Climb Stairs: మెట్లు ఎక్కడం వల్ల ఇన్ని ప్రయోజనాలా..! తెలిస్తే లిఫ్ట్ అస్సలు యూజ్ చేయరు..!
మెట్లు ఎక్కడం సాధారణమైన పనిలా అనిపించినా ఇది శరీరానికి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. శరీర బలం పెంచడం, కొవ్వు తగ్గించడం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ప్రత్యేకంగా వ్యాయామ సమయం కేటాయించలేని వారు ఈ చిన్న మార్పును అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. మెట్లు ఎక్కడం ద్వారా శరీరానికి సరైన వ్యాయామం లభిస్తుంది.

ప్రతిరోజూ మెట్లు ఎక్కడం ఒక సాధారణమైన చర్యగా కనిపించవచ్చు. కానీ దీనివల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయి. సాధారణ నడక లేదా జాగింగ్ చేయడం కంటే మెట్లు ఎక్కడం శరీరానికి ఎక్కువ ప్రయోజనం ఇస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. 15 నిమిషాలు నడక లేదా జాగింగ్ చేయడం కంటే 15 నిమిషాలు మెట్లు ఎక్కితే రెండు రెట్లు ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు.
ఎక్కువ మందికి అధిక బరువు, శరీరంలో పేరుకుపోయిన కొవ్వు అనేవి ప్రధాన సమస్యలు. వీటిని తగ్గించుకోవడానికి మెట్లు ఎక్కడం ఒక సులభమైన పరిష్కారంగా మారింది. 6 నిమిషాల పాటు నిరంతరం మెట్లు ఎక్కితే శరీరంలోని మొత్తం కొవ్వు సుమారు 15 శాతం వరకు తగ్గించవచ్చు. ప్రత్యేకమైన వ్యాయామ పద్ధతులు అవసరం లేకుండా మెట్లు ఎక్కడం ద్వారా కూడా కొవ్వును సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ ప్రక్రియలో శరీరంలోని ముఖ్యమైన భాగాలు బలపడతాయి. కండరాలు కూడా సమతుల్యత పొందుతాయి.
మెట్లు ఎక్కడం శారీరక బలం పెంచడంలో కూడా ప్రభావవంతమైన వ్యాయామం. పరిశోధనలు చెబుతున్న దాని ప్రకారం 8 వారాల పాటు క్రమంగా మెట్లు ఎక్కితే శారీరక బలం 10 నుంచి 15 శాతం వరకు పెరుగుతుంది. క్రమంగా వృద్ధిచెందే ఈ వ్యాయామం శరీరానికి పూర్తిగా సహజమైనదిగా ఉండి కండరాలను సక్రమంగా పనిచేయింపజేస్తుంది. కేవలం కొవ్వు తగ్గించడమే కాదు శరీర బలం కూడా మెరుగుపడుతుందని ఇది నిరూపించింది.
మెట్లు ఎక్కడం శరీరానికి కేలరీలు కరుగడానికి కూడా ఉపయోగపడుతుంది. క్రమంగా రోజు ఐదు సార్లు 15 మీటర్ల మేర మెట్లు ఎక్కితే 302 కేలరీలు ఖర్చవుతాయి. మీరు అధిక బరువును తగ్గించుకోవడానికి క్రమంగా మెట్లు ఎక్కడాన్ని చక్కగా వినియోగించుకోవచ్చు. కేలరీలను కరిగించడానికి ఇది చక్కని మార్గం.
మెట్లు ఎక్కేటప్పుడు పాదం మొత్తం మెట్లపై పడేలా జాగ్రత్తగా ఎక్కాలి. అలా నెమ్మదిగా మెట్లు ఎక్కితే మీరు గాయపడే అవకాశం తగ్గిపోతుంది. ఇది ముఖ్యంగా మీ వెన్ను, చీలమండలపై ఒత్తిడి లేకుండా సురక్షితంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల మీ శరీరానికి మరింత సహాయం చేయవచ్చు.
నేటి బిజీ జీవితంలో మనం సరైన శారీరక వ్యాయామానికి సమయం కేటాయించలేకపోవచ్చు. కానీ రోజువారీ పనుల్లో మెట్లు ఎక్కడాన్ని ప్రాధాన్యం ఇవ్వడం వల్ల శరీరానికి మంచి లాభాలు పొందవచ్చు. కొవ్వు తగ్గడం, శారీరక బలం పెరగడం, కండరాలు బలపడడం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కనుక మెట్లు ఎక్కడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు.