MP Vijayasai Reddy: “తారకరత్న మెదడు పైభాగం దెబ్బతింది.. బాలయ్య అన్నీ చూసుకుంటున్నారు”
తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై కీలక వివరాలు వెల్లడించారు వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి. ఆయన కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
మాసీవ్ హార్డ్ స్ట్రోక్‌తో బెంగళూరు నారాయణ హృదయాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు అక్కడికి వెళ్లారు ఆయన బంధువు, వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి. డాక్టర్లతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆపై మీడియాతో మాట్లాడిన విజయసాయి రెడ్డి.. తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. గుండెపోటు వచ్చినరోజు 45 నిమిషాలు రక్త ప్రసరణ ఆగిపోవడం వల్ల మెదడులో పై భాగం దెబ్బతిన్నదని వెల్లడించారు. దానివలన నీరు చేరి మెదడు వాచిందన్నారు. వాపు తగ్గిన వెంటనే బ్రెయిన్ రికవరీ అవుతుందని డాక్టర్లు తెలిపినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు.
నందమూరి బాలకృష్ణ దగ్గరుండి తారకరత్నకు అన్ని వైద్యసదుపాయాలు కల్పిస్తున్నారని విజయసాయి రెడ్డి ప్రశంసించారు. బాలకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మెదడు పై భాగం దెబ్బతినడంతో కొన్ని అవయవాలు కొంత యాక్టీవ్ గా పనిచేయడం లేదని డాక్టర్లు తెలిపారని సాయి రెడ్డి వివరించారు. గుండె బాగానే పనిచేస్తుందని.. రక్త ప్రసరణ కూడా బాగుందని.. తారకరత్న త్వరలోనే కోలుకుంటారని చెప్పారు విజయసాయి రెడ్డి. డాక్టర్లు చాలా మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు తెలిపారు.
విజయసాయిరెడ్డి భార్య సునంద. ఆమె సొంత చెల్లెలి కుమార్తె అలేఖ్యా రెడ్డిని తారకరత్న ప్రేమ వివాహం చేసుకున్నారు. అంటే విజయసాయిరెడ్డికి తారకరత్న అల్లుడు వరస అవుతారు. అలేఖ్యా రెడ్డి టాలీవుడ్‌లో కొన్ని సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..