Vedha Movie review: వేద మూవీ రివ్యూ.. ఉమెన్ సెంట్రిక్ రివేంజ్ డ్రామా..
తాజాగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన వేద సినిమా విడుదలైంది. డిసెంబర్‌లోనే కన్నడలో విడుదలైన ఈ చిత్రానికి అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. పైగా ఇది శివన్న 125వ సినిమా. మరి తెలుగులో దీనికి రెస్పాన్స్ ఎలా ఉంది.. అసలు వేద ఎలా ఉన్నాడు..?
రివ్యూ: వేద
నటీనటులు: శివరాజ్ కుమార్, గనవి లక్ష్మణ్, శ్వేతా చెంగప్ప, అదితి సాగర్, భరత్ సాగర్, వీణ పొన్నప్ప తదితరులు
సినిమాటోగ్రఫీ: స్వామి జే గౌడ
సంగీతం: అర్జున్ జన్య
ఎడిటర్: దీపు ఎస్ కుమార్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: హర్ష
నిర్మాత: గీతా శివరాజ్ కుమార్
ఒకప్పుడు కన్నడ సినిమాలంటే పట్టించుకునే వాళ్లు కాదు కానీ ఇప్పుడలా కాదు. తమ గురించి పట్టించుకునేలా చేస్తున్నాయి అక్కడి సినిమాలు. ఈ క్రమంలోనే తాజాగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన వేద సినిమా విడుదలైంది. డిసెంబర్‌లోనే కన్నడలో విడుదలైన ఈ చిత్రానికి అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. పైగా ఇది శివన్న 125వ సినిమా. మరి తెలుగులో దీనికి రెస్పాన్స్ ఎలా ఉంది.. అసలు వేద ఎలా ఉన్నాడు..?
కథ:
మైసూరులో నీల అనే అమ్మాయిని బస్సులో కొందరు ఏడిపిస్తుంటారు. ఇంటికి వచ్చి తన నాయనమ్మ, రిటైర్డ్ ఇన్స్‌పెక్టర్ రమా (శ్వేతా చెంగప్ప)కు చెప్పి ఏడుస్తుంది. అప్పుడు ఆ బామ్మ తన కెరీర్‌లో తాను చూసిన వేద (శివరాజ్ కుమార్) కథ తన మనవరాలికి చెప్తుంది. 1980ల్లో వేద, తన కూతురు కనక (అదితి సాగర్)తో కలిసి కొందర్ని అతి కిరాతకంగా చంపేస్తుంటారు. అలా ఒక్కో ఊరికి వెళ్లి తమకు గతంలో అన్యాయం చేసిన వాళ్లను ఏరి మరీ నరికేస్తుంటారు. గత 20 ఏళ్ళు వెనక్కి వెళ్తే అనుకోని పరిస్థితుల్లో పక్క ఊళ్ళో ఉండే పుష్ప (గనవి లక్ష్మణ్)ను పెళ్లి చేసుకుంటాడు వేద. వాళ్లకు కనక అనే కూతురు కూడా ఉంటుంది. ఓ సందర్భంలో ఊరి గొడవల కారణంగా మూడు రోజులు జైలుకు వెళ్తాడు వేద. జైలు నుంచి విడుదలయ్యే సమయానికి తన భార్య పుష్పను కొందరు దారుణంగా కొట్టి చంపేస్తారు.. అలాగే 8 ఏళ్ళ కూతుర్ని జైలుకు పంపిస్తారు. ఒక్క రోజులోనే జీవితం తలకిందులు కావడంతో గుండెలు పగిలేలా ఏడుస్తాడు వేద. అప్పటి వరకు ఆనందంగా ఉన్న వేద జీవితంలో అంత పెను మార్పు ఏం జరిగింది..? తన కుటుంబానికి అన్యాయం చేసిందెవరు..? ఎందుకు వాళ్లందరినీ కూతురుతో పాటు వేద చంపేస్తుంటాడు అనేది అసలు కథ..
కథనం:
వేద కథ చూడ్డానికి చాలా సింపుల్‌గా ఉంటుంది. తన కుటుంబానికి అన్యాయం చేసిన ఐదుగురు వ్యక్తులను వెతుక్కుంటూ వెళ్లి పగ తీర్చుకోవడమే. కానీ అందులోనే చాలా విషయాలు చెప్పాలని చూసాడు దర్శకడు హర్ష. ముఖ్యంగా కన్నడలో శివరాజ్ కుమార్ అంత పెద్ద హీరో అయినా కూడా.. ఈ కథలో మాత్రం ఆయన కేవలం ఓ పాత్రదారిలాగే ఉండిపోయాడు కానీ ఎక్కడా హీరోయిజం చూపించలేదు. సినిమా అంతా ఎక్కువగా మహిళా ప్రాధాన్యంగానే సాగుతుంది. పగ తీర్చుకునే సమయంలోనూ కూతురును ముందుంచుతాడే కానీ.. అత్యవసర పరిస్థితుల్లో కానీ తాను ముందుకెళ్లడు శివన్న. ఇలాంటి కథలను చెప్పడం కాస్త కష్టమైన పనే. కానీ దీన్ని యాక్షన్ జోడించి.. కమర్షియల్ విలువలతో పాటు సందేశాత్మకంగా చిత్రీకిరించే ప్రయత్నం చేసాడు దర్శకుడు హర్ష. తెలియకుండానే చాలా చోట్ల కేజియఫ్ ఎఫెక్ట్స్ కళ్ళ ముందు కనిపిస్తాయి. పగ తీర్చుకునే క్రమంలో మనకు కొన్ని తెలుగు సినిమాలు కూడా గుర్తుకొస్తాయి. ఫస్టాఫ్ అంతా ఆసక్తికరంగా సాగుతుంది. అయితే మధ్యలో వచ్చే శివన్న పెళ్లి ఎపిసోడ్.. అక్కడ వచ్చే కామెడీ సన్నివేశాలు తెలుగులో వర్కవుట్ అవ్వడం కష్టమే. ఇంటర్వెల్ ఎపిసోడ్ చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ అయితే ఇరగదీసారు. సెకండాఫ్ కూడా చాలా వరకు ఫ్లాష్ బ్యాక్‌ను సస్పెన్స్‌లో పెట్టి కథ నడిపించాడు దర్శకుడు హర్ష. అయితే చివరికి ఊహించిన కథనే చూపించాడు. చిన్న కథ చుట్టూ వేద అల్లుకున్నాడు హర్ష. కాకపోతే ఎక్కువగా అమ్మాయిలను గౌరవించడం.. వాళ్ల గొప్పతనం చెప్పే ప్రయత్నమే చేసాడు కథలో. దాంతో పాటు సమాజంలో అమ్మాయిలను మగవాళ్లు ఎంత హీనంగా చూస్తున్నారనేది కూడా అంతర్లీనంగా చెప్పాడు. శివన్న లాంటి స్టార్ హీరో ఈ కథకు తోడు కావడంతో రీచ్ కూడా ఎక్కువగానే వెళ్లింది కన్నడనాట. కానీ తెలుగులో ఈ కథ వర్కవుట్ అవ్వడం కాస్త కష్టమే.. కానీ ప్రయత్నం అయితే మెచ్చుకోకుండా ఉండలేం.
నటీనటులు:
శివరాజ్ కుమార్ అద్భుతంగా నటించాడు. వేద పాత్రకు ప్రాణం పోసాడు. ఆయన రౌద్రం సినిమాకు ప్లస్ పాయింట్. స్టార్ డమ్ పక్కన బెట్టి హీరోయిన్ పాత్రకు పూర్తిగా ప్రాధాన్యత ఇచ్చారు శివన్న. దీనికి నిజంగా ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. పుష్పగా గనవి లక్ష్మణ్ నటన నెక్ట్స్ లెవల్‌లో ఉంది. ఇక కూతురు కనక పాత్రలో సింగర్ అదితి సాగర్ అద్బుతంగా నటించారు. ఆమె యాక్షన్ సీన్స్ సినిమాకు కలిసొచ్చాయి. మిగిలిన వాళ్లంతా పూర్తిగా కన్నడ నటులే.. అందరూ పాత్రకు తగ్గట్లు నటించారు.
టెక్నికల్ టీం:
ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ ప్రాణంగా నిలిచింది. విజువల్స్ చాలా బాగా తీసారు స్వామి జే గౌడ. అలాగే అర్జున్ జన్యా నేపథ్య సంగీతం బాగుంది. పాటలు మనకు అంతగా కనెక్ట్ అవ్వవు. ఎడిటింగ్ కాస్త వీక్ అనిపించింది. ఫస్టాఫ్‌తో పాటు సెకండాఫ్ కూడా 15 నిమిషాల వరకు తెలుగు వర్షన్ వరకు కత్తిరించి ఉంటే సినిమా మరింత వేగంగా ఉండేదేమో అనిపించింది. దర్శకుడిగా హర్ష మంచి లైన్ తీసుకున్నాడు కానీ స్క్రీన్ ప్లే దగ్గరే కాస్త లోపాలు ఉన్నాయి. మరీ ఫ్లాట్ స్క్రీన్ ప్లే ఇబ్బంది పెడుతుంది. గీతా శివరాజ్ కుమార్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
పంచ్ లైన్:
వేద.. ఉమెన్ సెంట్రిక్ రివేండ్ డ్రామా.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.