AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bappi Lahiri: బప్పి లహిరి మృతికి కారణమైన అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటే ఏంటి.? ఎలా గుర్తించాలి.? లక్షణాలు ఏంటి.?

Bappi Lahiri: ప్రముఖ సంగీత దర్శకుడు బప్పి లహిరీ అనారోగ్యం కారణంగా మంగళవారం మృతి చెందిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌లోనే కాకుండా తెలుగులోనూ సంగీత దర్శకత్వం వహించిన ఈ లెజండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ లేర్న వార్త సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది..

Bappi Lahiri: బప్పి లహిరి మృతికి కారణమైన అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటే ఏంటి.? ఎలా గుర్తించాలి.? లక్షణాలు ఏంటి.?
Bappi Lahiri Death
Narender Vaitla
|

Updated on: Feb 18, 2022 | 4:37 PM

Share

Bappi Lahiri: ప్రముఖ సంగీత దర్శకుడు బప్పి లహిరీ అనారోగ్యం కారణంగా మంగళవారం మృతి చెందిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌లోనే కాకుండా తెలుగులోనూ సంగీత దర్శకత్వం వహించిన ఈ లెజండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ లేర్న వార్త సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. బప్పి లహిరీ మరణ వార్త సినిమా ఇండస్ట్రీ వర్గాలు సంతాపం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే బప్పి లహిరీ మరణానికి అసలు కారణం అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ అప్నియా (OSA) అనే వ్యాధి కారణమని వైద్యులు తేల్చి చెప్పారు. దీనివల్లే గుండె పనితీరు ఒక్కసారిగా ఆగిపోవడంతో బప్పి మరణించినట్లు వైద్యులు వివరించారు. దీంతో అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ అప్నియా వ్యాధి ఏంటన్న దానిపై అందరిలోనూ ప్రశ్నలు మొదలయ్యాయి. అసలు ఈ వ్యాధి ఏంటీ..? ఎలా గుర్తించాలి.? దీనికి ఏమైనా చికిత్స ఉందా.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

అసలేంటీ వ్యాధి..

గాడ నిద్రలో ఉన్నప్పుడు కొందరిలో ఒక్కోసారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీంతో కొందరు గురక కూడా పెడుతుంటారు. దీనినే స్లీప్‌ అప్నియాగా పిలుస్తారు. అయితే ఇది చాలా సాధారణమైన విషయం. మనలో చాలా మందికి ఈ సమస్య ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ సమస్య మరీ జఠిలంగా మారుతుంది. గుండె పనితీరు ఒక్కసారిగా ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ సమస్య తీవ్రతను బట్టి వ్యాధిని.. అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, సెంట్రల్ స్లీప్ అప్నియా, కాంప్లెక్స్ స్లీప్ అప్నియా అని మూడు రకాలుగా విభజించారు. వీటిలో అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా శ్వాస సంబంధిత వ్యాధులకు దారి తీస్తుంది.

ఈ వ్యాధితో బాధపడే వారు నిద్రిస్తున్న సమయంలో ఎగువ వాయు నాళాలు కుచించుకుపోతాయి. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ కారణంగా శరీరంలో ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గిపోయతాయి. కొన్ని సందర్భాల్లో గురకకు ఇదే కారణంగా మారుతుంది. ఇక కొందరిలో అయితే కొద్ది క్షణంపాటు శ్వాసతీసుకోవడం ఆగిపోతుంది. అయితే శ్వాసకోశ కేంద్రాలు మళ్లీ యాక్టివ్‌ కాగానే ఒక్కసారిగా శ్వాసకోవడం ప్రారంభిస్తారని.. న్యూఢిల్లీలోని PSRI ఆసుపత్రికి చెందిన సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ నీతూ జైన్‌ తెలిపారు. అంతేకాకుండా ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.. ఈ వ్యాధితో బాధపడేవారికి నిద్ర కూడా సరిగా ఉండదని, కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణాంతకంగా కూడా మారొచ్చని చెప్పుకొచ్చారు.

వ్యాధి లక్షణాలు ఇవే..

* ఉదయం ఎక్కువ సేపు నిద్రపోతుండడం.

* అధిక రక్త పోటు

* హృదయ సంబంధ వ్యాధులు.

* పెద్దగా గురక పెట్టడం.

* ఉదయం నిద్ర లేవగానే నోరు ఎండిపోవడం, తలనొప్పిగా ఉండడం.

* ఉదయం లేవగానే నిస్సత్తువుగా ఉండడం.

* సంతృప్తికరమైన నిద్ర లేకపోవడం.

ఈ వ్యాధి రావడానికి కారణాలు ఏంటంటే..

ఓఎస్‌ఏ వ్యాధి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే వీటిలో ప్రధానమైన వాటిలో అధిక బరువు ఒకటి. బరువు ఎక్కువ ఉన్నవారిలో (పొట్ట) శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది. ఈ కారణంగా కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకోవడం ఆగిపోతుంది. దీంతో మెదడు ఒక్కసారి శరీరాన్ని అలర్ట్‌ చేసి నిద్ర నుంచి మేలుకొలుపుతుంది. ఇక అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా కలగడానికి వయసు మీరడం, శ్వాసకోశసమస్యలు, వాయుమార్గం ఇరుకుగా ఉండడం, అనారోగ్యకరమైన జీవనశైలి కూడా కారణాలుగా చెప్పవచ్చు.

ఓఎస్‌ఏ ప్రాణాంతకమా..?

అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా వ్యాధి కొన్ని సందర్భాల్లో ప్రాణాల మీదికి కూడా తెస్తుంది. శరీరంలో ఆక్సిజన్‌ స్థాయిలు ఒక్కసారిగా పడిపోవడంతో శరీరంలోని పలు భాగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా గుండె, కిడ్నీ, మెదడు తీవ్రంగా దెబ్బతింటాయి. మరికొందరిలో నిద్రలోనే గుండె పోటు, స్ట్రోక్‌ వంటివి కలిగే అవకాశాలు ఉంటాయి. ఇక ఈ వ్యాధితో బాధపడే వారు వెంటనే ప్రాణాలు కోల్పోతారా? అంటే అది కూడా కచ్చితంగా చెప్పలేం, కానీ దీర్ఘ కాలంలో మాత్రం ఆరోగ్యంపై పెను ప్రమాదం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

చికిత్స అందుబాటులో ఉందా.?

ఈ వ్యాధికి కచ్చితంగా చికిత్స ఉందని వైద్యులు చెబుతున్నారు. వ్యాధిని వీలైనంత ముందుగా గుర్తిస్తే ప్రమాదం నుంచి బయటపడడం సింపుల్‌ అని వివరిస్తున్నారు. అయితే ఈ వ్యాధి సోకడానికి ప్రధాన కారణం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడడమే కాబట్టి.. ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికి ఒక పరికరాన్ని ఉపయోగిస్తున్నారు. కంటిన్యూస్‌ పాజిటివ్‌ ఎయిర్‌ అవే ప్రెజర్‌ థెరపీ (CPAP) అనే పరికరంతో శ్వాస తీసుకోవడంలో ఎదురయ్యే సమస్యలకు చెక్‌ పెడతారు. ఈ పరికరాన్ని నోటిలో ఉంచుకోవడం వల్ల నాలుకకు, వాయుమార్గాల మధ్యనున్న కణజాలాలు మూసుకుపోకుండా నిరోధిస్తుంది.

దీంతో నిద్రించే వ్యక్తి తేలికగా శ్వాస తీసుకోగలరు. పరిస్థితి తీవ్రతరమైతే శస్త్రచికిత్స కూడా చేయాల్సి ఉంటుదని వైద్యులు సూచిస్తున్నారు. ఏది ఏమైనా ఈ వ్యాధికి ప్రధాన కారణం అధిక బరువు కాబట్టి వీలైనంత వరకు జీవన శైలిని మార్చుకోవడానికి ప్రయత్నించాలి. వ్యాయామాన్ని జీవితంలో భాగం చేసుకుంటూ, ఆరోగ్యకరమైన ఆహారం, మంచి జీవ విధానాన్ని అవలంభిస్తూ, శ్వాస సంబంధిత వ్యాయామాలు చేస్తే ఈ వ్యాధి దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన వివరాలు మేము సేకరించిన ప్రాథమిక సమాచారం ఆధారంగా ఇచ్చాము. అయితే ఆరోగ్యం విషయంలో ఎప్పుడూ అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. శరీరంలో ఏమాత్రం మార్పు జరుగుతున్నట్లు అనుమానం వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలను చేయించుకోవడం ఉత్తమమం .

Also Read: Channi Bhaiyya: కొత్త వివాదానికి తెరలేపిన చన్నీ ‘భయ్యా’ కామెంట్స్.. కాంగ్రెస్ మెడకు చుట్టుకుంటున్నకొత్త రగడ..