Health Tips: పచ్చిగుడ్డుతో తయారయ్యే ఈ క్రీమ్ ఇంకా తింటున్నారా.. దీని అనర్థాలు తెలిస్తే షాకవుతారు
సాండ్‌విచ్‌ల రుచిని పెంచాలన్నా, ఫ్రెంచ్ ఫ్రైస్‌ను మరింత ఇష్టంగా తినాలన్నా చాలామంది మయోనైజ్‌ను నంచుకుంటారు. పిల్లలే కాదు, పెద్దలు కూడా దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. కొన్ని సలాడ్‌లు, సాస్‌లలోనూ కలుపుకొని ఆస్వాదిస్తారు. క్రీమీగా, తియ్యగా కాస్త వెరైటీగా ఉండే మయోనైజ్ అందరికీ అంత ప్రియమైనది. రుచి బాగుందని తింటున్నారే కానీ, ఇది ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తుందని తాజాగా తమిళనాడు ప్రభుత్వం తేల్చి చెప్పింది. అక్కడ మయోనైజ్ వాడకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అంతేకాదు, మయోనైజ్‌ను హై రిస్క్ ఫుడ్‌గా ప్రకటించింది. అంటే ఇది ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు.

రుచికరంగానే ఉన్నప్పటికీ ఇది నెమ్మదిగా శరీరానికి విషంలా మనుషుల ఆరోగ్యాన్ని పూర్తిగా పాడు చేస్తోంది. అధికారులు మయోనైజ్‌లో హానికరమైన బ్యాక్టీరియాలను గుర్తించారు. సల్మోనెల్లా టైఫిమురియం, సల్మోనెల్లా ఎంటరెటైడిస్‌తో పాటు ఈ కోలి బ్యాక్టీరియాలు మయోనైజ్‌లో ఉంటున్నాయి. అందుకే వెంటనే దాని వాడకాన్ని నిషేధించారు. అసలు మయోనైజ్‌ను వేటితో తయారు చేస్తారు? ఇది తినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మయోనైజ్ తయారీలోనే ప్రమాదం..
మయోనైజ్‌లో ముఖ్యంగా రెండు పదార్థాలుంటాయి: ఒకటి నూనె అయితే మరొకటి గుడ్డు పచ్చసొన. గుడ్డు పచ్చసొనలో ఉండే లెసిథిన్ అనే ఫ్యాట్ మయోనైజ్‌కు చిక్కదనాన్ని ఇస్తుంది. అయితే ఇందులో వెనిగర్, నిమ్మరసంతో పాటు రకరకాల ఫ్లేవర్స్‌ను కలుపుతారు. ఇవన్నీ రుచి కోసం కలిపేవే. కానీ మయోనైజ్‌లో దాదాపు 80 శాతం నూనె ఉంటుంది. నూనెతో రిస్క్ తక్కువే అయినా, సమస్యంతా గుడ్డు పచ్చసొనతోనే. ప్రతి గుడ్డులోనూ ఈ బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. అయితే మనం గుడ్డును ఉడకబెట్టడం లేదా ఆమ్లెట్‌లా వేసుకోవడం లాంటివి చేస్తాం కాబట్టి ఆ ప్రభావం తగ్గిపోతుంది.
గుడ్డు పెంకు ఏర్పడే సమయానికే ఈ బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశముంటుంది. కొన్నిసార్లు పెంకుపై ఉన్న బ్యాక్టీరియా లోపలి సొనలోకి కూడా చేరుతుంది. సరైన విధంగా దీన్ని వండకపోతే ఆ బ్యాక్టీరియా చనిపోకుండా అలాగే ఉంటుంది. పైగా వాసనలో కానీ, రంగులో కానీ ఎలాంటి మార్పు ఉండదు. అందుకే అందులో బ్యాక్టీరియా ఉన్న విషయం కూడా మనకు తెలియకుండా వాడేస్తాం. గుడ్లను సరైన విధంగా నిల్వ చేయకపోయినా ఇలాంటి ఇబ్బందులు వస్తాయి.
మయోనైజ్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు
ఈ గుడ్లలోని పచ్చసొనతో మయోనైజ్ తయారు చేయడం వల్లే చాలామంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. చాలా చోట్ల సరైన క్వాలిటీ చెక్ లేకుండా మయోనైజ్‌ను తయారు చేస్తున్నారు. ఈ సల్మోనెల్లా బ్యాక్టీరియా కారణంగా డయేరియా, జ్వరం, వాంతులు లాంటి ఇబ్బందులు వస్తాయి. కొన్నిసార్లు డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కలుషితమైన గుడ్ల నుంచే ఇది వ్యాప్తి చెందుతుంది.
గుడ్డుతో తయారు చేసే పదార్థాలు ఏవైనా సరే వాటిని సరైన విధంగా నిల్వ చేయాలి. రిఫ్రిజిరేషన్ ఎలా ఉందనే దానిపై ఆ ఆహార పదార్థం ఎన్ని రోజుల పాటు నిల్వ ఉంటుందనేది ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే అందులో సల్మోనెల్లా బ్యాక్టీరియా పదింతలు అవుతుంది. నిజానికి ఈ బ్యాక్టీరియా తక్కువ పరిమాణంలో ఉంటే పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అలాంటి బ్యాక్టీరియాను చంపే శక్తి మన పొట్టలోని యాసిడ్‌కు ఉంటుంది. ఫుడ్ పాయిజన్ కాకుండా కాపాడుతుంది. కానీ ఫ్రిజ్‌లో పెట్టకుండా రూమ్ టెంపరేచర్‌లో ఉంచిన మయోనైజ్‌లో బ్యాక్టీరియా విపరీతంగా ఉంటుంది. అది తిన్న వెంటనే ప్రభావం చూపిస్తుంది.
గుడ్లను నిల్వ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
గుడ్డుపై విపరీతంగా మరకలున్నా, పాడైపోయినట్టు కనిపించినా వెంటనే పారేయాలి. పెంకు కాస్త పగిలి ఉన్నా సరే అందులోకి సల్మోనెల్లా బ్యాక్టీరియా చేరుకునే ప్రమాదముంటుంది. ఎప్పుడూ గుడ్లను నీళ్లతో కడగకూడదు. ఇలా చేస్తే పైన ఉన్న బ్యాక్టీరియా లోపలికి వెళ్తుంది. ఏ మాత్రం తేడాగా అనిపించినా వెంటనే పారేయండి. గుడ్లను కచ్చితంగా ఫ్రిజ్‌లోనే ఉంచాలి. ఫ్రిజ్‌లో ఎగ్స్ కోసం ఇచ్చే బాక్స్‌లోనే వాటిని స్టోర్ చేయాలి. అయితే ఇలా తీసుకొచ్చిన ఎగ్స్‌ను మరీ ఎక్కువ రోజుల పాటు అలాగే స్టోర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. వారం రోజుల్లోనే వాటిని వాడేలా చూసుకోవాలి.
మయోనైజ్‌కు బదులుగా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు
ఉదర సంబంధిత సమస్యలున్న వాళ్లు మయోనైజ్‌కు దూరంగా ఉండటమే మంచిది. ముఖ్యంగా పొట్టలో ఇరిటేషన్, పెద్ద పేగుపై అల్సర్స్ లాంటి ఇబ్బందులున్న వాళ్లు దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి. మయోనైజ్‌కు బదులుగా యోగర్ట్, పెరుగు, బీట్‌రూట్ యోగర్ట్ లాంటివి ప్రయత్నించమని డైటీషియన్లు సూచిస్తున్నారు. అయితే పొట్టలో సమస్యలున్న వాళ్లే కాకుండా మిగతా వాళ్లు కూడా వీలైనంత వరకు మయోనైజ్ వినియోగాన్ని తగ్గించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.




