Arsenic in Rice: అన్నంలో ఆర్సెనిక్‌..తీసుకొస్తుంది ఆరోగ్యానికి ముప్పు..తస్మాత్ జాగ్రత్త అంటున్న పరిశోధకులు

Arsenic in Rice: అన్నంలో ఆర్సెనిక్‌..తీసుకొస్తుంది ఆరోగ్యానికి ముప్పు..తస్మాత్ జాగ్రత్త అంటున్న పరిశోధకులు
Arsenic In Rice

మీరు రోజూ అన్నం తింటున్నారా..? మీరు తినే అన్నంలో ఆర్సెనిక్‌ మూలకం మోతాదుకు మించి ఉందా? అయితే, తస్మాత్‌ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు.

KVD Varma

|

Aug 16, 2021 | 4:41 PM

Arsenic in Rice:  మీరు రోజూ అన్నం తింటున్నారా..? మీరు తినే అన్నంలో ఆర్సెనిక్‌ మూలకం మోతాదుకు మించి ఉందా? అయితే, తస్మాత్‌ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. బియ్యంలో క్యాన్సర్​ను కలిగించే హానికరపదార్థాలు ఉంటున్నాయని వారు చెబుతున్నారు. బియ్యంలో ఆర్సెనిక్ పదార్దం ఉండటంతో క్యాన్సర్​ ముప్పు పొంచి ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆర్సెనిక్ అంటే సహజంగా తయారయ్యే ఒక మూలకం. అది మట్టి, నీళ్లలో కూడా ఉంటుందని ఇప్పటికే శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ ఆర్సెనిక్ విషపూరితంగా మారుతుందని తాజగా వారు హెచ్చరిస్తున్నారు. యూరోపియన్ యూనియన్ దీనిని మొదటి కేటగిరీ క్యాన్సర్ కారకాల జాబితాలో చేర్చింది.

ఎందులో ఎంత ఆర్సెనిక్ ఉంటుందంటే..

ఒక కిలో మట్టిలో 100 ఎంజీ, లీటర్‌నీటిలో 10 యూజీల ఆర్సెనిక్‌ ఉంటుంది. దీన్ని క్రిమిసంహార‌క మందుల త‌యారీలోనూ వాడుతుంటారు. పంట‌ల‌కు పురుగుల మందులు చ‌ల్లిన‌ప్పుడు ఈ విష‌ర‌సాయనం నేల‌లోకి చేరుతుంది. ఈ విధంగా ఆర్సెనిక్‌ పంట ధాన్యాల్లోకి వ‌చ్చి చేరుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇలా మ‌ట్టిలో ఉన్న ఆర్సెనిక్ శాతం పెరిగిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

2014లోనే..

బియ్యంలో ఆర్సెనిక్ మూలకంపై 2014 లోనే  గైడ్‌లైన్స్ విడుదలయ్యాయి. అప్పట్లోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ గైడ్‌ లైన్స్‌ విడుదల చేసింది. ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ మిగిలిన ఆహార ధాన్యాలతో పోలిస్తే బియ్యంలో ఆర్సెనిక్ స్థాయి 20 రెట్లు ఎక్కువగ ఉంటుందని చెప్పింది. మట్టిలో నుంచి వరి ధాన్యంలోకి ఈ ఆర్సెనిక్‌ మూలకం సులభంగా చేరుతుంది. బాస్మతి బియ్యంలో ఆర్సెనిక్ స్థాయి తక్కువ, బ్రౌన్ రైస్ లో ఆర్సెనిక్ అధికంగా ఉంటుంది. బియ్యపు గింజ చుట్టూ ఉండే పొట్టు దానికి కారణమని నార్త‌ర్న్ ఐర్లాండ్‌ బెల్‌ఫాస్ట్‌లో క్వీన్స్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు వెల్లడించారు. ఇంకో తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. ఆర్గానిక్ వరి సాగు వల్ల ఆర్సెనిక్ స్థాయిలో ఎలాంటి తేడా ఉండదని వారు స్పష్టం చేశారు.

ఆ బియ్యం తినొద్దు..

తాగే నీళ్లలో ఎంత ఆర్సెనిక్ అనుమతించారో, రైస్ మిల్క్ లో దానికి మించిన స్థాయిలో ఉంటుందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. అన్నం లేదా బియ్యంతో చేసిన పదార్థాలను ఎక్కువగా తినేవారికి ఆర్సెనిక్ తో తీవ్ర ప్రమాదం ఉందని పరిశోధకులు అంటున్నారు. బియ్యం పై పొర‌లో ఆర్సెనిక్ ఎక్కువ‌గా ఉంటుందాని వారు చెబుతున్నారు. పాలిష్ చేయ‌ని ముడి బియ్యం తిన‌వ‌ద్ద‌ని ప‌రిశోధ‌కులు స్పష్టంగా సూచిస్తున్నారు. పాలిష్ చేసిన కిలో బియ్యంలో గ‌రిష్ఠంగా 0.2 మిల్లీ గ్రాముల ఆర్సెనిక్ ఉంటుందని పరిశోధకుల అంచనా.

ఆర్సెనిక్‌తో ప్రమాదం ఏమిటి?

మ‌న శ‌రీరంలోకి మోతాదు మించి ఆర్సెనిక్ చేరితో అనేక స‌మ‌స్య‌లు వస్తాయి. వాంతులు, ర‌క్త‌విరేచ‌నాలు, క‌డుపు నొప్పి వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు ఏర్పడతాయి. దీర్ఘ‌కాలికంగా ఆర్సెనిక్ శ‌రీరంలోకి చేరితే డ‌యాబెటిస్‌, హృద్రోగాలు, క్యాన్స‌ర్ వ‌చ్చే ప్ర‌మాదం ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఏంచేయాలి…

బియ్యాన్ని రాత్రంతా నానపెట్టాలి. తర్వాత రోజు శుభ్రమైన నీళ్లతో బాగా కడిగి వండినప్పుడు ఆర్సెనిక్ స్థాయి తగ్గుతుంది. ఉడికించే సమయంలో నీళ్లను మార్చడం(గంజి వార్చటం)తో అన్నంలో ఆర్సెనిక్ స్థాయి తగ్గుతుంది. ఇలాంటి చర్యలు తీసుకుంటే మనం క్యాన్సర్ ముప్పు నుంచి బయటపడే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Also Read: High Blood Pressure: అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా.? ఈ ఐదు మార్గాలను అనుసరిస్తే అదుపులో ఉంటుంది..!

Curd: ఈ వ్యాధులు ఉన్నవారు పెరుగు అస్సలు తినకూడదట.. తింటే సమస్యలు తప్పవు..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu