Tatikonda Aishwarya: ‘‘ఇవి నీ మృతికి నివాళిగా రాస్తున్న అక్షరాలు కావు”.. తీవ్ర భావోద్వేగానికి లోనైన సూర్య
అమెరికాలోని టెక్సాస్‌లోని ఒక మాల్‌లో జరిగిన కాల్పుల ఘటనలో.. తెలంగాణకు చెందిన తాటికొండ ఐశ్వర్య (27) కూడా మృతి చెందింది. ఐశ్వర్య స్వగ్రామం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మునిసిపాలిటీ పరిధిలోని పాతనేరేడుచర్ల. ఐశ్వర్య హీరో సూర్యకు పెద్ద అభిమాని.
ఇటీవల అమెరికాలోని టెక్సాస్ కాల్పుల ఘటనలో తెలుగు అమ్మాయి తాటికొండ ఐశ్వర్యప్రాణాలు కోల్పోయిన విషయం విధితమే. అల్లరి పిల్ల ఐశ్వర్య మరణం.. ఆమె కుటుంబంలో ఎంతో దు:ఖాన్ని నింపింది. కాగా ఐశ్వర్య నటుడు సూర్యకు పెద్ద అభిమాని. ఈ క్రమంలో సూర్య ఐశర్య అకాల మరణం గురించి తెలిసి ఎమోషనల్ అయ్యారు. ఆమె ఫోటో వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించారు. ఐశ్వర్య ఫ్యామిలీని ఓదార్చుతూ లేఖ రాశారు. ‘‘మీ కుంటుబానికి ఎలా ధైర్యం చెప్పాలో నాకు తెలియడం లేదు. ఇది నిజంగా తీరని లోటు. టెక్సాస్‌లో జరిగిన కాల్పుల ఘటనలో మీ గారాలపట్టి ఐశ్వర్య మరణించడం దురదృష్టకరం. ఆమె మన మెమరీస్‌లో ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఒక నక్షత్రంగా వెలుగుతూనే ఉంటుంది’’ అని ఐశ్వర్య పేరెంట్స్‌ను ఓదార్చే ప్రయత్నం చేశారు సూర్య.
అలాగే, ‘‘ఇవి నీ మరణానికి నివాళిగా రాస్తున్న లెట్స్ కావు. నువ్వు అసలైన హీరోవి. నీ ఫ్రెండ్స్ , ఫ్యామిలీ మెంబర్స్‌కు నువ్వొక ధ్రువతారవు. నువ్వు పంచిన ప్రేమ, నీ చిరునవ్వు ప్రతి ఒక్కరి హృదయంలో నిలిచే ఉంటుంది’’ అని రాసుకొచ్చారు. మే 6న టెక్సాస్‌లోని ఓ మాల్‌లో ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఐశ్వర్య సహా ఏడుగురు మృతి చెందారు.
ఐశ్వర్య స్వగ్రామం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మునిసిపాలిటీ పరిధిలోని పాతనేరేడుచర్ల. రంగారెడ్డి జిల్లా కమర్షియల్ కోర్టు జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తాటికొండ నర్సిరెడ్డి కుమార్తె ఐశ్వర్య. నర్సిరెడ్డి కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని హుడాకాలనీలో నివాసం ఉంటోంది .ఐశ్వర్య.. ఉన్నత చదువుల కోసం 2018లో అమెరికా వెళ్లింది. ఈస్టర్న్ మిషిగన్ యూనివర్సిటీలోని గ్రాండ్ స్కూల్‌లో కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్‌లో ఎమ్మెస్ పూర్తి చేసి, టెక్సాస్ సమీపంలోని పర్‌ఫెక్ట్ జనరల్ కాంట్రాక్టర్స్ కంపెనీలో ప్రాజెక్ట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. కిందటి సంవత్సరం డిసెంబరులో తన అన్న శ్రీకాంత్‌రెడ్డి పెళ్లికి చివరిసారిగా భారత్‌కు వచ్చిందామె. కాల్పులు ఘటన జరిగిన రోజు మధ్యాహ్నం మాల్‌కు వెళ్లే ముందు ఐశ్వర్య తన తల్లికి ఫోన్ చేసి మాట్లాడినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఆ తర్వాత 5 నిమిషాలకే ఆమె తుపాకీ తూటాలకు బలైంది.