Gold: బడ్జెట్ తర్వాత బంగారం ధరలు తగ్గుతాయా.. అసలు నిజాలు ఏంటంటే..?
పసిడి ధరలు సామాన్యుడికి బంగారు కలగా మారుతున్నాయి. ఇప్పుడు రూ.1.6 లక్షల మార్కును తాకడం పేద ప్రజలకు కోలుకోలేని దెబ్బగా మారింది. పెళ్లిళ్ల సీజన్ ముంచుకొస్తున్న వేళ, అంతర్జాతీయ మార్కెట్ సెగలు పసిడిని ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. ఈ క్రమంలో అందరి చూపు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2026 వైపు మళ్లింది.

సామాన్యుడికి ఇప్పుడు బంగారం కొనడం ఒక కలగా మారిపోయింది. అంతర్జాతీయ పరిణామాలు, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధరలు మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1.6 లక్షల మార్కును తాకడంతో పేద ప్రజలు వివాహాలు, పండుగలకు నగలు కొనాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే అందరి దృష్టి కేంద్ర బడ్జెట్‌పై పడింది.
ధరలు పెరగడానికి ప్రధాన కారణాలేంటి?
నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిరత పసిడి ధరలను ప్రభావితం చేస్తోంది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర రికార్డు స్థాయిలో 5,000 డాలర్లకు, వెండి 100డాలర్లకి చేరువలో ఉండటం ప్రధాన కారణం. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడంతో దిగుమతి ఖర్చులు భారమయ్యాయి. గ్రీన్‌ల్యాండ్ వివాదం వంటి అంతర్జాతీయ ఘర్షణలు సరఫరా గొలుసును దెబ్బతీసి, మార్కెట్‌లో ఆందోళనను పెంచాయి.
ఆభరణాల పరిశ్రమ డిమాండ్లు ఇవే..
పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా, ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో కొన్ని కీలక ఉపశమన చర్యలు చేపట్టాలని ‘ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్, ఇతర ప్రముఖులు విజ్ఞప్తి చేస్తున్నారు. బంగారంపై దిగుమతి సుంకాన్ని హేతుబద్ధీకరించడం వల్ల దేశీయంగా ధరలు తగ్గుతాయని, తద్వారా సామాన్యులకు ఊరట లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆభరణాలపై ఉన్న 3శాతం GSTని 1.25శాతం లేదా 1.5శాతానికి తగ్గించాలని డిమాండ్ ఉంది. ఇది జరిగితే మధ్యతరగతి, గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది. 2.5శాతం వడ్డీ, పన్ను మినహాయింపులతో బాగా ఆదరణ పొందిన సావరిన్ గోల్డ్ బాండ్ పథకాన్ని మళ్లీ ప్రారంభించాలని పెట్టుబడిదారులు కోరుతున్నారు.
డిజిటల్ బంగారం వైపు మొగ్గు?
భౌతిక బంగారం కొనడం కష్టతరమవుతున్న వేళ, డిజిటల్ బంగారంపై అవగాహన పెంచాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. పన్ను మినహాయింపులు ఇస్తే, ఇళ్లలో ఉన్న బంగారం ఆర్థిక ప్రవాహంలోకి వచ్చి దేశ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తుందని జ్యువెలరీ మేనేజింగ్ డైరెక్టర్లు అభిప్రాయపడుతున్నారు. బంగారం కేవలం అలంకార వస్తువు మాత్రమే కాదు, భారతీయులకు అది ఒక ఆర్థిక భద్రత. రాబోయే బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం, GST విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటేనే మధ్యతరగతి ఇండ్లలో మళ్లీ పసిడి వెలుగులు నిండుతాయి.
