Health Tips: వామ్మో.. ముక్కు నుండి రక్తం కారడం ఆ తీవ్రమైన వ్యాధికి సంకేతమా..
కొంతమందికి తరచుగా ముక్కు నుండి రక్తం కారుతుంది. కానీ వేడి వల్ల కావచ్చు అని వారు దానిని లైట్ తీసుకుంటారు. దానిని అసలు లైట్ తీసుకోవద్దు. ఇది కేవలం వేడి వల్ల కాకపోవచ్చు. ఒక తీవ్రమైన వ్యాధికి సంకేతం కావచ్చు. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

వేడి, పొడి వాతావరణంలో ముక్కు నుండి రక్తం కారడం చాలా సాధారణం. అయితే ఇది పదేపదే జరుగుతుంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఇది శరీరంలో దాగి ఉన్న అధిక రక్తపోటు వంటి తీవ్రమైన వ్యాధికి సంకేతం కావచ్చు. అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. సకాలంలో దీనిని గుర్తించి చికిత్స తీసుకోకపోతే గుండెపోటు లేదా స్ట్రోక్‌కు దారి తీసే అవకాశం ఉంది.
అధిక రక్తపోటు – ముక్కు రక్తస్రావం మధ్య సంబంధం..?
మన ముక్కు లోపల చాలా సన్నని రక్త నాళాలు ఉంటాయి. రక్తపోటు విపరీతంగా పెరిగినప్పుడు, ఈ సున్నితమైన రక్త నాళాలు ఆ ఒత్తిడిని తట్టుకోలేక పగిలిపోతాయి. దీనివల్ల ముక్కు నుండి రక్తం కారుతుంది. సాధారణంగా రక్తపోటు 160/100 mmHg కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పరిస్థితి ఎక్కువగా సంభవిస్తుంది. చాలామందికి తమకు అధిక రక్తపోటు ఉందని తెలియదు. అటువంటి వారికి ముక్కు నుండి తరచుగా రక్తం కారడం ఒక హెచ్చరిక సంకేతంగా పనిచేస్తుంది.
ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి?
వేడి, పొడి వాతావరణం లేదా నీటి కొరత వల్ల ముక్కు నుండి రక్తం కారడం సహజం. కానీ ఈ సమస్య క్రమం తప్పకుండా జరుగుతూ, దానితో పాటుగా తల తిరగడం, తలనొప్పి, అలసట, అస్పష్టమైన దృష్టి, లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తే అది ఖచ్చితంగా అధిక రక్తపోటును సూచిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
ముక్కు నుండి రక్తం కారితే ఏం చేయాలి?
నిటారుగా కూర్చోబెట్టండి: వ్యక్తిని నిటారుగా కూర్చోబెట్టి, తలను కొద్దిగా ముందుకు వంచండి. దీనివల్ల రక్తం గొంతులోకి వెళ్లకుండా ఉంటుంది.
ముక్కును నొక్కండి: ముక్కు పైభాగాన్ని 5 నుంచి 10 నిమిషాలు తేలికగా నొక్కండి.
చల్లని క్లాత్: నుదిటిపై చల్లని క్లాత్ లేదా ఐస్ పెట్టుకోవడం వల్ల రక్తస్రావం తగ్గుతుంది.
రక్తస్రావం 20 నిమిషాల కంటే ఎక్కువసేపు ఆగకపోతే లేదా ఈ పరిస్థితి తరచుగా సంభవిస్తుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. మూర్ఛ, ఛాతీ నొప్పి, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే ఇది ఒక అత్యవసర పరిస్థితిగా భావించి తక్షణమే ఆసుపత్రికి వెళ్లాలి.
నివారణ చర్యలు
బీపీ చెక్: మీ రక్తపోటును క్రమం తప్పకుండా చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.
జీవనశైలి మార్పులు: ఉప్పు తీసుకోవడం తగ్గించండి. ఒత్తిడిని నియంత్రించుకోండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
నీరు, తేమ: సరిపడా నీరు తాగండి. వాతావరణంలో తేమ ఉండేలా చూసుకోండి.
ముక్కు సంరక్షణ: ముక్కు లోపల పొడిబారకుండా ఉండటానికి కొబ్బరి నూనె లేదా నెయ్యితో తేలికగా మసాజ్ చేసుకోవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




