‌కు లింకేంటి..
నిపుణుల అభిప్రాయం ప్రకారం శరీరంలోని ప్రధాన అవయవాల చుట్టూ ఇన్‌ఫ్లేషన్ ను కలిగించే వెసెరల్ కొవ్వు దీనికి ప్రధాన కారణం. ఇన్సులిన్, ఈస్ట్రోజన్ వంటి హార్మోన్లను ఇది దెబ్బతీస్తుంది. ఫలితంగా క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. ఇనఫ్లేషన్ వల్ల వెసెరెల్ కొవ్వు ఆక్సిజన్ ను అవయవాలకు సక్రమంగా వెళ్ల నివ్వదు. ఫలితంగా శరీరంలో నిరోధకత తగ్గిపోతుంది. కణాల విభజన విపరీతంగా జరిగి కణతులు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరగడం వల్ల కణాలు అధికంగా ఉత్పత్తి అయ్యి కణితులు ఏర్పడతాయి.
ఊబకాయాన్ని ఇలా నియంత్రించాలి..
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి మీ శరీర బరువును నియంత్రించడం కూడా చాలా అవసరం. అందుకు మీరు పాటించవలసిన ప్రధాన నియమాలు ఇవి..
వ్యాయామం.. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతి ఒక్కరికీ శారీరక శ్రమ చాలా అవసరం. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం వారానికి 150 నిమిషాలు మితమైన వ్యాయామం లేదా ఏరోబిక్ యాక్టివిటీ, లేకుంటే 75 నిమిషాల తీవ్రమైన ఏరోబిక్ యాక్టివిటీని చేయొచ్చు.
ఒత్తిడి వద్దు.. ఒత్తిడిని తగ్గించుకోవాలి. దీని కారణంగా శరీరం, మనసుపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇది అధిక ఆకలిని కూడా కలిగిస్తుంది. ఫలితంగా ఊబకాయానికి దారితీస్తుంది.
పోషకాహారం.. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, చిక్కులు వంటివి ఎక్కువగా తీసుకోవాలి.
మంచి నిద్ర.. సరైన విశ్రాంతి సమయం అవసరం. గాఢమైన నిద్ర లేకపోతే ఇబ్బందులు తప్పవు
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




