Health Tips: చెప్పులు లేకుండా నడిస్తే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు.. ఆ సమస్యలు దూరం..
చెప్పులు లేకుండా నడవడాన్ని ఎర్తింగ్ అని కూడా పిలుస్తారు. మన దేశంలో ఎప్పటినుంచో ఈ విధానంపై ప్రజల్లో అవగాహన ఉంది. అయితే, ఇటీవల పలు ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి డాక్టర్లు కూడా దీనినే సూచిస్తుండటంతో మరోసారి పాపులర్ గా మారింది. ఉదయాన్నే లేలేత సూర్యకిరణాల మధ్య పచ్చిక బయళ్ల మధ్య నడవడం కొందరికి అలవాటు ఉంటుంది. ఇది కేవలం ఆహ్లాదం కోసం మాత్రమే కాదు.. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కోరుకునే వారు ఎవరైనా ఎర్తింగ్ పద్ధతిని ఫాలో అవ్వచ్చని నిపుణులు హైలైట్ చెప్తున్నారు. మానవులు రక్షణ కోసం సుమారు 40,000 సంవత్సరాల క్రితం బూట్లు ధరించడం ప్రారంభించారు. అప్పటి నుండి బూట్లు వంపులు ఉన్న చెప్పులు, సపోర్ట్ ఇచ్చేవి, కంఫర్ట్ ఇచ్చేవి ఇలా రకరకాల డిజైన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇంట్లో కూడా చెప్పులేసుకుని తిరిగే రోజులు వచ్చాయి. కానీ ఆధునిక పాదరక్షలు మితిమీరిన మద్దతును కలిగి ఉండటం వల్ల పాదాల కండరాలను ఇవి బలహీనపరిచే అవకాశం ఉందని కొందరు నమ్ముతారు. చెప్పులు లేకుండా నడవడం వల్ల గుర్తించదగిన ప్రయోజనాలు ఉన్నట్టు కొన్ని పరిశోధనల్లో తేల్చారు. చెప్పులు లేకుండా నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..
పాదాలు స్ట్రాంగ్ గా మారతాయి..
చెప్పులు లేకుండా నడిచే పిల్లలలో తరచుగా బూట్లు ధరించే వారితో పోలిస్తే బలమైన పాదాలు ఉంటాయి. పెద్దలకు, ముఖ్యంగా వృద్ధులకు, పాదాల కండరాలను బలోపేతం చేయడం వల్ల కింద పడిపోకుండా సంరక్షించవచ్చు. 2021 అధ్యయనంలో సపోర్టివ్ ఫుట్‌వేర్ నుండి మినిమల్ ఫుట్‌వేర్‌కు మారిన పెద్దలు ఆరు నెలల్లో పాదాల బలం 57 శాతం పెరిగిందని వెల్లడించిందని కోల్‌కతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌కు చెందిన వైద్య నిపుణుల పేర్కొంటున్నారు.
పాదాలపై ఒత్తిడి తగ్గుతుంది..
బూట్లు లేకుండా నడవడం వల్ల పాదాలను ఎన్నో రకాలుగా కదిలించే వీలు కలుగుతుంది. ఇది పాదాల మెకానిజంను మెరుగుపరుస్తుంది. పాదాల్లో ఉండే కొన్ని రకాల వైకల్యాలను తగ్గిస్తుంది. నడకలో ఉండే లోపాలను కూడా దీని ద్వారా మార్చుకోగలరు. చెప్పులు ధరించడానికి అలవాటుపడిన వారు మొదట్లో చెప్పులు లేకుండా నడిచేటప్పుడు పాదాలు కాస్త అసౌకర్యానికి గురికావచ్చు.. మెల్లిమెల్లిగా దీనిని అలవాటు చేసుకోవచ్చు.
పోశ్చర్ కరెక్షన్..
చెప్పులు లేకుండా రోజులో కాసేపు నడవడం వల్ల పాదాల కండరాలు, నరాలు బలంగా అవుతాయి. పాదాల గాయాల ప్రమాదం లేకుండా కండరాలను బలోపేతం చేయడం, సమతుల్యతను మెరుగుపరచడం వంటివి చేస్తాయి.
ఇవీ సైడ్ ఎఫెక్ట్స్..
కార్పెట్ వేసిన ఉపరితలాలపై ఇంటి లోపల చెప్పులు లేకుండా నడవడం సాధారణంగానే సురక్షితం. కానీ గట్టిగా, సాఫ్ట్ గా ఉండే ఫ్లోర్ మీద అంత సేఫ్ కాదు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో చెప్పులు లేకుండా నడవడం వల్ల కోతలు, ఇన్ఫెక్షన్లు (ఉదా. అరికాలి మొటిమలు, అథ్లెట్స్ ఫుట్) వడదెబ్బ వంటి ప్రమాదాలు ఉంటాయి. మధుమేహం లేదా న్యూరోపతి ఉన్నవారికి గాయాల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చెప్పులు లేకుండా నడవడం వీరికి అంత మంచిది కాదు.




