మరో కొత్త వైరస్ టెన్షన్.. కోవిడ్ కంటే డేంజర్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ప్రపంచం కోవిడ్ నుండి కోలుకుంటుండగా, H5 బర్డ్ ఫ్లూ కొత్త ప్రమాదంగా మారింది. ఇది జంతువుల నుండి మనుషులకు వ్యాపిస్తే, కోవిడ్ కంటే తీవ్రమైన మహమ్మారి కావచ్చు. ప్రస్తుతానికి మనుషులకు చాలా అరుదుగా సోకుతున్నప్పటికీ, భవిష్యత్ పరిణామాలపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి..

ప్రపంచం కోవిడ్ భయం నుండి ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. కానీ, మరో కొత్త ప్రమాదం హెచ్చరిస్తోంది. అదే, H5 బర్డ్ ఫ్లూ వైరస్. పక్షులు, కోళ్లను ఇప్పటికే నాశనం చేసిన ఈ వైరస్, ఇటీవల జంతువులకు కూడా సోకుతోంది. ఈ వైరస్ మ్యుటేషన్ చెంది మనుషులకు వ్యాపిస్తే, అది కోవిడ్-19 కంటే కూడా తీవ్రమైన విపత్తును సృష్టించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఫ్రాన్స్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ పాశ్చర్ నిపుణురాలు డాక్టర్ మేరీ అన్నే రామీక్స్ వెల్టి ప్రకారం.. ఈ వైరస్ మనుషులకు సోకడానికి వీలుగా రూపాంతరం చెందితే, పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఈ వైరస్ మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందగలిగితే.. అది కోవిడ్-19 కంటే పెద్ద మహమ్మారిని తీసుకురావచ్చు. కోవిడ్-19 వచ్చిన కొత్తలో మనకు దానిని ఎదుర్కొనే శక్తి లేనట్లే, ఈ H5 వైరస్‌ను ఎదుర్కొనే శక్తి కూడా ప్రస్తుతం ప్రజలకు లేదు. ఫ్లూ వైరస్‌లు పిల్లలతో సహా ఆరోగ్యంగా ఉన్నవారిని కూడా చంపగలవు. అందుకే దీనిపై జాగ్రత్త అవసరం.
ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు భరోసా ఇస్తున్నారు. వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్‌కు చెందిన డాక్టర్ గ్రెగోరియో టోర్రెస్ ప్రకారం.. మనుషులకు ఈ వైరస్ సోకడం ఇప్పటికీ చాలా అరుదు. అందుకే మన రోజువారీ జీవితాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మ్యుటేషన్ జరిగినా గతంలో కోవిడ్-19 ముందు ఉన్న దానికంటే ఇప్పుడు ప్రపంచం మెరుగ్గా సిద్ధంగా ఉంది. నిఘా వ్యవస్థలు, వ్యాక్సిన్‌లను తయారు చేసే సామర్థ్యం ఇప్పుడు పెరిగింది.
మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- H5N1 వైరస్ అనేది బర్డ్ ఫ్లూలో అత్యంత ప్రమాదకరమైన రకం. జాగ్రత్తగా ఉండటానికి కొన్ని చిట్కాలు పాటించాలి.
- సోకినట్లు అనుమానం ఉన్న పక్షులకు లేదా జంతువులకు దూరంగా ఉండండి.
- కోడి మాంసం, గుడ్లను తినే ముందు బాగా ఉడికించాలి.
- పక్షులు లేదా జంతువులతో పని చేసే వారు వ్యక్తిగత పరిశుభ్రతను ఖచ్చితంగా పాటించాలి.
- మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో పక్షులు అసాధారణంగా చనిపోతే, వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




