Expensive Milk: ఆరోగ్యానికి, అందానికి ఈ పాలతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా..?
పూర్వం మన పెద్దలు గాడిద పాలు ఆరోగ్యానికి మేలని చెప్పినా అందరం తేలికగా తీసుకున్నాం. కానీ ఇప్పుడు ఆరోగ్యం అందంపై అవగాహన పెరిగాక గాడిద పాలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. కేవలం ఆరోగ్య ప్రయోజనాల కోసమే కాకుండా గాడిద పాలు చర్మ సంరక్షణలో కూడా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు వీటి గిరాకీ పెరుగుతోంది.

ఆవు, గేదె పాలతో పోలిస్తే గాడిద పాలు చాలా ఖరీదైనవని తెలుసా..? లీటరు గాడిద పాలు దాదాపు రూ.6,000 పలుకుతున్నాయి. దీని వెనుక ముఖ్య కారణం ఇందులో ఉన్న అధిక పోషక విలువలే. గాడిద పాలలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్-డి వంటి పోషకాలు అధికంగా ఉండటంతో ఆరోగ్యంగా ఉండాలనుకునే వారికి, చర్మం పట్ల శ్రద్ధ వహించే వారికి ఇది గొప్ప ఎంపికగా మారింది.
గాడిద పాలలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మార్చే గుణాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా వివిధ బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీలో గాడిద పాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. గాడిద పాలను చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మంపై నలుపు తగ్గి, సాఫ్ట్‌గా మారుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అదనంగా ఆవు లేదా గేదె పాలకు అలర్జీ ఉన్నవారు గాడిద పాలను సురక్షితంగా తీసుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
ప్రపంచ అందగత్తెల్లో ఒకరిగా పేరు పొందిన ఈజిప్ట్ మహారాణి క్లియోపాత్రా, తన చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి గాడిద పాలతోనే స్నానం చేసేదని చరిత్ర చెబుతోంది. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చకు వస్తోంది. గాడిద పాలలో ఉన్న సహజ గుణాలు చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచుతాయి కాబట్టి ఇప్పుడు చాలా మంది ఈ ప్రయోజనాలను అంగీకరిస్తున్నారు.
గాడిద పాలు తాగడమే కాదు, వాటిని పనీర్, చీజ్ తయారీకి కూడా ఉపయోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన ఫ్యూల్ చీజ్ తయారీలో గాడిద పాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారతదేశంలో రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో గాడిద పాల వ్యాపారం వేగంగా విస్తరిస్తోంది. ఇక త్వరలోనే దేశవ్యాప్తంగా దీని మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉంది.
ఎలా ఉపయోగించాలి..?
- గాడిద పాలతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం మృదువుగా మారి, నలుపు తగ్గుతుంది.
- గాడిద పాలను తాగడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- గాడిద పాలను అనేక ఔషధాల్లో ఉపయోగిస్తున్నారు.
ప్రస్తుతం గాడిద పాల ఉత్పత్తికి డిమాండ్ పెరుగుతుండటంతో భారతదేశంలో దీని వ్యాపారం జోరుగా సాగుతోంది. ఆరోగ్య ప్రయోజనాలు, బ్యూటీ ప్రొడక్ట్స్‌లో ఉపయోగం పెరుగుతుండటంతో త్వరలోనే గాడిద పాలు మరింత ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది.




