AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఆరోగ్యాన్ని పాడుచేసే సైలెంట్ కిల్లర్..! జాగ్రత్త పడలేదో అంతే సంగతి..!

మన రోజువారీ జీవితంలో నిద్ర చాలా ముఖ్యం. చాలా మంది దీన్ని సాధారణ అవసరంగా భావించినా.. తాజా అధ్యయనాల ప్రకారం నిద్రలేమి మన ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా ఒక్క రాత్రి సరిగా నిద్రపోకపోయినా శరీరంలో చాలా మార్పులు వస్తాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

మీ ఆరోగ్యాన్ని పాడుచేసే సైలెంట్ కిల్లర్..! జాగ్రత్త పడలేదో అంతే సంగతి..!
Sleeping
Prashanthi V
|

Updated on: Jun 26, 2025 | 4:44 PM

Share

కువైట్‌ లోని డాస్‌ మాన్ డయాబెటిస్ ఇన్‌ స్టిట్యూట్ నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం.. తగినంత నిద్ర లేని రాత్రి తర్వాత శరీరంలో నీరు చేరడం (ఫ్లూయిడ్ రిటెన్షన్) లాంటి సమస్యలు మొదలవుతాయని తేలింది. దీనికి ప్రధాన కారణం రోగనిరోధక వ్యవస్థలో మార్పులు చేసే నాన్ క్లాసికల్ మోనోసైట్స్ అనే కణాలు పెరగడమే అని చెప్పారు.

ఈ కణాలు శరీరంలో నీరు నిల్వ చేసేలా చేస్తాయి. మెటబాలిజం ప్రభావితం అవడం వల్ల కూడా నీరు చేరడం ఎక్కువవుతుంది. ముఖ్యంగా శరీర బరువు తక్కువగా ఉన్నవారిలో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపించవచ్చు.

అంతేకాక శరీరంలో ఉండే ప్రో ఇన్‌ ఫ్లమేటరీ (వాపు కలిగించే) యాంటీ ఇన్‌ఫ్లమేటరీ (వాపు తగ్గించే) ప్రతిచర్యల మధ్య సమతుల్యతను నిద్రలేమి పూర్తిగా దెబ్బతీస్తుంది. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ స్థాయిని పెంచుతుంది.

ఈ అధ్యయనం కోసం 237 మంది ఆరోగ్యవంతులపై పరిశోధన జరిపారు. వీరికి చేతికి వేసే స్మార్ట్ ట్రాకర్ల ద్వారా వారి నిద్ర తీరును పరిశీలించారు. ఒక రాత్రి తక్కువగా నిద్రపోయిన వారిలో రోగనిరోధక కణాల వ్యవస్థ మారిపోయినట్లు గుర్తించారు.

తరచుగా నిద్రలేమి ఉంటే ఇది తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. ఉదాహరణకి గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్, అధిక బరువు లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అంతేకాక రోగనిరోధక శక్తి బలహీనపడటం వల్ల చిన్న చిన్న వైరస్‌ లు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు కూడా త్వరగా అంటుకునే అవకాశముంది.

మరొక కీలక విషయం ఏంటంటే.. నిద్ర సరిపోకపోతే వ్యాక్సిన్లు పనిచేసే సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంటే టీకాలు వేసుకున్నా కూడా దాని ప్రభావం సరిగా ఉండకపోవచ్చు.

నిద్రలేమి మన మానసిక ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది. మన ఊహాశక్తి, ఒకే విషయంపై దృష్టి పెట్టే శక్తి, పని సామర్థ్యం క్రమంగా తగ్గిపోతాయి. దీన్నిబట్టి చూస్తే.. ఒక మంచి జీవనశైలిలో నిద్రకు ఉండే ప్రాముఖ్యత ఎంత పెద్దదో అర్థమవుతుంది.

కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. ఇది శరీరానికి విశ్రాంతిని కలిగించడమే కాదు.. రోగనిరోధక వ్యవస్థను స్థిరంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.