గంటకు 60 నిమిషాలే ఎందుకు.. దీని వెనుక ఉన్న 5వేల ఏళ్ల నాటి మ్యాజిక్ రహస్యం తెలుసా..?
మనం రోజులో వందల సార్లు వాచ్ వంక చూస్తాం.. నిమిషాల లెక్కన పనులు చక్కబెడతాం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? రూపాయికి వంద పైసలు, మీటరుకు వంద సెంటీమీటర్లు ఉన్నప్పుడు.. మరి గంటకు మాత్రం 100 నిమిషాలు కాకుండా 60 నిమిషాలే ఎందుకు ఉన్నాయి అని.. అసలు ఈ 60 అనే అంకె వెనుక ఉన్న రహస్యం ఏంటి? అనేది తెలుసుకుందాం..

మనం ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి పనిని సమయంతో ముడిపెట్టి చూస్తాం. గడియారం వంక చూడకుండా మన రోజు గడవదు. అయితే ఎప్పుడైనా గమనించారా? మన నిత్యజీవితంలో వాడే చాలా కొలతలు 10 లేదా 100 ఆధారంగా ఉంటాయి . కానీ టైమ్ విషయానికి వస్తే మాత్రం.. 60 సెకన్లు ఒక నిమిషం అని, 60 నిమిషాలు ఒక గంట అని లెక్కిస్తాం. అసలు ఈ 60 అంకె వెనుక ఉన్న రహస్యం ఏంటి? అనేది తెలుసుకుందాం..
5000 ఏళ్ల నాటి చరిత్ర: సుమేరియన్ల మేధస్సు
సమయాన్ని కొలిచే ఈ పద్ధతి ఈరోజుల్లో పుట్టింది కాదు. సుమారు 5 వేల సంవత్సరాల క్రితం మెసొపొటేమియాలో నివసించిన సుమేరియన్లు, బాబిలోనియన్లు ఈ వ్యవస్థను కనుగొన్నారు. మనం ఇప్పుడు 10 ఆధారంగా లెక్కించే డెసిమల్ సిస్టమ్ వాడుతుంటే, వారు 60 ఆధారంగా లెక్కించే సెక్సాజిసిమల్ వ్యవస్థను ఉపయోగించేవారు. ఆ పురాతన పద్ధతినే నేటికీ మనం అనుసరిస్తున్నాం.
60 సంఖ్యనే ఎందుకు ఎంచుకున్నారు?
గణిత శాస్త్రం ప్రకారం 60 అనేది ఒక మ్యాజిక్ నంబర్. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఉదాహరణకు 10 అనే సంఖ్యను తీసుకుంటే అది కేవలం 2, 5 తో మాత్రమే నిశ్శేషంగా భాగించబడుతుంది. కానీ 60 అనే సంఖ్యను 1, 2, 3, 4, 5, 6, 10, 12, 15, 20, 30, 60 ఇలా మొత్తం 12 సంఖ్యలతో భాగించవచ్చు. దీనివల్ల లాభం ఏంటంటే.. సమయాన్ని 30 నిమిషాలు, 15 నిమిషాలు, 45 నిమిషాలు లేదా పది నిమిషాలు ఇలా ఏ విభాగంలోనైనా ఫ్రాక్షన్స్ రాకుండా సులభంగా లెక్కించవచ్చు. అందుకే బాబిలోనియన్లు ఈ సంఖ్యను ప్రామాణికంగా తీసుకున్నారు.
నిమిషం, సెకన్.. ఈ పేర్లు ఎలా వచ్చాయి?
సమయంలోని విభజనలకు పేర్లు లాటిన్ భాష నుండి పుట్టాయి.
నిమిషం: లాటిన్‌లో గంటలోని మొదటి చిన్న విభాగాన్ని పార్స్ మినుటా ప్రైమా అనేవారు. అంటే మొదటి చిన్న భాగం. అదే కాలక్రమేణా మినిట్‌గా మారింది.
సెకన్: నిమిషంలోని తదుపరి విభాగాన్ని అంటే రెండో చిన్న భాగాన్ని పార్స్ మినుటా సెకుండా అనేవారు. సెకుండా నుండే మనకు సెకండ్ అనే పదం వచ్చింది.
వృత్తానికి 360 డిగ్రీలు కూడా అందుకే..
కేవలం సమయం మాత్రమే కాదు గణితంలో వృత్తం యొక్క కోణం 360 డిగ్రీలు ఉండటానికి కూడా ఈ బాబిలోనియన్లే కారణం. 60 సంఖ్యను 6 తో గుణిస్తే వచ్చే 360 సంఖ్యను వారు వృత్తాకార కొలతలకు ప్రాతిపదికగా తీసుకున్నారు. ఇది ఖగోళ శాస్త్రంలో గ్రహాల కదలికలను లెక్కించడానికి వారికి ఎంతో సులభంగా ఉండేది. వందల ఏళ్లు గడిచినా, టెక్నాలజీ మారినా మన పూర్వీకులు కనుగొన్న ఈ 60 మ్యాజిక్ మాత్రం మారలేదు. మన గడియారంలో ముల్లు తిరిగే ప్రతిసారీ 5000 ఏళ్ల నాటి బాబిలోనియన్ల మేధస్సు మనకు గుర్తుకు వస్తూనే ఉంటుంది.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
