డాక్టర్ల చేతిలో ఏఐ ఆయుధం.. సిక్ కేర్ నుండి హెల్త్‌కేర్ వైపు వైద్యరంగం అడుగులు – డా.సంగీత రెడ్డి
నిన్నటి వరకు డాక్టర్లు మాత్రమే రోగిని గమనించేవారు, కానీ ఇప్పుడు రోగి నాడిని ఏఐ పసిగడుతోందని డాక్టర్ సంగీత రెడ్డి తెలిపారు. ఆసుపత్రి గడప తొక్కకముందే ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. మారుతున్న కాలంతో పాటు సిక్-కేర్ నుంచి సంపూర్ణ హెల్త్‌కేర్ వైపు భారత్ అడుగులు వేస్తుందంటూ ఆమె కీలక విషయాలు వెల్లడించారు.

ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగం వేగంగా మారుతున్న తరుణంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీలు రోగి భద్రతలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నాయని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన ఇంటర్నేషనల్ హెల్త్ డైలాగ్-2026 సందర్భంగా ఆమె ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక విషయాలు తెలిపారు. భవిష్యత్ వైద్య విధానం కేవలం వ్యాధులకు చికిత్స అందించడమే కాకుండా ముందస్తు నివారణ, సంపూర్ణ ఆరోగ్యంపై దృష్టి సారిస్తుందని వివరించారు.
ఏఐతో మారుతున్న భద్రతా ప్రమాణాలు
గతంలో వైద్య సేవలలో భద్రత అనేది పొరపాట్లు జరిగిన తర్వాత వాటిని సరిదిద్దుకునేలా ఉండేదని.. కానీ ఇప్పుడు సాంకేతికత వల్ల అది వ్యవస్థలో అంతర్భాగమైందని డాక్టర్ సంగీత రెడ్డి అన్నారు. రోగికి ప్రమాదం పొంచి ఉందని AI అల్గారిథమ్స్ ముందే హెచ్చరిస్తాయి. దీనివల్ల వైద్యులు సంక్షోభం రాకముందే నివారణ చర్యలు చేపట్టవచ్చని తెలిపారు. మెదడులో రక్తస్రావం వంటి అత్యవసర కేసులలో, స్కాన్ రిపోర్టులను AI క్షణాల్లో విశ్లేషిస్తుంది. దీనివల్ల వైద్యులు సిద్ధమయ్యే సమయం 15 నుండి 20 నిమిషాలు ఆదా అవుతుంది. ఇది రోగి ప్రాణాలను కాపాడటంలో అత్యంత కీలకమని అభిప్రాయపడ్డారు. రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయినప్పుడు.. ల్యాబ్ నుండి డాక్టర్‌కు సమాచారం అందే లోపే సిస్టమ్ అప్రమత్తం చేయడం ద్వారా సెప్సిస్ షాక్ వంటి ప్రాణాంతక పరిస్థితులను నివారించవచ్చు.
భారత్ : ప్రపంచ ఆరోగ్య వేదికపై అగ్రగామి
గ్లోబల్ హెల్త్‌కేర్‌లో భారతదేశం నాయకత్వ పాత్ర పోషించబోతోందని సంగీత రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికోసం ఆమె మూడు ప్రధాన సూత్రాలను వివరించారు..
హీల్ ఇన్ ఇండియా: అత్యున్నత నాణ్యత కలిగిన వైద్య సేవలను ప్రపంచంతో పోలిస్తే తక్కువ ఖర్చుతో అందించడం ద్వారా 120కి పైగా దేశాల రోగులను ఆకర్షించడం.
హీల్డ్ బై ఇండియా : భారతీయ యువతకు అంతర్జాతీయ స్థాయి వైద్య నైపుణ్యాలను నేర్పించడం ద్వారా ప్రపంచ ఆరోగ్య సేవలకు మానవ వనరులను అందించడం.
హీల్ ఫ్రమ్ ఇండియా: రిమోట్ కేర్, డిజిటల్ టెక్నాలజీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్న రోగికైనా భారత్ నుండి చికిత్స, సలహాలు అందించడం.
నైతికత – సవాళ్లు
సాంకేతికత ఎంత వేగంగా విస్తరిస్తున్నా, మానవ ప్రమేయం తప్పనిసరని సంగీత రెడ్డి నొక్కి చెప్పారు. AI అందించే విశ్లేషణలను వైద్యులు ధృవీకరించుకోవాలని, తద్వారా నైతిక విలువలతో కూడిన వైద్యం అందుతుందని తెలిపారు. వైద్యులకు, రోగులకు మధ్య ఉండే అనుబంధమే వైద్య రంగంలో ప్రధాన శక్తి అని, సాంకేతికత దానికి ఒక సాధనం మాత్రమేనని ఆమె అభిప్రాయపడ్డారు.
మా అంతిమ లక్ష్యం రోగులను ఆసుపత్రిలో చేర్చుకోవడం కాదు.. వారిని వారి ఇళ్ల వద్దే ఆరోగ్యంగా ఉంచడం అని డాక్టర్ సంగీత రెడ్డి స్పష్టం చేశారు. వైద్య రంగం ఇప్పుడు సిక్ కేర్ నుండి హెల్త్‌కేర్ వైపు మారుతోందని, ప్రతి కుటుంబంలోనూ ఆరోగ్యం, ఆనందం వెల్లివిరియడమే అపోలో హాస్పిటల్స్ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.
