టీలో దాల్చిన చెక్క కలిపి తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?
మీరు రోజూ టీ తాగే అలవాటు ఉన్నవారైతే ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుంది. బాడీలో షుగర్ లెవెల్స్ నియంత్రించడం ముఖ్యమైనది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి లేదా వచ్చే అవకాశం ఉన్నవారికి.. టీ తాగడం ఆపేయడానికి కష్టమైతే దానిలో చిన్న మార్పు చేసి రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రించవచ్చు. రోజూ టీతో పాటు చిటికెడు దాల్చిన చెక్క వేసినా ప్రయోజనాలుంటాయి అంటున్నారు నిపుణులు.

దాల్చిన చెక్కలో బయోఆక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా సినామాల్డిహైడ్ అనే పదార్థం ఇన్సులిన్ పనితీరును మెరుగుపరిచే లక్షణాలను కలిగి ఉంటుంది. పరిశోధనల ప్రకారం దాల్చిన చెక్క ఇన్సులిన్ లాగా పనిచేసి గ్లూకోజ్‌ను కణాల్లోకి త్వరగా తీసుకువెళ్లేందుకు సహాయపడుతుంది. ఇన్సులిన్ ప్రతిస్పందనను మెరుగుపరిచేలా దాల్చిన చెక్క పనిచేస్తుంది. దీని వల్ల అధిక ఇన్సులిన్ అవసరం తగ్గుతుంది. ఇది ప్రత్యేకంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవారికి లేదా టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి సహాయపడుతుంది.
టీ ముఖ్యంగా గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, పొలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి మెటబాలిజం మెరుగుపరచడంతో పాటు శరీరంలో వాపు తగ్గించడంలో సహాయపడతాయి. టీలో దాల్చిన చెక్క వేస్తే రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు పెరుగుతాయి. వీటి కలయిక ఇన్సులిన్ ప్రభావాన్ని మెరుగుపరిచేలా పని చేస్తుంది. షుగర్ శరీరంలో త్వరగా ప్రవేశించకుండా నియంత్రించడం వల్ల భోజనం తర్వాత రక్తంలో షుగర్ స్థాయిలు స్థిరంగా ఉండేందుకు సహాయపడుతుంది.
డయాబెటిస్ ఉన్నవారికి భోజనం తర్వాత వచ్చే షుగర్ పెరుగుదలను నియంత్రించడం చాలా అవసరం. టీకి దాల్చిన చెక్క కలిపితే గ్లూకోజ్ శరీరంలో మెల్లగా ప్రవేశించేలా చేస్తుంది. దాంతో రక్తంలో షుగర్ స్థాయి అకస్మాత్తుగా పెరగకుండా నియంత్రించవచ్చు. దీని వల్ల డయాబెటిస్ మందుల స్థానంలో దాల్చిన చెక్క పూర్తిగా ఉపయోగించలేనప్పటికీ దీన్ని ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం భాగంగా చేర్చుకోవచ్చు. కొన్ని అధ్యయనాలు చూపించిన ప్రకారం దీర్ఘకాలం దాల్చిన చెక్క తీసుకుంటే ఉపవాస సమయంలో బ్లడ్ షుగర్ స్థాయులు కొంతమేరకు తగ్గవచ్చని భావిస్తున్నారు.
టీలో దాల్చిన చెక్క కలపడం చాలా సులభం. మీరు చేసిన టీలో చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలిపితే సరిపోతుంది. రుచిని మరింత పెంచాలనుకుంటే టీ తయారయ్యేటప్పుడు దాల్చిన చెక్క కడ్డిని నేరుగా ఉంచి మరిగించవచ్చు. తీపి రుచిని పెంచాలని అనుకుంటే దాల్చిన చెక్కను అల్లం, లవంగం లాంటి సహజమైన పదార్థాలతో కలిపి ఉపయోగించవచ్చు. ఈ విధంగా రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
