లివర్, కిడ్నీల ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు ఇవే..! వీటిని తినడం అస్సలు మిస్సవ్వకండి..!
మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో లివర్, కిడ్నీలు చాలా ముఖ్యమైనవి. ఇవి శరీరంలోని ఆహారం, మందులు, వాతావరణం వల్ల చేరే హానికరమైన పదార్థాలను బయటకు పంపించే పనిలో ఉంటాయి. వీటి పనితీరులో తేడా వస్తే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే.. ఈ రెండు అవయవాలను శుభ్రంగా ఉంచే కొన్ని పండ్లను రోజూ ఆహారంలో చేర్చుకోవడం చాలా ముఖ్యం.

నేరేడు పండులో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలేయాన్ని హానికరమైన టాక్సిన్ల నుండి కాపాడతాయి. నేరేడు పండు తరచుగా తినడం వల్ల శరీరం శుభ్రపడే ప్రక్రియ వేగంగా జరుగుతుంది. ఇది మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.
దానిమ్మ పండు రక్తాన్ని పెంచడంలో ఉపయోగపడటంతో పాటు, కాలేయాన్ని శుభ్రంగా ఉంచడంలో కూడా గొప్పది. దీనిలో ఉన్న యాసిడ్ పదార్థాలు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా అడ్డుకుంటాయి. దానిమ్మ రసం తరచూ తీసుకోవడం వల్ల శరీరం ఫ్రెష్ గా ఉంటుంది.
బొప్పాయి లోని సహజ ఎంజైములు శరీరంలోని జీవక్రియ పనితీరును బాగా నిర్వహించడానికి సహాయపడతాయి. ఇది లివర్ పై పడే ఒత్తిడిని తగ్గిస్తుంది. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ కు సంబంధించిన సమస్యలు తగ్గించే గుణం దీనిలో ఉంది.
మోసంబిలో విటమిన్ C ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి శక్తినిచ్చే పండు మాత్రమే కాదు.. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో కూడా ప్రముఖంగా ఉంటుంది. ఇది కాలేయానికి శక్తినిచ్చి.. కిడ్నీల పనితీరును సహజంగా చురుకుగా చేస్తుంది.
పుచ్చకాయలో ఎక్కువ మొత్తంలో నీరు ఉంటుంది. ఇది సహజమైన డైయూరెటిక్ పండుగా పనిచేస్తుంది. అంటే శరీరంలోని అదనపు ఉప్పు, నీరు, టాక్సిన్లను మూత్రం ద్వారా బయటకు పంపుతుంది. ఇది మూత్రపిండాలు కాలేయాన్ని శుభ్రంగా ఉంచేందుకు సులభమైన సహాయ మార్గంగా చెప్పవచ్చు.
ఈ సూపర్ పండ్లను రోజువారీ ఆహారంలో చేర్చడమే కాకుండా.. ఎక్కువగా ప్రాసెసింగ్ చేసిన మైదా ఆధారిత, వేడి నూనెలో వండిన ఫాస్ట్ ఫుడ్స్ కు దూరంగా ఉండడం చాలా అవసరం. అలాంటి ఆహారాలు కాలేయాన్ని, మూత్రపిండాలను మలినాలతో నింపే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల సహజమైన, తక్కువ ప్రాసెసింగ్ ఉన్న పదార్థాలను మాత్రమే ఎంచుకోవడం మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




