Hyderabad: ఇద్దరు జూనియర్ ఆర్టిస్టుల ఆత్మహత్య.. అవకాశాల్లేక.. అనుకున్నది సాధించలేక..
చనిపోతున్నారు.. చావొచ్చి కాదు. ప్రాణాలు తీసుకుంటున్నారు.. బతకలేక కాదు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. భయపడి కాదు. బాధపడి.!
Telugu Film Industry: చనిపోతున్నారు.. చావొచ్చి కాదు. ప్రాణాలు తీసుకుంటున్నారు.. బతకలేక కాదు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. భయపడి కాదు. బాధపడి.! తీవ్ర మనస్తాపంతో.. ఇక రావు అన్న ఆవేదనతో.. బలిపీఠమెక్కుతున్నారు. అవకాశాల్లేక.. అనుకున్నది సాధించలేక.. నా అన్న వాళ్ల మోసం భరించలేక.. ఆర్థిక ఇబ్బందులు తాళలేక.. తమ బతుకుకు సెలవిక..అంటున్నారు. తాజాగా రోజు వ్యవధిలో ఇద్దరు నటీమణులు తమ ప్రాణం తీసుకున్నారు. ఒకరిది మానసికవేదన.. మరొకరిది ప్రేమ మిగిల్చిన మనోవేదన. ఎందుకిలా జరుగుతోంది.
ఒక్క చాన్స్.. ఒకే ఒక్క చాన్స్ ఆశలతో టాలెంట్ క్రిష్ణానగర్‌కు క్యూ కడుతోంది. కడుపు కాలినా.. ఆకలి వేధిస్తున్నా.. అవకాశం కోసం ఆశలతో ఎదురుచూస్తుంటారు. తెర వెనక ఏం జరుగుతుందో తెలీదు గానీ.. జూనియర్ ఆర్టిస్టుల రియల్ వ్యథలు మాత్రం రీల్ మీదకు ఎక్కుతున్నాయి. రంగుల జీవితంలో స్క్రీన్ మీద కనిపించే నవ్వులు.. తెర వెనుక ఉండటం లేదా? నటీనటుల వరుస ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి. ?
అనురాధ.. బుల్లితెరపై ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న నటి. కానీ తన కలలు తీరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. కారణం.. ప్రేమ.. లేక మరేదైనా అన్నది తేలలేదు కానీ.. ప్రాధమికంగా ప్రియుడు మోసం చేశాడన్న బాధతోనే చనిపోయిందన్నది ప్రాథమిక నిర్థారణ. చనిపోయే వయసు కాదు..ప్రాణం తీసుకునేంత పరిస్థితి కాదు..కానీ చనిపోయింది.
సీన్ ఆఫ్ అఫెన్స్‌ను బట్టీ అనురాధది ఆత్మహత్య అని పోలీసులు అంచనా. కానీ బంధువులు హత్యేనంటున్నారు. కిరణ్ మరికొందరు అనురాధ మృతికి కారణం, కారకులని ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి వచ్చిన అనురాధ..సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలోనే కిరణ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అది కాస్తా ప్రేమగా మారింది. పెళ్లికి కూడా రెడీ అయ్యారు.సహజీవనం కూడా ప్రారంభించారు. అంతా ఓకే అనుకున్న సమయంలో.. ప్రియుడు హ్యాండిచ్చాడు. అతను మరో పెళ్లికి రెడీ అయిపోవడంతో…తట్టుకోలేక తనువు చాలించిందన్నది కుటుంబసభ్యుల నుంచి వస్తున్న సమాచారం.
కర్నాటకలోనూ సేమ్ విషాదమే. నటి సౌజన్య ఆత్మహత్య అక్కడి సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా కుదిపేసింది. ఆమె రాసినట్లుగా ఉన్న సూసైడ్‌నోట్ ప్రకారం.. ఆమె ఆరోగ్యం క్షీణించడం, పరిశ్రమలో అవకాశాలు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లు నోట్‌లో వెల్లడించింది. ఆత్మహత్య చేసుకోవడంపై సౌజన్య తన తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పింది. సౌజన్య, అనురాధలే కాదు సినీ ఇండస్ట్రీలో గతంలోనూ జరిగాయి. ఇక ప్రత్యూష మరణం ఇప్పటికీ వీడని మిస్టరీనే. 2003లో తన ప్రియుడు సిద్ధార్ధ్‌రెడ్డితో కలిసి సూసైడ్ చేసుకున్నారామె. ప్రత్యూషను అత్యాచారం చేసి చంపారని అప్పట్లో పెద్ద దుమారమే రేగింది.
2020లో.. మనసు మమత, మౌనరాగం సీరియల్స్ ఫేమ్ శ్రావణి, జూలై 9న కన్నడ నటుడు సుశీల్ గౌడ్, అదే ఏడాది జనవరి 25న. కన్నడ నటి జయశ్రీ రామయ్య డిప్రెషన్‌తో చనిపోయారు. ఇక మన పాతతరం నటీమణులు దివ్యభారతి మేడమీద నుంచి పడి చనిపోగా.. సిల్క్‌స్మిత ఉరివేసుకుని ఆత్మహత్యచేసుకుంది. వీళ్లే కాదు.. చాలామంది యువనటులు.. లైఫ్‌ను లీడ్‌చేయలేక తమను తామే చంపుకుంటున్నారు. మన టాలీవుడ్‌లోనే కాదు.. శాండిల్‌వుడ్‌లోనూ నటుల ఆత్మహత్యలు ఈమధ్యకాలంలో మనల్ని బాధపెట్టాయ్.. మరికొన్ని కదలించాయ్.. ఇంకొన్ని కన్నీటిలో ముంచాయి.
Read also: Student Death: పేరెంట్స్ అందర్నీ ఉలిక్కిపడేలా చేస్తోన్న చదువులమ్మ ఒడిలో జరిగిన దారుణం