Dhanraj: శ్రీరామనవమి రోజున క్షమాపణలు చెప్పిన జబర్దస్త్ ధన్‌రాజ్.. ఏం జరిగిందంటే?
శ్రీరామనవమి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం (ఏప్రిల్ 06) రామాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఈ పండగను విశేషంగా జరుపుకొన్నారు. అయితే ఈ శ్రీరామనవమి పర్వదినాన జబర్దస్త్ నటుడు ధన్ రాజ్ అందరికీ క్షమాపణలు చెప్పాడు. ఎందుకంటే?

శ్రీరామనవమి పండుగ ను పురస్కరించుకుని రామాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ లాంటి పలు ప్రముఖ నగరాల్లో రాముని శోభాయాత్రలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక టీవీల్లోనూ శ్రీరాముని సినిమాలే, పాటలే దర్శనమిస్తున్నాయి. ఇక శ్రీరామనవమి పండగ అనగానే అందరికీ గుర్తొచ్చే మొదటి సినిమా లవకుశ. దివంగత నటుడు ఎన్టీఆర్ ఇందులో రఘురాముడి పాత్రలో నటించారు. అలాగే దివంగత నటి అంజలి సీతమ్మ పాత్ర ను పోషించింది. శ్రీరామనవమి పండగ వచ్చిందంటే టీవీల్లో లవకుశ సినిమా పడాల్సిందే. సినిమా కాకపోయినా కనీసం ఇందులోని పాటలైనా టెలికాస్ట్ అవ్వాల్సిందే. ముఖ్యంగా లవకుశ సినిమాలోని ‘రామ కథను వినరయ్యా’ అంటూ లవ కుశలు పాడే పాటకు స్పెషల్ క్రేజ్ ఉంది. ఈక్రమంలోనే శ్రీరామనవమి కావడంతో ఆదివారం (ఏప్రిల్ 06) మరోసారి ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.ఇప్పుడిదే పాటకు సంబంధించి ప్రముఖ నటుడు, దర్శకుడు జబర్దస్త్ ఫేమ్ ధనరాజ్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.
లవకుశలోని రామ కథను వినరయ్యా పాటను అత్యంత మధురంగా ఆలపించిందెవరో తెలుసా? అలనాటి సింగర్లు సుశీల, లీల. ఇదే క్రమంలో ధన్‌రాజ్ మాత్రం ఈ పాటకు సంబంధించి ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘దాదాపు 60 ఏళ్ల క్రితం వచ్చిన లవకుశ చిత్రంలోని పాటను పాడింది ఈఈ అక్కా చెల్లెళ్లే’ అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. అది కాస్తా నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన పలువురు సినీ అభిమానులు, నెటిజన్లు లవకుశ పాట పాడింది ఈ అక్కాచెల్లెళ్లు కాదంటూ కామెంట్స్ పెట్టారు. దీంతో అసలు విషయం తెలుసుకున్న ధన రాజ్.. తాను పెట్టిన పోస్ట్ కు క్షమాపణలు చెప్పాడు. ఈ అద్భుతమైన పాట పాడింది వీరిద్దరు కాదు.. పి. సుశీల, లీల గార్లు. తెలియక తప్పుడు సమాచారం ఇచ్చినందుకు సారీ’ అంటూ మరో పోస్ట్ పెట్టాడీ జబర్దస్త్ నటుడు. ప్రస్తుతం ధన్ రాజ్ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక సినిమాల విషయానికొస్తే ఇప్పటికే పలు సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించాడు ధనరాజ్. ఇటీవలే రామం రాఘవం చిత్రంతో దర్శకుడిగానూ మారాడు. ఇందులో హీరోగానూ నటించి తన ప్రతిభతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. సముద్రఖని ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ధన్ రాజ్ పోస్ట్..
60 సంవత్సరాల క్రితం లవకుశ సినిమా కోసం పాడిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు … మళ్ళీ ఆ పాటను పాడి వినిపించారు, రాముడి పాట 60 సంవత్సరాలు సజీవంగా నిలబెట్టిన వారి జన్మధన్యమైంది.🙏 oka Group lo vochindi 🤗 pic.twitter.com/H7A7B5jlxn
— Dhanraj koranani (@DhanrajOffl) April 5, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.