AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moral Story: మంచివారిగా ఉండటం అంటే అన్నింటినీ భరించడం కాదు.. బద్దకం కాకి – చిన్నారి చిలుక కథ

బద్ధకంగా ఉండకూడదు. మన పనులను మనమే సమయానికి చేసుకోవాలి. ముందుజాగ్రత్తగా ఉంటే ఎన్నో సమస్యలను నివారించవచ్చు. అలాగే ఇతరులు మనకు చేసిన సహాయాన్ని దుర్వినియోగం చేయకూడదు. కష్టపడి సంపాదించిన వస్తువులను గౌరవించాలి. కష్టం మనల్ని బలంగా చేస్తుంది.. బద్ధకం మనల్ని బలహీనంగా చేస్తుంది. ఈ విషయాలను ఈ కింది కథ ద్వారా పిల్లలకు అర్ధమయ్యేలా చెబితే.. చిన్నతనం నుంచే విలువలతో జీవిస్తారు..

Moral Story: మంచివారిగా ఉండటం అంటే అన్నింటినీ భరించడం కాదు.. బద్దకం కాకి – చిన్నారి చిలుక కథ
The Lazy Crow And The Brave Little Parrot Story
Srilakshmi C
|

Updated on: Sep 04, 2026 | 3:35 PM

Share

ఒక పెద్ద అడవిలో ఎన్నో రకాల పక్షులు, జంతువులు ఎంతో ఆనందంగా జీవించేవి. ఆ అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు కొమ్మలు చాలా విశాలంగా ఉండటంతో ఎన్నో పక్షులు వాటిపై తమ గూళ్లు కట్టుకుని నివసించేవి. అదే చెట్టులో ఒక కాకి కూడా ఉండేది. దాని పేరు కాళీ. కాళీకి ఒక చెడ్డ అలవాటు ఉండేది. అది చాలా బద్దకస్తుడు. ఏ పని చేయాలన్నా రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అంటూ వాయిదా వేస్తుండేది. తన గూడు పాతబడిపోయినా, కొమ్మలు విరిగిపోయినా, ఆకులు ఊడిపోయినా దాన్ని పట్టించుకునేది కాదు. ఒకరోజు ఉదయం కాళీ తన గూడు బయట కూర్చుని ఉండగా, ఒక చిన్న కొమ్మ విరిగి కింద పడిపోయింది. కాళీ దాన్ని చూసి ‘అయ్యో! నా గూడు కొంచెం పాడైపోయింది. ఇవాళే దీన్ని బాగు చేసుకోవాలి’ అనుకుంది. కానీ వెంటనే మరో ఆలోచన వచ్చింది. ‘అబ్బా… ఇప్పుడే ఎందుకు? ఈరోజు చాలా ఎండగా ఉంది. రేపు బాగు చేసుకుంటాను’ అని అనుకుంది. మరుసటి రోజు కూడా అదే పరిస్థితి. ‘ఈరోజు నాకు చాలా ఆకలిగా ఉంది. ముందు తిండి తింటాను. గూడు సంగతి రేపు చూసుకుందాం..’ అలా రోజులు గడిచిపోయాయి.

ఒకరోజు కాళీ గూడు మరింత పాడైపోయింది. అయినా అది ఏమాత్రం పట్టించుకోలేదు. ‘నా నెత్తి మీద నీడ ఉంటే చాలు. ఇల్లు ఎలా ఉన్నా ఎవరు చూస్తారు? నాకు ఏమీ కాదు’ అని తనలో తానే అనుకుంది. అదే చెట్టుకు కొంచెం దూరంలో ఒక చిన్న చిలుక ఉండేది. దాని పేరు చిట్టి. చిట్టి చాలా చురుకైనది, తెలివైనది. అది తన ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకునేది. గూడు పాడైతే వెంటనే బాగు చేసుకునేది. ఒకరోజు చిట్టి ఎండిన గడ్డి, చిన్న చిన్న పుల్లలు, ఆకులు తీసుకొచ్చి తన గూడును మరింత గట్టిగా తయారు చేసుకుంది. అది చూసిన కాళీ నవ్వుతూ ‘చిట్టీ! ఇంత కష్టపడటం ఎందుకు? నీ గూడు బాగానే ఉంది కదా! మళ్లీ ఎందుకు మరమ్మతులు చేస్తున్నావు?’ అని అడిగింది. చిట్టి నవ్వుతూ ‘కాళీ అన్నా! ఇప్పుడే బాగున్నా, ఎప్పుడైనా గాలి, వర్షం రావచ్చు. ముందుగానే సిద్ధంగా ఉంటే మనకు ఇబ్బంది ఉండదు’ అని చెప్పింది. కాళీ మాత్రం చిట్టి మాటలు పట్టించుకోలేదు. ‘అయ్యో! నువ్వు చాలా భయపడుతున్నావు. ఏమీ జరగదు. ప్రకృతి ఎప్పుడూ మనకు అనుకూలంగానే ఉంటుంది’ అని చెప్పింది. చిట్టి మాత్రం ‘ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందుకే ముందుజాగ్రత్త మంచిది’ అని చెప్పింది. కాళీ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఆ రోజు సాయంత్రం ఆకాశం ఒక్కసారిగా నల్లగా మారింది. చుట్టూ గాలి బలంగా వీయడం మొదలైంది. చెట్ల ఆకులు గలగలమని శబ్దం చేశాయి. ‘వర్షం వచ్చేలా ఉంది’ అని పక్షులన్నీ తమ తమ గూళ్లకు చేరుకున్నాయి. కొంతసేపటికి భారీ వర్షం మొదలైంది. చెట్ల కొమ్మలు ఊగుతున్నాయి. గాలి బలంగా వీస్తోంది. ఉరుములు, మెరుపులతో అడవి మొత్తం భయంకరంగా మారింది. కాళీ తన పాడైపోయిన గూటిలోకి వెళ్లి కూర్చుంది. ‘ఏం కాదు. నా గూడు ఎప్పటిలాగే ఉంటుంది’ అని అనుకుంది. కానీ కొద్దిసేపటికే పెద్ద గాలి వీచింది..ధబ్! ఒక కొమ్మ విరిగిపోయింది. గూడు ఒకవైపు వాలిపోయింది. కాళీ భయపడిపోయింది. ‘అయ్యో! అయ్యో! నా గూడు!’ మరోసారి బలమైన గాలి వీచింది. భళ్లుమ్..! కాళీ గూడు మొత్తం విరిగి కింద పడిపోయింది. కాళీ వర్షంలో తడుస్తూ ఒక కొమ్మను పట్టుకుని కూర్చుంది. ‘అయ్యో! నేను ముందే నా గూడు బాగు చేసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. చిట్టి చెప్పిన మాట నేను వినాల్సింది’ అని బాధపడింది.

చలితో వణుకుతూ ‘ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లాలి? నాకు ఇల్లు కూడా లేదు!’ అని ఆలోచించింది. అప్పుడే దానికి చిట్టి గుర్తుకు వచ్చింది. ‘చిట్టి గూడు చాలా గట్టిగా ఉంది. అది నన్ను తప్పకుండా లోపలికి రానిస్తుంది. వర్షం ఆగే వరకు అక్కడే ఉంటాను’ అని అనుకుంది. కాళీ తడుస్తూనే చిట్టి ఇంటి దగ్గరకు వెళ్లింది. ‘చిట్టీ! ఓ చిట్టీ! తలుపు తీయి!’ లోపల నుంచి చిట్టి అడిగింది.. ‘ఎవరు?’ ‘నేను కాళీని. వర్షంలో పూర్తిగా తడిచిపోయాను. దయచేసి తలుపు తీయి..’ చిట్టి వెంటనే తలుపు తెరిచింది. కాళీని చూసి ‘అయ్యో కాళీ అన్నా! మీరు పూర్తిగా తడిచిపోయారు. త్వరగా లోపలికి రండి’ అంది. కాళీ లోపలికి వెళ్లి ఒక మూలన కూర్చుంది. చిట్టి కొన్ని పొడి ఆకులు తీసుకొచ్చి ‘ఇవి తీసుకోండి. మీ శరీరాన్ని తుడుచుకోండి. చలిగా ఉంది కదా?’ అని అడిగింది. కాళీకి చిట్టి మంచితనం చూసి సిగ్గేసింది. ‘చిట్టీ… నువ్వు చాలా మంచిదానివి. నేను నీ మాట వినలేదు. నా గూడు బాగు చేసుకోలేదు. అందుకే ఇప్పుడు ఇలా అయ్యింది’ అని చెప్పింది. చిట్టి నవ్వుతూ ‘పర్లేదు అన్నా. జరిగినది జరిగిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ సురక్షితంగా ఉండండి’ అంది. ఆ రాత్రంతా చిట్టి తన ఇంట్లో కాళీకి చోటిచ్చింది.

మరుసటి ఉదయం వర్షం ఆగిపోయింది. సూర్యుడు బయటికి వచ్చాడు. చెట్ల ఆకులపై ఉన్న నీటి బిందువులు మెరిసిపోయాయి. చిట్టి బయటికి చూసి ‘కాళీ అన్నా! వర్షం ఆగిపోయింది. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్లి కొత్త గూడు కట్టుకోండి’ అంది. కాళీ కొద్దిసేపు మౌనంగా ఉంది. అప్పుడు దాని మనసులో మరో ఆలోచన వచ్చింది. ‘కొత్త గూడు కట్టడం అంటే చాలా కష్టం. పుల్లలు తీసుకురావాలి. వాటిని అమర్చాలి. చాలా సమయం పడుతుంది. ఇంతకంటే ఈ చిట్టి గూటిలోనే ఉండిపోతే బాగుంటుంది’.. అలా ఆలోచించిన కాళీ ‘చిట్టీ… నేను ఇక నా గూడు దగ్గరకు వెళ్లను’ అంది. చిట్టి ఆశ్చర్యంగా ‘ఎందుకు అన్నా?’ అని అడిగింది. ‘నీ ఇల్లు చాలా బాగుంది. గట్టిగా ఉంది. నాకు కొత్త ఇల్లు కట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి నేనే ఇక్కడ ఉంటాను’ అని కాళీ అంది.

చిట్టి ఆశ్చర్యపోయింది. సకానీ అన్నా… ఇది నా ఇల్లు. నేను చాలా కష్టపడి కట్టుకున్నాను. మీరు వర్షం సమయంలో ఉండటానికి వచ్చారు. ఇప్పుడు వర్షం కూడా ఆగిపోయింది. మీరు మీ కోసం కొత్త గూడు కట్టుకోవాలిస అంది. కాళీ మాత్రం వినలేదు. ‘నువ్వే ఇంకో చోట కొత్త గూడు కట్టుకో. ఈ ఇల్లు ఇప్పుడు నాది’ అని చెప్పింది. చిట్టికి చాలా కోపం వచ్చింది. ‘ఇది ఏంటి అన్నా? నేను మీకు సహాయం చేశాను. అందుకు ప్రతిఫలంగా నా ఇంటినే తీసుకుంటారా?’ అని అడిగింది. కాళీ మొండిగా ‘నాకు ఏమీ తెలియదు. నేను ఇక్కడే ఉంటాను’ అంది. చిట్టి మొదట బాధపడింది. కానీ తర్వాత తనకు తాను ధైర్యం చెప్పుకుంది. ‘నేను కష్టపడి కట్టుకున్న నా ఇంటిని ఎవరికీ వదిలిపెట్టను. మంచితనం అంటే బలహీనత కాదు. అవసరమైనప్పుడు ధైర్యంగా నిలబడాలి’ అని అనుకుంది. అది కాళీని మరోసారి హెచ్చరించింది. ‘కాళీ అన్నా! దయచేసి నా ఇంటి నుంచి బయటికి వెళ్లండి. మీరు చేసిన తప్పు మీరే సరిదిద్దుకోవాలి.’ కాళీ మాత్రం ‘నేను వెళ్లను!’ అని అంది. అప్పుడు చిట్టి కోపంతో తన ముక్కుతో కాకిని గట్టిగా గుచ్చింది. ‘అయ్యో! అయ్యో! ఆపవే చిట్టీ!’ చిట్టి మరోసారి గుచ్చింది. ‘అయ్యయ్యో! సరే! సరే! వెళ్తాను!’ కాళీ భయంతో ఇంటి నుంచి బయటికి పరుగెత్తింది. ‘ఇక ఎప్పుడూ నీ ఇంటి జోలికి రాను!’ అంటూ అక్కడి నుంచి పారిపోయింది. చిట్టి తన గూటిని చూసుకుని సంతోషించింది.

‘నా ఇంటిని నేను కష్టపడి కట్టుకున్నాను. దాన్ని కాపాడుకున్నాను. ఇకపై ఎవరి మంచితనాన్ని కూడా ఎవరూ దుర్వినియోగం చేయకూడదు’ అని అనుకుంది. కాళీ మాత్రం తన తప్పును తెలుసుకుంది. ‘బద్ధకంగా ఉండటం వల్ల నా ఇల్లు పోయింది. ఇతరులపై ఆధారపడటం వల్ల మరింత అవమానానికి గురయ్యాను. ఇక నుంచి నా పనులను నేనే చేసుకుంటాను’ అని నిర్ణయించుకుంది. ఆ రోజు నుంచి కాళీ బద్ధకాన్ని వదిలేసి కష్టపడటం మొదలుపెట్టింది. చివరకు అది కూడా ఒక అందమైన, గట్టి గూడు కట్టుకుంది.

కథలోని నీతి

ఈ కథ మనకు బద్ధకం, ముందుజాగ్రత్త, కష్టం, ఇతరుల మంచితనాన్ని గౌరవించడం గురించి మంచి పాఠాన్ని చెబుతుంది. మొదట కాకి తన గూడు పాడైపోయినా పట్టించుకోలేదు. “తర్వాత బాగు చేసుకుంటాను” అంటూ పనిని వాయిదా వేసింది. కానీ తుఫాను వచ్చినప్పుడు దాని గూడు పూర్తిగా ధ్వంసమైంది. అప్పుడే తన తప్పు కాకికి అర్థమైంది. దీనివల్ల చిన్న సమస్యను సమయానికి పరిష్కరించకపోతే అది పెద్ద సమస్యగా మారుతుంది అనే విషయం తెలుస్తుంది. అదే సమయంలో చిలుక మాత్రం ముందుగానే తన గూడును బలంగా నిర్మించుకుంది. అందుకే తుఫాను వచ్చినా అది సురక్షితంగా ఉండగలిగింది. దీని ద్వారా ముందుజాగ్రత్తగా ఉండటం వల్ల కష్టాలను ఎదుర్కొనే శక్తి వస్తుంది అని తెలుసుకోవచ్చు. కాకి కష్టంలో ఉన్నప్పుడు చిలుక దయతో తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చింది. ఇది చిలుకలోని మంచితనం, దయ, సహాయపడే గుణాన్ని చూపిస్తుంది. అయితే వర్షం ఆగిపోయిన తర్వాత కాకి ఆ మంచితనాన్ని దుర్వినియోగం చేసి చిలుక ఇంటినే ఆక్రమించుకోవాలని ప్రయత్నించింది. ఇది చాలా తప్పు.

మనకు ఎవరైనా సహాయం చేసినప్పుడు వారి మంచితనాన్ని ఉపయోగించుకుని వారినే ఇబ్బంది పెట్టకూడదు. సహాయం పొందడం తప్పు కాదు.. కానీ సహాయం చేసిన వ్యక్తిని మోసం చేయడం, వారి హక్కులను లాక్కోవడం తప్పు. చిలుక మొదట కాకిని ప్రేమగా అడిగింది. కాకి వినకపోవడంతో చివరకు ధైర్యంగా తన ఇంటిని కాపాడుకుంది. దీనివల్ల మంచివారిగా ఉండటం అంటే అన్నింటినీ భరించడం కాదు; అన్యాయం జరిగినప్పుడు ధైర్యంగా ఎదిరించాలి అనే పాఠం కూడా మనకు తెలుస్తుంది. బద్ధకంగా ఉండకూడదు. పనులను రేపటికి వాయిదా వేయకూడదు. చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలి. ఎలాంటి పరిస్థితి వచ్చినా ముందుగానే సిద్ధంగా ఉండాలి. కష్టపడి పనిచేస్తే మన జీవితం సురక్షితంగా ఉంటుంది. ఇతరులు చేసిన సహాయాన్ని ఎప్పుడూ దుర్వినియోగం చేయకూడదు. ఇతరుల వస్తువులను, హక్కులను గౌరవించాలి. మంచితనంతో పాటు అవసరమైనప్పుడు ధైర్యంగా కూడా ఉండాలి. బద్ధకాన్ని వదిలి కష్టపడాలి.. ముందుజాగ్రత్తగా ఉండాలి.. ఇతరుల మంచితనాన్ని గౌరవించాలి.. ఎవరికీ అన్యాయం చేయకూడదు.

Follow Us