Fatty Liver: దేశంలో ప్రబలుతున్న ఫ్యాటీ లివర్ డిసీజ్.. ఈ లక్షణాలు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే

మనం లివర్‌ను పెద్దగా పట్టించుకోం కానీ.. మన గురించి ఎంతో కష్టపడే ఆర్గాన్ అదే. శరీరంలోని విష పదార్థాలు అన్నింటినీ బయటకు పంపడంలో కీ రోల్ పోషిస్తోంది. రక్తంలో గ్లూకోజు పరిధిలో ఉండటానికి.. తిన్న ఫుడ్ ఆరగడానికి.. ఇలా ఎన్నెన్నో పనుల్లో భాగమవుతుంది. అయితే అలాంటి కాలేయం ఇప్పుడు కొవ్వుతో విలవిల్లాడుతోంది.

Fatty Liver:  దేశంలో ప్రబలుతున్న ఫ్యాటీ లివర్ డిసీజ్.. ఈ లక్షణాలు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే
Fatty Liver
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 10, 2024 | 2:41 PM

దేశంలో ఫ్యాటీ లివర్ డిసీజ్ ప్రబలుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైద్య నిపుణులు. ఫ్యాటీ లివర్ డిసీజ్‌ను మహమ్మారిగా గుర్తించాలని కేంద్రానికి లేఖ రాశారు. డయాబెటిస్, ఊబకాయం రోగులలో 90శాతం మందికి FLD ఉన్నట్లు చెప్తున్నారు. అధిక బరువు గలవారిలో 75% మందిలో, తీవ్ర ఊబకాయుల్లో 90% మందిలో ఇది కనిపిస్తుంటుంది. ఇప్పటికే దేశంలో 30 నుంచి 40 కోట్ల మంది ఫ్యాటీ లివర్‌ బాధితులున్నారని, రెండు, మూడేళ్లలో ఇంకా పెరుగుతారని హెచ్చరిస్తున్నారు.

నాన్ ఆల్కహాలిక్ వ్యక్తుల్లోనూ.. FLD వ్యాపిస్తోందని అంటున్నారు గ్యాస్ట్రో ఎంటమాలజీ డాక్టర్లు. ఫ్యాటీ లివర్‌ మహమ్మారిగా ప్రకటించి.. దాని నివారణపై పనిచేయాలని నేషనల్ హెల్త్ టాస్క్ ఫోర్స్‌కు లేఖ రాశామంటున్నారు వైద్య నిపుణులు. ఫ్యాటీ లివర్‌ అనేది సైలెంట్‌ కిల్లర్‌గా మారిందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.  కాలేయానికి గొప్ప గుణం ఉంది. డ్యామేజ్ అయినా తిరిగి కోలుకోవటానికే ప్రయత్నిస్తుంది. మరి మనం ఆ మాత్రం చాన్స్ కూడా ఇవ్వకపోవడమే ఇప్పుడు ప్రధాన సమస్య.

లివర్ జబ్బుల్లో బాగా గుర్తించాల్సింది- తొలుత పైకి ఎలాంటి సింటమ్స్ కనిపించవు. లక్షణాలు కనిపించటం మొదలయ్యేసరికే జబ్బు బాగా ముదిరిపోతుంది. ఎందుకంటే లివర్ 50-60% డ్యామేజ్ అయినా పైకేమీ తెలియదు. అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది.

ఫ్యాటీ లివర్ లక్షణాలు:

  • కడుపులో కుడిభాగంలో బరువుగా అనిపించడం
  • చిన్నగా కడుపునొప్పి రావడం
  • అలసట..
  • పొట్ట అసౌకర్యం
  • ఆకలి లేకపోవడం..
  • కామెర్లు..

కాలేయం పనితీరును బట్టి ఎఫ్‌ 0 నుంచి ఎఫ్‌ 4 వరకూ స్కోరింగ్‌ ఇస్తారు. ఈ పరీక్షల్లో ఎఫ్‌4 ఫలితం వస్తే వాళ్లు మూడో దశకు చేరుకున్నట్టు. మూడో దశను లివర్‌ ఫైబ్రోసిస్‌ అంటారు. లివర్‌ ఫైబ్రోసిస్‌ చాలా ప్రమాదకరం. నాలుగో దశలను సిరోసిస్‌ అంటారు. ఈ దశలో కాలేయం పూర్తిగా చెడిపోతుంది. ఈ దశకు చేరుకున్నవాళ్లు 20 నుంచి 30 శాతం వరకూ చనిపోయే ప్రమాదం ఉంది.

తొలిదశ ఫ్యాటీ లివర్ సమస్యను లైఫ్ స్టైల్ మార్పుల ద్వారా సరిచేసుకోవచ్చు. ముఖ్యంగా బరువు తగ్గించుకోవటం ఎంతగానో ఉపయోగపడుతుంది. మంచి ఫుడ్ తీసుకోవాలి. కొవ్వులు, నూనె పదార్థాలు తగ్గించాలి. కూరగాయలు, ఫ్రూట్స్ బాగా క్లీన్ చేసిన తర్వాతే తినాలి. చక్కెర ఎక్కువగా ఉండే కూల్‌డ్రింకులు, ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి