Corona Advisory Fact Check: కరోనా నివారణ కోసం ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ అంటూ ప్రచారం..అది పూర్తిగా అసత్యం!
కరోనా భయం మొదలైన దగ్గర నుంచి సోషల్ మీడియాలో హడావుడి మామూలుగా లేదు. అదిగో పులి..ఇదిగో తోక.. వంటి బోలెడు విషయాల్ని ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు కరోనా గురించి ప్రచారం చేసేస్తూ వస్తున్నారు.
Corona News Fact Check: కరోనా భయం మొదలైన దగ్గర నుంచి సోషల్ మీడియాలో హడావుడి మామూలుగా లేదు. అదిగో పులి..ఇదిగో తోక.. వంటి బోలెడు విషయాల్ని ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు కరోనా గురించి ప్రచారం చేసేస్తూ వస్తున్నారు. ఎక్కడో ఒక చిన్న పోస్ట్ వస్తే దానిని దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోకి అనువదించి మరీ షేర్ చేయడం చాలా ఎక్కువైపోయింది. ఒకవైపు కరోనాతో యుద్ధం కోసం ప్రభుత్వాలు ఆపసోపాలు పడుతుంటే.. మరోవైపు సోషల్ మీడియాలో వస్తున్న ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలీని విధంగా ప్రచారంలోకి వస్తున్న వార్తలపై ప్రజలకు వివరణ ఇవ్వడం పెద్ద పనిగా మారింది ఆయా ప్రభుత్వ విభాగాలకు.
ఇప్పుడు కరోనా రెండో వేవ్ మొదలై అందర్నీ బెంబేలెత్తిస్తోంది. దేశవ్యాప్తంగా వేగంగా కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. అదేవిధంగా ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియనూ వేగంగా చేసుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
విపరీతంగా సర్క్యులేట్ అవుతున్న కరోనాకి సంబంధించిన ఫేక్ వార్త ఇది..
కరోనా కట్టడి కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐసీఎంఆర్) 21 భద్రతా ప్రమాణాలను గైడ్ లైన్స్ గా ప్రకటించింది అంటూ ఓ ఫోటో వార్త ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ లలో విపరీతంగా షేర్ అవుతోంది. అందులో ఉన్న కొన్ని ముఖ్యాంశాలు ఇవీ..
- రెండేళ్ల పాటు విదేశీ ప్రయాణాలు మానేయాలి
- ఒక సంవత్సరం పాటు బయట ఫుడ్ తినవద్దు
- పెళ్లిళ్లు..ఇతర కార్యక్రమాలకు హాజరు కావద్దు.
- అనవసరమైన ప్రయాణాలు వద్దు
- రద్దీగా ఉండే ప్రదేశాలకు ఒక సంవత్సరం పాటు వెళ్లొద్దు
ఇలా మొత్తం 21 గైడ్ లైన్స్ ప్రచారంలో ఉన్నాయి.
ఇది నిజం కాదు..
పైన చెప్పిన ఫోటో పూర్తిగా ఫేక్. అందులోని విషయాలు ఏవీకూడా ఐసీఎంఆర్ చెప్పలేదు. ఇటువంటి సలహాలు ఏవీ ఐసీఎంఆర్ విడుదల చేయాలేదు. అయితే, కరోనా ఉధృతి కారణంగా అందరూ జాగ్రత్తగా ఉండాలని ఐసీఎంఆర్ సూచించింది. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మాత్రం కొన్ని గైడ్ లైన్స్ విడుదల చేసింది. అవి ఇవే..
- ఫుడ్ ప్యాకేజీలు తీసుకున్న తరువాత, ఏదైనా తినే ముందు తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలి. అంతేకానీ బయట ఫుడ్ సంవత్సరం పాటు తినకూడదు అనే మాట అవాస్తవం
- తరచూ సబ్బు, నీళ్లతో చేతులు కడుక్కోవాలి.. ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్ తో చేతులు రుద్దుకోవాలి
- దగ్గు, జలుబుతో బాధపడుతున్నవారికి వీలైనంత దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి.
- మాస్క్ తప్పనిసరిగా అన్నిసమయాల్లోనూ ధరించాలి. మరీ ముఖ్యంగా సేఫ్ డిస్టెన్స్ పాటించడం సాధ్యం కాని సమయంలో మాస్క్ కచ్చితంగా ధరించాలి.
- కళ్ళు, ముక్కు ఎటువంటి పరిస్థితిలోనూ చేతులతో తాకవద్దు.
- తుమ్మినా, దగ్గినా మోచేతిని అడ్డు పెట్టుకోవాలి. అరచేతిని అడ్డుపెట్టుకోకూడదు.
- అనారోగ్యంగా అనిపిస్తే ఇంటిలోనే ఉండేందుకు ప్రయత్నించాలి
- దగ్గు, జ్వరం వంటి లక్షణాలు లేదా ఊపిరి తీసుకోవడంలో సమస్యలు వంటివి ఎదురైతే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఈ సూచనలు పాటిస్తూ మంచి ఆహారం తీసుకోవడం ద్వారా కరోనా బారిన పడే ముప్పును చాలావరకూ తగ్గించుకోవచ్చు.