కర్భూజను వీరు ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు..! వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?
వేసవికాలం వచ్చినప్పుడల్లా శరీరానికి చల్లదనాన్ని అందించే పండ్లు తినడం అనివార్యం. అందులో ముఖ్యంగా కర్భూజ చాలా మందికి ఇష్టమైన పండు. ఇది తిన్న వెంటనే దాహాన్ని తీరుస్తుంది. ముఖ్యంగా ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల వేసవి వేడిని తట్టుకునే శక్తిని అందిస్తుంది. పైగా ఇందులో విటమిన్ ఇ, జింక్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ వంటి అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పౌష్టికతను అందించడంతో పాటు, జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచేలా సహాయపడతాయి.

ఆరోగ్య సమస్యలు ఉన్న కొంతమంది వ్యక్తులు కర్భూజను తినకుండా దూరంగా ఉండటం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో దీనిని అధికంగా తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డయాబెటిస్, కిడ్నీ సమస్యలు, చర్మ సంబంధిత అలర్జీలు, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు ఈ పండును మితంగా తీసుకోవడం లేదా వైద్యుల సలహా తీసుకుని మాత్రమే తినడం ఉత్తమం.
డయాబెటిస్
డయాబెటిస్ ఉన్నవారు కర్భూజను ఎక్కువగా తినకూడదు. నిపుణుల మాట ప్రకారం ఈ పండులో గ్లైసెమిక్ ఇండెక్స్ 60-80 మధ్య ఉంటుంది. దీన్ని అధికంగా తీసుకున్నట్లయితే రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగిపోవచ్చు. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు దీన్ని తినే ముందు వైద్యుని సలహా తీసుకోవడం ఉత్తమం.
చర్మ సమస్యలు
చర్మ సమస్యలు లేదా అలర్జీలతో బాధపడేవారు కర్భూజను తినకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కొందరికి ఇది తిన్న వెంటనే దద్దుర్లు, దురద, వాపు, మచ్చలు వంటి సమస్యలు రావొచ్చు. అలాంటి వారు వైద్యుల సూచన మేరకు మాత్రమే దీనిని తీసుకోవడం ఉత్తమం.
గ్యాస్ట్రిక్, IBS
పేగుల సమస్యలు, గ్యాస్, ఉబ్బరం, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ (IBS) ఉన్నవారు కర్భూజను తినకపోవడమే మంచిది. ఇందులో అధికంగా ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. దీనిని ఎక్కువగా తీసుకుంటే పేగుల్లో గ్యాస్ పెరిగి అసౌకర్యానికి గురికావొచ్చు.
కిడ్నీ సమస్యలు
కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కూడా కర్భూజను తినకూడదు. దీని పొటాషియం శాతం అధికంగా ఉండటం మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేసే అవకాశం ఉంది. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే పొటాషియం శరీరంలో పేరుకుపోయి ఆరోగ్య సమస్యలు తీసుకురావచ్చు.
హైపోనాట్రేమియా సమస్య
కర్భూజలో 90 శాతం వరకు నీరు ఉంటుంది. దీనిని అధికంగా తీసుకున్నట్లయితే శరీరంలోని సోడియం స్థాయిలు తగ్గి హైపోనాట్రేమియా అనే సమస్య ఏర్పడే అవకాశం ఉంది. దీని వల్ల ఒంట్లో వాపు, నీరసం, మూత్రపిండాల సమస్యలు రావచ్చు.
ఎప్పుడు తినాలి..?
కర్భూజను ఉదయం లేదా మధ్యాహ్నం తినడం మంచిది. అయితే ఖాళీ కడుపుతో తినకూడదు. ఖాళీ కడుపుతో తింటే గ్యాస్, ఉబ్బరం, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే రాత్రి సమయంలో కూడా దీన్ని తినకూడదు. మధ్యాహ్నం సమయంలో తినడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.