పిల్లలకు క్యాన్సర్ రాదని అనుకుంటున్నారా? ఈ అపోహలు నమ్మకండి..
క్యాన్సర్ అంటే పెద్దలకు మాత్రమే వచ్చే వ్యాధి అనుకోవడం సరికాదు. పిల్లల్లోనూ క్యాన్సర్ రావచ్చు. అయితే పిల్లల్లో కనిపించే క్యాన్సర్ల స్వభావం, కారణాలు పెద్దల్లో కనిపించే క్యాన్సర్లకు భిన్నంగా ఉంటాయి. లుకేమియా, మెదడు మరియు నాడీ వ్యవస్థ కణితులు, లింఫోమా, న్యూరోబ్లాస్టోమా, విల్మ్స్ ట్యూమర్, ఎముకలకు సంబంధించిన క్యాన్సర్లు పిల్లల్లో కనిపించే ముఖ్యమైన క్యాన్సర్ రకాల్లో ఉన్నాయి..

పిల్లల్లో క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించడం, కచ్చితమైన నిర్ధారణ చేయడం, సకాలంలో చికిత్స అందించడం చాలా కీలకం. క్యాన్సర్ రకం, దశ, పిల్లల ఆరోగ్య పరిస్థితిని బట్టి చికిత్సా విధానాన్ని వైద్యులు నిర్ణయిస్తారు. అవసరాన్ని బట్టి కీమోథెరపీ, శస్త్రచికిత్స, రేడియోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, కొన్ని సందర్భాల్లో స్టెమ్ సెల్ మార్పిడి వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
అపోహ: పిల్లలకు క్యాన్సర్ రాదు
వాస్తవం: పిల్లల్లోనూ క్యాన్సర్ రావచ్చు. ముఖ్యంగా లుకేమియా, లింఫోమా, మెదడు కణితులు వంటి క్యాన్సర్లు పిల్లల్లో కనిపిస్తాయి. కాబట్టి పిల్లల్లో ఎక్కువకాలం కొనసాగుతున్న లేదా అసాధారణమైన ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.
అపోహ: క్యాన్సర్ అంటువ్యాధి
వాస్తవం: క్యాన్సర్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అంటువ్యాధి కాదు. క్యాన్సర్ ఉన్న పిల్లలతో ఆడుకోవడం, వారిని తాకడం, కలిసి ఉండటం లేదా ఆహారం పంచుకోవడం వల్ల క్యాన్సర్ వ్యాపించదు. అందువల్ల క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లలను ఇతరుల నుంచి దూరంగా ఉంచాల్సిన అవసరం లేదు. వారికి కుటుంబ సభ్యులు, స్నేహితులు ప్రేమ, ధైర్యం, మద్దతు అందించాలి.
అపోహ: తల్లిదండ్రుల తప్పుల వల్లే పిల్లలకు క్యాన్సర్ వస్తుంది
వాస్తవం: పిల్లల్లో వచ్చే చాలా క్యాన్సర్లకు తల్లిదండ్రుల ప్రవర్తన, నిర్లక్ష్యం లేదా జీవనశైలిని కారణంగా చెప్పలేం. కణాల DNAలో యాదృచ్ఛికంగా సంభవించే జన్యు మార్పులు అసాధారణ కణాల పెరుగుదలకు కారణం కావచ్చు. అందువల్ల పిల్లలకు క్యాన్సర్ నిర్ధారణ అయినప్పుడు తల్లిదండ్రులు తమను తాము నిందించుకోవాల్సిన అవసరం లేదు.
అపోహ: పిల్లల క్యాన్సర్‌కు చికిత్స ఉండదు
వాస్తవం: చాలా బాల్య క్యాన్సర్లను ముందుగా గుర్తించి సరైన చికిత్స అందిస్తే నయం చేయవచ్చు. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో బాల్య క్యాన్సర్ల మొత్తం నయం రేటు 80 శాతానికి పైగా ఉంది. అయితే క్యాన్సర్ రకం, దశ, చికిత్స అందుబాటు వంటి అంశాలపై ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అందుకే ప్రారంభ దశలోనే గుర్తించడం చాలా ముఖ్యం.
అపోహ: క్యాన్సర్ అంటే మరణమే
వాస్తవం: క్యాన్సర్ నిర్ధారణ అంటే జీవితం ముగిసిపోయిందని కాదు. ఆధునిక వైద్య చికిత్సలతో పిల్లల్లో వచ్చే అనేక క్యాన్సర్లను విజయవంతంగా చికిత్స చేయవచ్చు. కీమోథెరపీ, శస్త్రచికిత్స, అవసరమైతే రేడియోథెరపీ వంటి చికిత్సలతో అనేక మంది పిల్లలు క్యాన్సర్ నుంచి కోలుకుని సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
అపోహ: కీమోథెరపీ అంటే పిల్లల జీవితానికి ముగింపు
వాస్తవం: కీమోథెరపీ సమయంలో కొన్ని దుష్ప్రభావాలు కనిపించవచ్చు. వాంతులు, అలసట, ఆకలి తగ్గడం, జుట్టు రాలడం వంటి సమస్యలు కొందరిలో కనిపించవచ్చు. అయితే వైద్యుల పర్యవేక్షణ, సరైన పోషకాహారం, సహాయక చికిత్సలతో వీటిని నిర్వహించవచ్చు. కీమోథెరపీ తీసుకోవడం అంటే పిల్లల జీవితం ముగిసిపోయిందని అర్థం కాదు.
అపోహ: పెద్దలకు ఇచ్చే చికిత్సనే పిల్లలకు కూడా ఇస్తారు
వాస్తవం: పిల్లల శరీరం ఇంకా ఎదుగుతున్నందున వారి చికిత్సను ప్రత్యేకంగా ప్రణాళిక చేస్తారు. పిల్లల వయస్సు, బరువు, క్యాన్సర్ రకం, వ్యాధి దశ, మొత్తం ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని పీడియాట్రిక్ ఆంకాలజీ నిపుణులు చికిత్సను నిర్ణయిస్తారు.
అపోహ: క్యాన్సర్ నుంచి కోలుకున్న పిల్లలు సాధారణ జీవితం గడపలేరు
వాస్తవం: సరైన చికిత్సతో క్యాన్సర్ నుంచి కోలుకున్న అనేక మంది పిల్లలు ఇతర పిల్లల మాదిరిగానే చదువుకోవచ్చు, ఉద్యోగాలు చేయవచ్చు, కుటుంబ జీవితాన్ని గడపవచ్చు. అయితే కొందరికి చికిత్స అనంతరం దీర్ఘకాలిక ఫాలోఅప్, ఆరోగ్య పరీక్షలు అవసరం కావచ్చు.
ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు
పిల్లల్లో కొన్ని లక్షణాలు ఇతర సాధారణ అనారోగ్యాల్లోనూ కనిపించవచ్చు. అయినప్పటికీ అవి ఎక్కువకాలం కొనసాగితే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ముఖ్యంగా..
- దీర్ఘకాలంగా తగ్గని జ్వరం
- కారణం తెలియని బరువు తగ్గడం
- తీవ్రమైన లేదా నిరంతర అలసట
- శరీరంలో అసాధారణంగా గడ్డలు లేదా వాపులు
- కారణం తెలియని రక్తస్రావం లేదా తరచుగా గాయాలు కావడం
- నిరంతరంగా కొనసాగే నొప్పి
- చర్మం లేదా కళ్లలో అసాధారణ రంగు మార్పులు
ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన క్యాన్సర్ అని అర్థం కాదు. కానీ కారణం తెలియకుండా కొనసాగుతున్నప్పుడు వైద్య పరీక్ష చేయించుకోవడం అవసరం.
భయపడకుండా.. అవగాహనతో ముందుకు
పిల్లలకు క్యాన్సర్ నిర్ధారణ అయితే కుటుంబ సభ్యులు భయాందోళనకు గురికావడం సహజం. అయితే అపోహలు, మూఢనమ్మకాలపై ఆధారపడకుండా అర్హత కలిగిన వైద్య నిపుణులను సంప్రదించడం అత్యంత ముఖ్యం. వ్యాధిని వీలైనంత త్వరగా గుర్తించి, సరైన చికిత్స ప్రారంభిస్తే పిల్లలు క్యాన్సర్ నుంచి కోలుకుని ఆరోగ్యకరమైన భవిష్యత్తును కొనసాగించే అవకాశం ఉంటుంది.



