మళ్లీ వేడి చేసిన ఆహారాన్ని తింటున్నారా..? ఇది ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా..?
ప్రస్తుత రోజుల్లో ఫ్రిజ్ ఉండటం వల్ల చాలా మంది వండిన ఆహారాన్ని మళ్లీ మళ్లీ వేడి చేసి తినడం అలవాటు చేసుకున్నారు. అయితే కొన్ని రకాల పదార్థాలను ఒకసారి వండి.. మళ్లీ వేడి చేయడం వల్ల శరీరానికి హాని కలిగే అవకాశం ఉంది. ఈ అలవాట్లు క్రమంగా ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. మళ్లీ వేడి చేయకూడని ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వండిన అన్నాన్ని రాత్రి లేదా మరుసటి రోజు వేడి చేసి తినడం చాలా మందికి అలవాటు. అయితే బాసిల్లస్ సెరియస్ అనే ఒక రకం బ్యాక్టీరియా బియ్యంలో ఉండే అవకాశం ఉంది. ఇది వేడి చేసినా నశించకపోవచ్చు. దీని వల్ల వాంతులు, కడుపు నొప్పి, తలనొప్పి లాంటి సమస్యలు రావచ్చు.
పాలకూర లాంటి ఆకుకూరల్లో నైట్రేట్ అనే పదార్థం సహజంగా ఉంటుంది. ఇది మళ్లీ వేడి చేసినప్పుడు నైట్రైట్ హానికర పదార్థంగా మారే ప్రమాదం ఉంది. దీని వల్ల రక్తానికి ఆక్సిజన్ అందడం తగ్గుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలి.
గుడ్డు ప్రోటీన్లతో నిండి ఉంటుంది. గుడ్డు వండి తింటే సరిపోతుంది. కానీ మళ్లీ వేడి చేయడం వల్ల ఇందులోని ప్రోటీన్లు గట్టిగా మారి జీర్ణక్రియను దెబ్బతీయవచ్చు. ఇది కడుపునొప్పి, దాహం లాంటి సమస్యలకు దారి తీయవచ్చు.
చికెన్ లాంటి మాంసాహారం వండిన తర్వాత ఫ్రిజ్ లో సరిగా నిల్వ చేయకపోతే.. అది వేడి చేసినప్పుడు హానికరమైన బ్యాక్టీరియా పెరగవచ్చు. దీని వల్ల తేలికపాటి ఫుడ్ పాయిజనింగ్ నుండి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి వండిన వెంటనే తినటం మంచిది.
సీఫుడ్ (సముద్రపు ఆహారం చేపలు, రొయ్యలు) దాదాపు ప్రతి ఇంట్లో ఇష్టమైన ఆహారం. అయితే మళ్లీ వేడి చేయడం వల్ల ఇందులోని ప్రోటీన్లు మారిపోతాయి. ఈ మార్పులు కొంతమందిలో అలర్జీ లేదా దద్దుర్లు, గ్యాస్ సమస్యలకు కారణమవుతాయి.
పుట్టగొడుగులు ప్రోటీన్, విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారాలు. కానీ ఈ పదార్థాన్ని మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల ఇవి పోషక విలువలు కోల్పోయి.. శరీరానికి హానికరంగా మారవచ్చు. కొంతమందిలో అజీర్ణం లాంటి సమస్యలు తలెత్తవచ్చు.
వండిన బంగాళాదుంపను గాలి చొరబడకుండా జాగ్రత్తగా ఉంచకపోతే.. అవి వేడి చేసినప్పుడు విషపూరిత పదార్థాలు విడుదల కావచ్చు. దీని వల్ల జీర్ణ సమస్యలు రావచ్చు. వీటిని ఫ్రెష్ గా వండుకుని వెంటనే తినటం ఉత్తమం.
ఆహార పదార్థాలను మళ్లీ వేడి చేయడంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. కొన్ని వంటకాలను మొదటిసారి వండిన వెంటనే తినడమే ఉత్తమం. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు ఇలా మళ్లీ వేడి చేసిన ఆహారాన్ని తినడంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.




