Tollywood: సూపర్ హిట్ సినిమా తర్వాత ఊహించినట్టుగా అవకాశాలు రాలేదని నిరాశ చెందానంటున్న తెలుగు నటి
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఏటా ఎంతోమంది కొత్త హీరోయిన్లు వస్తుంటారు. ముఖ్యంగా ఉత్తరాది నుండి వచ్చే భామల హవా ఇక్కడ చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే ఈ గ్లామర్ ప్రపంచంలో తనదైన ముద్ర వేయడానికి ఒక తెలుగమ్మాయి ఎంతో ధైర్యంగా అడుగులు వేస్తోంది.

మొదటి సినిమాతోనే తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ భామ, ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన నటించే అరుదైన అవకాశం దక్కించుకుంది. కానీ అంతటి స్టార్ హీరో పక్కన నటించినా కూడా ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో ఈ చిన్నది కొంతకాలం నిరాశకు గురైంది. మరి ఆ నిరాశ నుండి ఆమె ఎలా బయటపడింది? గ్లామర్ పాత్రల విషయంలో ఆమెకున్న అభిప్రాయం ఏంటి?
ఖమ్మం నుండి వచ్చి టాలీవుడ్‌లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనన్య తన కెరీర్ మరియు వ్యక్తిగత విషయాలను పంచుకుంది. తనది ఖమ్మం జిల్లా అయినప్పటికీ, విజయవాడకు సమీపంలో ఉన్న సత్తుపల్లి ప్రాంతం కావడంతో తన మాటల్లో తెలంగాణ స్లాంగ్ ఎక్కువగా ఉండదని ఆమె వివరించింది. ముంబై నుండి వచ్చే హీరోయిన్లకే టాలీవుడ్‌లో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చాలామంది భావిస్తుంటారు. దీనిపై అనన్య స్పందిస్తూ.. పరభాషా హీరోయిన్లకు మొదట్లో క్రేజ్ ఉండొచ్చు కానీ, తెలుగమ్మాయిలకు ఇండస్ట్రీలో దీర్ఘకాలిక మనుగడ ఉంటుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది.
తెలుగమ్మాయిల ఆత్మవిశ్వాసం..
గత ఐదు, ఆరు ఏళ్లుగా తెలుగు నటీమణులు ఇండస్ట్రీలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నారని అనన్య పేర్కొంది. “మేమందరం ఇప్పుడు ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్నాం.. రాబోయే ఐదేళ్ల తర్వాత కూడా మేం ఇక్కడే ఉంటాం” అని ఆమె గట్టిగా చెప్పింది. కేవలం హీరోయిన్ పాత్రలే కాకుండా, పాత్ర ప్రాధాన్యత ఉన్న అర్థవంతమైన రోల్స్ చేసే అవకాశాలు తెలుగు అమ్మాయిలకే ఎక్కువగా వస్తాయని ఆమె అభిప్రాయపడింది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో మన అమ్మాయిలే రాణిస్తారని ఆమె విశ్వాసం వ్యక్తం చేసింది.

Ananya Nagalla
పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాలో నటించడం తన కెరీర్‌లో ఒక మైలురాయి అని అనన్య చెప్పుకొచ్చింది. అయితే అంతటి పెద్ద హీరోతో సినిమా చేసిన తర్వాత మళ్ళీ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తాయని ఆశించినట్లు ఆమె తెలిపింది. “పెద్ద హీరోలతో సినిమాలు రాకపోవడంతో మొదట్లో కొంచెం నిరాశ చెందాను. కానీ ఆ తర్వాత వచ్చిన పాత్రలు నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి” అని ఆమె పేర్కొంది. ‘తంత్ర’ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాల్లో నటించడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని వివరించింది.
సాంప్రదాయం నుండి గ్లామర్ వరకు..
‘మల్లేశం’, ‘ప్లేబ్యాక్’, ‘వకీల్ సాబ్’ వంటి సినిమాల్లో అనన్య ఎక్కువగా పద్ధతిగా ఉండే పాత్రలే చేసింది. దీనివల్ల ఆమె కేవలం సాంప్రదాయ పాత్రలకే సెట్ అవుతుందని అందరూ అనుకున్నారు. ఈ ముద్రను చెరిపేయడానికి ‘శాకుంతలం’ షూటింగ్ సమయంలో గ్లామరస్ ఫోటోషూట్స్ చేయడం ప్రారంభించింది. నటిగా తనకు క్యారెక్టర్ ఓరియెంటెడ్ పాత్రలతో పాటు పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేయడమే లక్ష్యమని ఆమె స్పష్టం చేసింది.
తనలోని గ్లామర్ కోణాన్ని కూడా ప్రేక్షకులకు చూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా అనన్య వెల్లడించింది. అనన్య నాగళ్ల తనలోని ప్రతిభను నమ్ముకుని ఇండస్ట్రీలో ముందుకు సాగుతోంది. తెలుగమ్మాయిగా ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ, వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిర్మించుకుంటోంది.
