AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Annamayya: అన్నమయ్య సినిమాలో వేంకటేశ్వరుని పాత్ర మిస్ చేసుకున్న స్టార్ హీరోలు వీళ్లే..!

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున భక్తిరస చిత్రంలో నటిస్తారని, అందులోనూ టైటిల్ రోల్ చేస్తారని ఎవ్వరూ ఊహించరు. అటువంటిది, వేంకటేశ్వరుడికి ప్రియ భక్తుడు ‘అన్నమయ్య’గా నటించి అభిమానులతోపాటు సినీ ప్రియులను కూడా మెప్పించారు నాగ్. ఈ మూవీలో నటుడు సుమన్ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పాత్రను పోషించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేశారు.

Annamayya: అన్నమయ్య సినిమాలో వేంకటేశ్వరుని పాత్ర మిస్ చేసుకున్న స్టార్ హీరోలు వీళ్లే..!
Annamayya
Nikhil
| Edited By: Janardhan Veluru|

Updated on: Nov 12, 2025 | 8:22 AM

Share

Annamayya: కలియుగ ప్రత్యక్ష్మ దైవం వేంకటేశ్వరస్వామి చరిత్రపై చాలా సినిమాలు తెరకెక్కాయి. వాటిలో నేటి తరానికి గుర్తుండిపోయే సినిమాల్లో ‘అన్నమయ్య’ ఒకటి. టాలీవుడ్ మన్మధుడు నాగార్జున మొదటిసారి భక్తిరస చిత్రంలో నటించిన సినిమా అన్నమయ్య. వేంకటేశ్వర స్వామి చరిత్ర తెలుసుకోవాలని దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులు ఆరాటపడుతుంటారు.

వారికి శ్రీవారి చరిత్రలోని ఆసక్తికర విషయాలను తెలియజేసేలా సినిమా తీయాలని దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు నిర్ణయించుకున్నారు. ఏడుకొండల వెంకన్నకు ఇష్టమైనది గానం. వేంకటేశ్వరుడిని తన పాటలతో అలరించారు అన్నమయ్య. అన్నమయ్య చరిత్రను ప్రేక్షకులకు తెలిసే సినిమాను తెరకెక్కించాలని రాఘవేంద్రరావు అనుకున్నారు.

నాగార్జునను అన్నమయ్య పాత్రకు ఎంపిక చేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాస్, క్లాస్ క్యారెక్టర్లతో అభిమానులను అలరించే నాగ్.. భక్తిరస చిత్రంలో అది కూడా టైటిల్ రోల్ పోషించడానికి ఎంపిక చేయడంపై చాలా మంది పెదవి విరిచారు. అయితే, విమర్శలను పట్టించుకోకుండా నాగార్జునతో అన్నమయ్య పాత్రలో నటింపజేసి చరిత్ర సృష్టించారు. ‘అన్నమయ్య’ పేరుతో సినిమాను తెరకెక్కించి 1997లో విడుదల చేశారు. ఆ సమయంలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలోని పాటలు సంగీత ప్రియులను అలరించాయి.

అన్నమయ్య క్యారెక్టర్ కోసం నాగార్జునను ఎంపిక చేసి సాహసం చేసిన రాఘవేంద్రరావు.. వేంకటేశ్వరుడి క్యారెక్టర్ ఎవరితో చేయించాలనే దానిపై చాలా ఆలోచించారు. అప్పటికే స్టార్ హీరోగా ఉన్న నాగార్జున క్యారెక్టర్ ప్రకారం వేంకటేశ్వరస్వామి పాదాలపై పడే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి. ఆ పాత్రను చిన్న నటుడితో చేయిస్తే నాగ్ అభిమానుల నుంచి వ్యతిరేకత వస్తుందనే అనుమానం వచ్చింది. చివరికి సీనియర్ హీరో సుమన్‌ను ఆ పాత్రకు ఎంపిక చేశారు. అయితే, వేంకటేశ్వరుని క్యారెక్టర్‌‌కు ముందుగా అనుకున్న ఇద్దరు హీరోలను అనుకున్నారట. వాళ్లు ఎవరో తెలుసా..?

ముందుగా ఈ పాత్ర కోసం శోభన్ బాబును చిత్ర యూనిట్ సంప్రదించిందట. ఆయనకు కథ చెప్పి వేంకటేశ్వర స్వామి పాత్రను చేయాలని అడిగారు. అయితే శోభన్ బాబు అప్పటికే సినిమాల నుంచి రిటైర్ అయ్యారు. అంతేకాదు హీరోగానే నటించి మానేస్తానని అంతకుముందే చాలాసార్లు చెప్పారు. దీంతో ఆయన ఈ పాత్ర చేయడానికి ఇష్టపడలేదు. ఈ విషయాన్ని నేరుగా చెప్పకుండా ఆ సమయంలోనే రూ.50 లక్షల రెమ్యునరేషన్ అడిగారట. పారితోషికం చాలా ఎక్కువ కావడంతో శోభన్‌బాబును ఎంపిక చేయలేదు.

అనంతరం ఇదే పాత్ర కోసం నందమూరి బాలకృష్ణను కలిశారని తెలిసింది. ఈ సినిమాలో శ్రీ వేంకటేశ్వరుని పాదాలకు అన్నమయ్య మొక్కాల్సి ఉంటుంది. అయితే, బాలకృష్ణతో సమానమైన క్రేజ్ ఉన్న నాగార్జున ఈ సీన్ చేస్తే ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవలు జరుగుతాయని అనుకున్నారట బాలకృష్ణ. తనకు డేట్స్ ఖాళీ లేవని చెప్పడంతో చివరికి సుమన్‌ను ఎంపిక చేశారట. చివరికి సీనియర్ హీరో సుమన్ అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదని భావించిన రాఘవేంద్రరావు  ఆయనకు స్క్రీన్ టెస్ట్ చేయించి ఓకే చేసేశారు.

ఇక, వేంకటేశ్వరుని పాత్రలో  సుమన్ నటించి మెప్పించారు. వేంకటేశ్వరుడు ఇలాగే ఉంటాడేమో అనే విధంగా సుమన్ నటన అభిమానులను ఆకట్టుకుంది. సుమన్ పక్కన పద్మావతి అమ్మవారి పాత్రలో భానుప్రియ నటించి మెప్పించారు. అన్నమయ్య మరదళ్లుగా రమ్యకృష్ణ, కస్తూరి నటించారు. బ్రహ్మానందం, గుండు హనుమంతరావు, సుత్తివేలు తదితరులు ముఖ్యపాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు.