Sankranthiki Vasthunnam Review: సంక్రాంతికి వస్తున్నాం రివ్యూ.. పక్కా పండగ బొమ్మ.. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాల్సిందే..
వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ అంటే చాలు కచ్చితంగా ఆడియన్స్ ఊహించేది ఎంటర్‌టైన్మెంట్. ఎఫ్ 2, ఎఫ్ 3 తర్వాత ఈ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది..? ప్రేక్షకులను అలరించిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..
మూవీ రివ్యూ: సంక్రాంతికి వస్తున్నాం
నటీనటులు: వెంకటేష్, మీనాక్షి చౌదరీ, ఐశ్వర్య రాజేశ్, వీకే నరేష్, ఉపేంద్ర లిమియా, వీటీ గణేష్, సాయి కుమార్, పమ్మి సాయి, సర్వదమన్ బెనర్జీ తదితరులు
సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి
ఎడిటర్: తమ్మిరాజు
సంగీతం: భీమ్స్ సిసిరిలియో
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ అంటే చాలు కచ్చితంగా ఆడియన్స్ ఊహించేది ఎంటర్‌టైన్మెంట్. ఎఫ్ 2, ఎఫ్ 3 తర్వాత ఈ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది..? ప్రేక్షకులను అలరించిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ:
యాదగిరి దామోదర రాజు ( విక్టరీ వెంకటేష్) ఓ అనాథ. చిన్నప్పటి నుంచి బాగా చదివి పోలీస్ అవుతాడు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా మారి.. అన్యాయం జరిగిన చోట ప్రత్యక్షం అవుతుంటాడు. YD రాజును తొలి చూపులోనే చూసి ఇష్టపడుతుంది తన సహ ఉద్యోగి డీసీపీ మీనాక్షి (మీనాక్షి చౌదరి). అయితే కొన్ని కారణాలతో ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత భాగ్యలక్ష్మీ అలియాస్ భాగ్యం (ఐశ్వర్య రాజేశ్)ను పెళ్లి చేసుకుని హాయిగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు రాజు. ఈ సమయంలోనే అమెరికా నుంచి పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ సిఈఓ ఆకెళ్ల సత్యం (అవసరాల శ్రీనివాస్) ఇండియాకు వస్తాడు. ఆయన్ని బీజూ పాండే గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. సిఎం (నరేష్)కు ఇది తలనొప్పి తీసుకొస్తుంది. తన అన్న పాప పాండేను విడిచిపెడితేనే ఆకెళ్లను విడిచిపెడతామని చెప్తారు బిజూ గ్యాంగ్. దాంతో ఆకెళ్లను కాపాడటానికి సస్పెండ్ అయిన రాజును డీసీపీ మీనాక్షి సాయంతో వెనక్కి తీసుకొస్తాడు సిఎం. ఆ తర్వాత ఏం జరిగింది..? అసలు సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్‌తో కథకు లింక్ ఏంటి అనేది స్క్రీన్ మీద చూడాలి..
కథనం:
ఏం సౌండ్ లేదు.. రీసౌండింగ్ అస్సలే లేదు.. వందల కోట్ల బడ్జెట్ లేదు.. విజువల్ ఎఫెక్ట్స్ జోలికి వెళ్లలేదు.. ఆర్నెళ్లకు ముందు అనౌన్స్‌మెంట్.. మూడు నెలల్లో షూటింగ్.. సంక్రాంతికి రిలీజ్.. ధడేల్‌మంటూ హిట్..! సింపుల్‌గా చెప్పాలంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై ఇదే ఆడియన్స్ మనసులో మాట. నో లాజిక్స్.. బుర్రను డీప్ ఫ్రిజ్‌లో పెట్టి వస్తే కడుపుబ్బా నవ్వించే సినిమా ఇది. ముందు నుంచి అనిల్ రావిపూడి ఇదే చెప్తున్నాడు. హాయిగా పండక్కి నవ్వుకునే సినిమానే తీసుకొస్తున్నాం అని.. అదే చేసాడు. తనది కాని గ్రౌండ్‌లోనూ భగవంత్ కేసరితో సిక్స్ కొట్టి అనిల్.. తనదైన కామెడీ జోన్‌లో ఊరికే ఉంటాడా.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడూ..! కథ గురించి అడగొద్దు.. జస్ట్ సీక్వెన్సులు ఎంజాయ్ చేస్తే అదిరిపోతుంది ఈ సినిమా. వెంకటేష్ ఇమేజ్‌కు తగ్గట్లు స్క్రిప్ట్ రాసుకున్నాడు అనిల్. ముఖ్యంగా ఫస్టాఫ్ అయితే హిలేరియస్‌గా వెళ్లిపోయింది. బుల్లిరాజు, చినరాజు కలిసి కితకితలు పెట్టారు. బుల్లిరాజుగా చేసిన బుడ్డోడు అయితే మామూలుగా నవ్వించలేదు. మనోడి కోసమే రెండు మూడు సీన్స్ రాసుకున్నాడు అనిల్. ఐశ్వర్యా రాజేష్, వెంకటేష్ కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఫస్టాఫ్ అంతా వాళ్ళిద్ధరి మధ్య వెళ్లిపోయింది. ఇక మీనాక్షి చౌదరి ఎంట్రీ ఇచ్చాక.. కామెడీ మరో మెట్టు పైకి ఎక్కింది. ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య వెంకీ పడే బాధ భలే నవ్వు తెప్పిస్తుంది. ముఖ్యంగా ఇద్దరు ఆడవాళ్లు ఒకేచోట ఉంటే.. అందులోనూ మాజీ ప్రేయసి, భార్య ఒక దగ్గర ఉంటే ఆ మగాడి కష్టాలెలా ఉంటాయో చూపించాడు అనిల్ రావిపూడి. ఆ సీన్స్ బాగా రాసుకున్నాడు. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త డల్ అయినట్లు అనిపించినా.. బోర్ అయితే కొట్టదు. క్లైమాక్స్ చాలా బాగా రాసుకున్నాడు.. ఎఫ్ 2 తరహాలోనే లేడీస్‌పై పంచులు పేల్చాడు అనిల్ రావిపూడి. కేవలం కామెడీ మాత్రమే కాకుండా చివర్లో థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు ఓ చిన్న మెసేజ్ కూడా ఇచ్చాడు దర్శకుడు. గురుదేవోభవ అంటూ తనదైన శైలిలో చెప్పాడు అనిల్ రావిపూడి.
నటీనటులు:
వెంకటేష్ గురించి ఏం చెప్పాలి..? ఇలాంటి కారెక్టర్స్ ఆయనకు కొట్టిన పిండి.. ఎంటర్‌టైన్మెంట్‌తో చంపేసాడు వెంకీ మామ. ముఖ్యంగా ఈ వయసులోనూ ఆయన ఎనర్జీకి సలాం. ఐశ్వర్య రాజేష్ చాలా బాగా నటించింది. కాస్త లేట్ అయినా లేటెస్ట్‌గా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఐశ్వర్య. ఇక మీనాక్షి చౌదరి స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. పోలీస్ ఆఫీసర్‌గా బాగా నటించింది. వెంకటేష్ కొడుకు పాత్రలో నటించిన బుడ్డోడు ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. బుల్లిరాజుగా అదరగొట్టాడు. జైలర్ పాత్రలో యానిమల్ ఫేమ్ ఉపేంద్ర లిమియా బాగా నవ్వించాడు. వికే నరేష్, గణేష్, పమ్మిసాయి, సాయికుమార్ ఇలా ప్రతీ ఒక్కరిని వాడుకున్నాడు అనిల్ రావిపూడి. అందరితోనూ తనదైన కామెడీ చేయించాడు.
టెక్నికల్ టీం:
భీమ్స్ మ్యూజిక్ ఈ సినిమాకు మేజర్ హైలైట్. మూడు పాటలతో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. ఎడిటింగ్ కూడా చాలా షార్ప్‌గా ఉంది. కేవలం 2.24 గంటలు మాత్రమే ఉంటుంది సినిమా. ఇక సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. టెక్నికల్ వైజ్‌గా మంచి ప్రాడక్ట్ ఇచ్చాడు దిల్ రాజు. అనిల్ రావిపూడిపై రొటీన్ అనే ముద్ర వేస్తారు కానీ ప్రతీసారి అలా రొటీన్ కథతో నవ్వించడం కూడా కస్టమే. అందులో ఆరితేరిపోయాడు అనిల్ రావిపూడి.. మాస్టర్ ఆఫ్ ఫ్యామిలీ సబ్జెక్ట్స్ అయిపోయాడు. సింపుల్ కథనే స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేసాడు ఈ దర్శకుడు. దిల్ రాజు, శిరీష్ మరోసారి క్వాలిటీ ప్రాడక్ట్ ఇచ్చారు.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా సంక్రాంతికి వస్తున్నాం.. పక్కా పండగ బొమ్మ.. జస్ట్ ఎంజాయ్ విత్ ఫ్యామిలీస్..!