ఉప్పు, తాగే నీటిలోనూ ప్లాస్టిక్ ముక్కలేనా? హెల్తీ ఫుడ్‌లోనూ పొంచి ఉన్న మైక్రోప్లాస్టిక్స్ ముప్పు
ఆరోగ్యం కోసం మనం ఎంతో శ్రద్ధగా ఎంచుకునే ఆహార పదార్థాల్లో కూడా మన కంటికి కనిపించని ఒక భయంకరమైన శత్రువు దాగి ఉంటుంది. పండ్లు, కూరగాయలు, తేనె.. ఇలా ప్రతిదీ స్వచ్ఛమైనదే అని మనం అనుకుంటాం. కానీ ప్రస్తుత కాలుష్య ప్రపంచంలో ఈ పదార్థాల్లో కూడా మైక్రోప్లాస్టిక్స్ తిష్ట వేసుకుని కూర్చున్నాయి.

కేవలం ప్లాస్టిక్ కవర్లు, డబ్బాలు వాడకపోతే సరిపోతుందని భావిస్తే పొరపాటే. మనం నిత్యం వాడే ఉప్పు నుండి తాగే నీటి వరకు ప్రతిచోటా ఈ ప్రమాదకర రేణువులు విస్తరించాయి. అసలు ఈ మైక్రోప్లాస్టిక్స్ మన ఆహారంలోకి ఎలా చేరుతున్నాయి? వీటి వల్ల కలిగే ఆరోగ్య నష్టాలను ఎలా అరికట్టాలి? మనం తీసుకునే ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
మైక్రోప్లాస్టిక్స్ అంటే..
5 మిల్లీమీటర్ల కంటే చిన్నవిగా ఉండే ప్లాస్టిక్ పరమాణువులను మైక్రోప్లాస్టిక్స్ అంటారు. పారిశ్రామిక వ్యర్థాలు, ప్లాస్టిక్ ప్యాకెట్లలో ఆహారాన్ని నిల్వ చేయడం, నీటి కాలుష్యం వంటి కారణాల వల్ల ఇవి మన ఆహార గొలుసులో చేరుతున్నాయి. ముఖ్యంగా ప్యాక్ చేసిన పదార్థాల్లో వీటి పరిమాణం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని అరికట్టాలంటే ఆహార నిల్వ పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉంది.
1. సముద్రాహారం
చేపలు, రొయ్యలు ఇష్టంగా తినేవారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా రొయ్యలు, పీతలు వంటి గుల్ల కలిగిన జీవులు సముద్రంలోని మైక్రోప్లాస్టిక్స్‌ను ఎక్కువగా శోషించుకుంటాయి. కాబట్టి వీటికి బదులుగా పెద్ద చేపలను ఎంచుకోవడం కొంత వరకు సురక్షితం. ఇవి ప్లాస్టిక్ ప్రభావానికి తక్కువగా గురయ్యే అవకాశం ఉంటుంది.
2. టేబుల్ సాల్ట్ లో ప్లాస్టిక్
మనం వంటల్లో వాడే సముద్రపు ఉప్పు తయారీ విధానం వల్ల అందులో మైక్రోప్లాస్టిక్ రేణువుల సాంద్రత ఎక్కువగా ఉంటోంది. దీనికి ప్రత్యామ్నాయంగా అయోడైజ్డ్ సాల్ట్ లేదా తగినంత శుద్ధి చేసిన ఉప్పును ఎంచుకోవడం మంచిది. వీలైనంత వరకు సహజ సిద్ధమైన పద్ధతుల్లో తయారైన ఉప్పును వాడటానికి మొగ్గు చూపాలి.
3. ప్లాస్టిక్ సీసాల్లో నీరు వద్దు
చాలామంది ప్రయాణాల్లో ప్లాస్టిక్ సీసాల్లో దొరికే నీటిని కొని తాగుతుంటారు. కానీ ఈ బాటిల్స్ నుండి మైక్రోప్లాస్టిక్స్ నీటిలో చేరుతాయి. దీనికి బదులుగా కార్బన్ లేదా యుఎఫ్ ఫిల్టర్లు ఉన్న నీటిని తాగడం శ్రేయస్కరం. ఈ నీటిని నిల్వ చేయడానికి ప్లాస్టిక్ సీసాలకు బదులుగా స్టెయిన్‌లెస్ స్టీల్ సీసాలు లేదా రాగి బిందెలను ఉపయోగించాలి.
4. తేనె – టీ బ్యాగ్స్
తేనెను శుద్ధి చేసే క్రమంలో, అలాగే ప్లాస్టిక్ సీసాల్లో ప్యాక్ చేయడం వల్ల అందులోకి ప్లాస్టిక్ రేణువులు చేరుతున్నాయి. కాబట్టి గాజు సీసాల్లో లభించే ముడి తేనెను మాత్రమే వాడాలి. అలాగే టీ బ్యాగ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నైలాన్‌తో తయారయ్యే టీ బ్యాగ్స్‌ను వేడి నీళ్లలో ముంచినప్పుడు అవి మైక్రోప్లాస్టిక్స్‌ను విడుదల చేస్తాయి. అందుకే టీ పొడిని నేరుగా నీటిలో మరిగించి తాగడమే ఆరోగ్యకరం.
మైక్రోప్లాస్టిక్స్ మన కంటికి కనిపించని శత్రువులు. మన ఆహారపు అలవాట్లలో చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా ఈ ముప్పు నుండి కొంత వరకు తప్పించుకోవచ్చు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, గాజు, స్టీల్ పాత్రలను వాడటమే మన ఆరోగ్యానికి రక్ష.
NOTE: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే జారీ చేయబడినవి.. వీటిని మేం ధృవీకరించలేదు.. వీటిపై మీకు సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.
