అందాల భామలు@ స్మగ్లింగ్, మాఫియా.. రీల్‌లో హీరోయిన్లు.. రియల్‌లైఫ్‌లో విలన్లు..!
హీరోయిన్లను కొందరు ఎలా ఆరాధిస్తారంటే.. అతిశయోక్తిగా అనిపించొచ్చు గానీ.. కొన్ని సందర్భాల్లో వాళ్ల ఆరాదనను చెప్పడానికి మాటలు కూడా చాలవు. వర్మ మాటల్లో చెప్పాలంటే.. శ్రీదేవిని వెండితెరపై చూస్తున్న ఓ ప్రేక్షకుడు.. 'పుట్టించిన దేవుడికి సలామ్' అంటూ థియేటర్‌లోనే అరిచాడట. హీరోయిన్ ఖుష్బూకి ఆలయం కట్టించాడో సినీ భక్తుడు. అలా.. వెండితెరను ఏలుతూ, కుర్రకారును నిద్రపోనివ్వని హీరోయిన్లు ఎందరో ఉన్నారు.

హీరోయిన్లను కొందరు ఎలా ఆరాధిస్తారంటే.. అతిశయోక్తిగా అనిపించొచ్చు గానీ.. కొన్ని సందర్భాల్లో వాళ్ల ఆరాదనను చెప్పడానికి మాటలు కూడా చాలవు. వర్మ మాటల్లో చెప్పాలంటే.. శ్రీదేవిని వెండితెరపై చూస్తున్న ఓ ప్రేక్షకుడు.. ‘పుట్టించిన దేవుడికి సలామ్’ అంటూ థియేటర్‌లోనే అరిచాడట. హీరోయిన్ ఖుష్బూకి ఆలయం కట్టించాడో సినీ భక్తుడు. అలా.. వెండితెరను ఏలుతూ, కుర్రకారును నిద్రపోనివ్వని హీరోయిన్లు ఎందరో ఉన్నారు. కాని, అలాంటి వాళ్లే కేసుల్లో ఇరుక్కున్నప్పుడు, ‘ఇలాంటి పనులు మనం కూడా చేయం కదరా’ అని అనిపించే కేసులలో అరెస్ట్ అయినప్పుడు తెలుస్తుంది.. వెండితెరపై కనిపించే హొయల వెనక చీకటి కోణాలు కూడా ఉంటాయని. తప్పు చేసి అరెస్ట్ అయిన హీరోలు మనకు తెలుసు. కాని, అంతే జాబితా హీరోయిన్ల విషయంలోనూ ఉంది. టాలీవుడ్‌లోని కొందరు హీరోయిన్లపై ఎలాంటి ఆరోపణలు వచ్చాయి.. ఎలాంటి కేసులలో విచారణ ఎదుర్కొన్నారో తెలుగు ప్రజలందరూ చూశారు. కాని, ఇలాంటివి ఇక్కడే కాదు. ప్రతి సినీపరిశ్రమలోనూ జరిగాయి. కేవలం ఆరోపణలు ఎదుర్కోవడం, పోలీసులు పిలిస్తే ఎంక్వైరీకి వెళ్లిరావడమే కాదు.. ఏకంగా అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లొచ్చిన వారు కూడా ఉన్నారు. అలా.. చాలా సీరియస్ కేసులలో అరెస్ట్ అయిన హీరోయిన్ల జాబితా.. వారిపై వచ్చిన ఆరోపణల గురించి డిటైల్డ్‌గా చెప్పుకుందాం..
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యా రావు అరెస్ట్ అవడం ఇప్పుడో సంచలనం. కాని, ఇంతకు మించిన సెన్సేషనల్ కేసులు, అరెస్టులు జరిగాయి. వాటితో పోల్చితే.. రన్యారావు కేసు ‘జస్ట్ నథింగ్’ అంటారు. ఇందాక ఓ మాట చెప్పుకున్నాం. కుర్రాళ్ల మతిపోగొట్టిన హీరోయిన్లు అని. అలనాటి డ్రీమ్‌గర్ల్ మందాకిని నిజంగానే మతిపోగొట్టింది. కావాలంటే.. ఆ తరం వాళ్లని అడిగి చూడండి. ‘రాజ్‌కపూరు సినిమాలోని హీరోయిన్‌లా ఉంది ఫిగరు’ అని ఊరకనే పాడలేదు కీరవాణి. ‘రామ్ తేరీ గంగా మెయిలీ’ సినిమా 1985లో రిలీజ్ అయ్యాక.. మందాకిని పాన్‌ఇండియా హీరోయిన్ అయిపోయింది. ఆ సినిమాలో ఆమె అందానికి ఫిదా అవని కుర్రాళ్లు లేరు అప్పట్లో. అందుకే, తెలుగు సినిమాల్లోకి కూడా పట్టుకొచ్చారు టాలీవుడ్ దర్శక నిర్మాతలు. ‘రామ్ తేరీ గంగా మెయిలీ’ అనే ఒక్క సినిమాతో ఆమెకు వచ్చిన స్టార్‌డమ్ అంతా ఇంతా కాదు. ఎన్నెన్ని ఆఫర్లు తలుపు తట్టాయో. కాని, అదే అందం మరొకరి మనసు కూడా దోచింది. అతని పేరే దావూద్ ఇబ్రహీం. ‘అందాలను ఆరాదించే మనస్తత్వం’ అని దావూద్ ఇబ్రహీం గురించి కాస్త సెటైరిక్‌గా చెబుతుండేవాళ్లు అప్పట్లో. సో, పాకిస్తాన్ హీరోయిన్లు, ఇండియన్ హీరోయిన్లలో చాలామందిపై దావూద్ మనసు పారేసుకున్నారని చెప్పుకుంటుంటారు. ఆ లిస్టులో మందాకిని కూడా ఒకరు. షార్జాలో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు.. వీళ్లిద్దరూ పక్కపక్కనే కూర్చున్న ఫొటో బయటికొచ్చాక గానీ.. ప్రపంచానికి ఈ విషయం తెలీలేదు. ఆ ఒక్క ఫొటో.. మందాకిని ఫేట్‌నే మార్చేసింది. అప్పటి వరకు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చినవి కాస్త దూరం వెళ్లిపోయాయి. మందాకినిని తమ సినిమాల్లో తీసుకోడానికి కూడా భయపడిపోయారు. అయితే.. దావూద్ ఇబ్రహీంతో తన పరిచయం, ప్రేమ అనే విషయాలను మందాకిని ఇప్పటికీ ఖండిస్తూనే ఉంటుందనుకోండి. కారణం ఏదైనా.. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో పరిచయం.. మందాకినీ కెరీర్‌కు సమాధి కట్టేసింది. ఆ తరువాత.. సినిమాల్లోంచి తప్పుకుని చాలాకాలం పాటు ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోయింది.
అండర్ వరల్డ్ ప్రస్తావన, వాళ్లతో హీరోయిన్ల లింకులు అనగానే.. చాలామందికి గుర్తొచ్చే పేరు ‘మోనికా బేడీ’. అప్పట్లో సల్మాన్‌ఖాన్, షారుక్ ఖాన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే.. అదే అతిపెద్ద రివార్డ్. అలా.. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు.. ఆఫర్లు క్యూ కడుతున్నప్పుడు.. మాఫియా డాన్ అబు సలేంతో ప్రేమలో పడింది మోనికా బేడీ. ఒక కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌తో మోనికా బేడీ ప్రేమాయణం అనే వార్త.. మోనికా బేడీ కెరీర్‌నే మార్చేసింది. మార్చడం కాదు.. ఆల్‌మోస్ట్ అంతం చేసేసింది. 2002 సెప్టెంబర్‌లో.. అబు సలేంతో కలిసి పోర్చుగల్ వెళ్లింది మోనికా బేడీ. ఫేక్ డాక్యుమెంట్స్‌తో తమ దేశంలోకి వచ్చారంటూ.. పోర్చుగల్ పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఐదేళ్ల పాటు జైలు శిక్ష కూడా అనుభవించింది. సినిమా ఆఫర్లతో హాయిగా, ప్రశాంతంగా నడిచిపోతున్న కెరీర్‌కు.. తనకు తానే పుల్‌స్టాప్ పెట్టుకుంది. ఏకంగా మాఫియా డాన్‌తో ప్రేమలో మునిగి తేలి సినిమా ఆఫర్లే రాకుండా చేసుకుంది. ఆ తరువాత.. బిగ్‌బాస్ షోలో కనిపించి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేద్దామనుకున్నా సరే.. ఎవరూ ఛాన్సెస్ ఇవ్వడం లేదు.
అండర్ వరల్డ్ ఉచ్చులో చిచ్చుకుని కెరీర్‌నే నాశనం చేసుకున్నారు మందాకిని, మోనికా బేడీ. ఆ లిస్టులో చెప్పుకోవాల్సిన మరొక పేరు మమతా కులకర్ణి. 1990’sలో యావత్ దేశాన్ని ఊపేసిన హీరోయిన్ మమతా కులకర్ణి. సేమ్ టు సేమ్.. కెరీర్‌లో దూసుకుపోతున్నప్పుడే అండర్ వరల్డ్ డాన్ ‘చోటా రాజన్’తో సంబంధాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. ఆ ఒక్క వార్త.. మమతా కులకర్ణి కెరీర్‌కే పుల్‌స్టాప్ పెట్టేసింది. ఎవరూ అవకాశాలు ఇవ్వకపోవడంతో.. యాక్టింగ్ కెరీర్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఆ తరువాత.. విదేశాలకు వెళ్లిపోయింది. దాదాపు 16 ఏళ్ల పాటు మమతా కులకర్ణి ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలీదు. కాని, ఉన్నట్టుండి 2016లో మమతా కులకర్ణి పేరు ఓ కేసులో వినిపించడం మొదలైంది. కెన్యాలో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో మమత పేరు బయటికొచ్చింది. దాదాపు 2వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ రాకెట్ ముఠాలో మమతా కులకర్ణి భర్త విక్కీ గోస్వామి పేరు బలంగా వినిపించింది. దీంతో.. విక్కీ గోస్వామితో పాటు కులకర్ణిని కూడా అరెస్ట్ చేశారు కెన్యా పోలీసులు. ఇదే కేసులో.. భారత్‌లో కూడా కులకర్ణిపై నాన్-బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. ఆ కేసులో 2017లో బెయిల్‌పై బయటికొచ్చారు మమతా కులకర్ణి. 2025లో మహా కుంభమేళాలో సన్యాసం పుచ్చుకుని, మహామండలేశ్వర్‌గా మారుతున్నట్టు ఓ స్టేట్‌మెంట్ ఇచ్చింది. మొత్తంగా.. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన మమతా కులకర్ణి.. చోటా రాజన్‌తో సంబంధాల కారణంగా కెరీర్‌కే మచ్చతెచ్చుకుంది.
కళ్ల ముందు ఇంత మంది కనిపిస్తున్నా సరే.. కొందరు హీరోయిన్లు అలాంటి తప్పులే చేస్తున్నారు. తమకంటూ ఒక కెరీర్ ఉన్న తరువాత.. సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకున్న తరువాత.. కొన్ని తప్పటడుగులు వేస్తున్నారు. ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసమో, అత్యాశకొద్దో గానీ.. ఏకంగా స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడుతున్నారు. కన్నడ నటి రన్యారావు.. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాని.. ఇదే గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కేరళ హీరోయిన్ స్వప్న సురేష్, ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో నీతు అగర్వాల్, డ్రగ్స్ స్కాండల్స్‌లో కన్నడ హీరోయిన్ సంజన.. ఇలా చాలా మంది అరెస్ట్ అయ్యారు.
సిల్వర్ స్క్రీన్‌పై అత్యంత సుకుమారంగా కనిపించే హీరోయిన్లు.. ఒరిజినల్ స్క్రీన్‌పై మాత్రం కరుడుగట్టిన విలన్లలా కనిపిస్తున్నారు. స్మగ్లింగ్ అంటేనే సామాన్యులు భయపడిపోతారు. దొరికితే పరువుపోతుంది.. ఎందుకొచ్చిన రాద్ధాంతం అని ఆ ఆలోచననే తీసుకురారు. కాని, అంత ఫేమ్ సంపాదించి, సమాజంలో గౌరవం పొందుతూ కూడా స్మగ్లింగ్‌కు పాల్పడ్డారంటే ఏమనాలి వాళ్లని. ఎంతకైనా తెగించినట్టే కదా అర్థం. ఇంతకీ.. ఇలాంటి కేసులలో ఇరుక్కుని అరెస్ట్ అయింది ఎవరెవరు? ఏ కారణంగా వాళ్లు అలా చేయాల్సి వచ్చింది? ఆ తరువాత వాళ్ల కెరీర్ ఎలా మారింది? వీటితో పాటు రన్యా రావు కేసు డిటైల్స్ కూడా చూద్దాం..
‘ఒక్కఛాన్స్’ అనే డైలాగ్ చాలా ఫేమస్. ఆ డైలాగ్ వెనక ఉన్న తపన అలాంటిది. ఒక్కసారి స్క్రీన్ ఛాన్స్ కోసం ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తుంటారో. అసలు అవకాశం రావడమే అదృష్టం. పైగా.. వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడం అంతకు మించిన కష్టం కూడా. కాని, కొందరు మాత్రం సినిమాల్లో ఎవరికీ రాని అవకాశాలు వచ్చినా సరే నిలబెట్టుకోవడం లేదు. ఎగ్జాంపుల్.. రన్యా రావు. కన్నడ సూపర్‌స్టార్ కిచ్చ సుదీప్‌తో స్ర్కీన్ షేర్ చేసుకున్నారు. కన్నడసీమలో ఎంతో ఫేమ్ సంపాదించారు కూడా. చివరికి బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయారు. రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ చేసిన తీరు అధికారులను సైతం ఆశ్చర్యపరిచింది. గత ఆరు నెలల్లో ఏకంగా 27 సార్లు దుబాయ్ వెళ్లొచ్చింది. సౌదీ, అమెరికా, యూరప్‌తో పాటు చాలా దేశాలు తిరిగొచ్చింది. అలా వెళ్లొచ్చిన ప్రతీసారి.. ఒకే డ్రెస్ మెయింటైన్ చేస్తూ వెళ్లింది. దీని వెనక ఏదో జరుగుతోందని అనుమానించిన బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ ఆఫీసర్స్.. రన్యా రావును చెక్ చేశారు. అనుమానించినట్టే దాదాపు 15 కిలోల గోల్డ్ బిస్కెట్స్ బయటపడ్డాయి. ఈ లెక్కన గత ఆరు నెలల పర్యటనలో ఇంకెంత బంగారం స్మగ్లింగ్ చేసి ఉంటుందోనని అనుమానిస్తున్నారు. సంఘవిద్రోహ శక్తులతోనూ సంబంధాలు ఉండొచ్చన్న అనుమానంతో.. ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
సినిమాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే పుష్పరాజ్ అవొచ్చు. కాని, అదే పని నిజ జీవితంలో చేస్తే మాత్రం కటకటాల్లోకి వెళ్లాల్సి రావొచ్చు. రెడ్ సాండర్స్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు తెలుగు సినిమాల్లో నటించిన నీతు అగర్వాల్. 2015లో కర్నూలు జిల్లా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. నీతు అగర్వాల్ అకౌంట్‌లో జరిగిన లావాదేవీల ఆధారంగా కేసు బుక్ చేసి, అరెస్ట్ చేశారు. ప్రేమ ప్రయాణం సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయిన నీతూ అగర్వాల్.. ఆ సినిమా నిర్మాత అయిన వైసీపీ లీడర్ మస్తాన్ వలిని పెళ్లి చేసుకున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ఎవరి ద్వారా, ఏ రూట్‌లో జరిగిందో గానీ.. నీతూ అగర్వాల్‌ను పట్టుకుని లోపలేశారు. రాజస్తాన్ నుంచి వచ్చిన తనకు.. అసలు ఎర్రచందనం ఉంటుందని కూడా తెలీదని అప్పట్లో స్టేట్‌మెంట్ ఇచ్చారు.
హీరోయిన్లు, అరెస్ట్‌లు అనగానే ప్రముఖంగా తెరపైకి వచ్చేది డ్రగ్స్ కేసులే. ఈమధ్యే నటి హేమ విషయంలో ఎంతెంత డ్రామా జరిగిందో అంతా చూశాం. 2024 మే 19న.. కర్నాటక రాజధాని బెంగళూరులో జరిగిన రేవ్‌పార్టీ జరిగింది. ఆ పార్టీకి వెళ్లిన కొందరు.. డ్రగ్స్ తీసుకున్నారు. ఆ కేసులో పట్టుబడి తెలుగు రాష్ట్రాల్లో ఓ సెన్సేషనల్ పర్సన్ అయ్యారు నటి హేమ. తాను డ్రగ్స్ తీసుకోలేదని హేమ చెబుతున్నా.. బెంగళూరు సీసీబీ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారన్నది మాత్రం నిజం. డ్రగ్స్ టెస్టులో హేమకు పాజిటివ్ వచ్చిందని స్వయంగా బెంగళూరు పోలీసులే స్టేట్‌మెంట్ ఇచ్చారు. కోర్టు సైతం హేమకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆ కేసులో ప్రస్తుతం బెయిల్‌పై బయటికొచ్చారు నటి హేమ.
డ్రగ్స్ కేసులు, అందులో హీరోయిన్ల పాత్రల గురించి ఇంకాస్త వెనక్కి వెళ్తే.. సంజన గల్రానీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాలో సెకండ్ హీరోయినే ఈ సంజన గల్రానీ. 2020లో కన్నడ డ్రగ్స్ స్కాండల్ కేసులో బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సంజన గల్రానీని అరెస్ట్ చేశారు. ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు.. కొన్ని సాక్ష్యాలను సేకరించారు. డ్రగ్స్ కేసులో సంజన అరెస్ట్ అవడం.. అప్పట్లో కన్నడ చిత్ర పరిశ్రమలో అతిపెద్ద చర్చనీయాంశం.
కన్నడ డ్రగ్స్ స్కాండల్ కేసుల గురించి మాట్లాడాల్సి వస్తే.. సంజనతో పాటు రాగిణీ ద్వివేది గురించి కూడా చెప్పుకోవాలి. 2020 సెప్టెంబర్ 4న.. కన్నడ నటి రాగిణి ద్వివేదిని అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు. దర్యాప్తులో భాగంగా రాగిణి నివాసంలో తనిఖీలు చేపట్టి.. కొంత మెటీరియల్ కూడా స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్స్ కేసులో అరెస్ట్‌లు మలయాళ సినీ ఇండస్ట్రీలోనూ జరిగాయి. టీవీ సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వెళ్లిన నటి అశ్వతి బాబు.. కస్టమర్లకు డ్రగ్స్ అందించడానికి ఎదురుచూస్తూ పోలీసులకు దొరికిపోయారు. తన డ్రైవర్ బినయ్ అబ్రహంతో కలిసి ఓ చోట కారులో వెయిట్ చేస్తుండగా.. అటుగా వచ్చిన పోలీసులకు అనుమానం వచ్చింది. కారులో సెర్చ్ చేయగా.. MDMA అనే సింథటికర్ డ్రగ్ దొరికింది. లేట్‌నైట్ పార్టీల్లో ఎక్కువగా ఈ డ్రగ్ ఉపయోగిస్తారు. అలా.. కెరీర్ బిగినింగ్‌లోనే డ్రగ్స్ కేసులో దొరికిపోయి టోటల్ కెరీర్‌నే నాశనం చేసుకున్నారు అశ్వతిబాబు.
వివాదాలు, నోటి దురుసు, స్మగ్లింగ్, డ్రగ్స్ కారణంగా హీరోయిన్లు అరెస్ట్ అవడం చూశాం. కానీ, హీరోయిన్ గెహనా వశిష్ట కేసు మాత్రం డిఫరెంట్. పోర్న్ వీడియో రాకెట్ కేసులో ఆమెను అరెస్ట్ చేశారు. బాలీవుడ్‌లో అడుగుపెట్టి.. ‘ఆపరేషన్ దుర్యోధన’ సినిమాలో ఐటెమ్ సాంగ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ‘ఆపరేషన్ దుర్యోధన-2’, ‘అనుకున్నది ఒకటి అయినది ఒకటి’, ‘నమస్తే’, ’33 ప్రేమ కథలు’, ‘ఐదు’, ‘ప్రేమించు పెళ్లాడు’, ‘బీటెక్ లవ్ స్టోరీ’ వంటి తెలుగు సినిమాల్లో కూడా నటించింది. సినిమాల్లో కుదురుకుంటోంది అనుకుంటుండగానే.. 2021 ఫిబ్రవరిలో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గెహనా వశిష్టను పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ చేశారు. ఆమె తన సొంత వెబ్‌సైట్‌లోనే 87 పోర్న్ వీడియోలను అప్‌లోడ్ చేసిందనేది ప్రధాన ఆరోపణ. 2021 జూలైలో వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయినప్పుడు.. గెహనా వశిష్ట కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంది. అయితే.. అవన్నీ బోల్డ్ కంటెంట్ తప్ప.. పోర్న్ వీడియోలు కావనేది గెహనా వశిష్ట చేస్తున్న వాదన.
అసలైన కేసు గురించి మాట్లాడుకోలేదింక మనం. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహిని గట్టిగానే ఇరికించాడు సుకేశ్ చంద్రశేఖర్. ముందుగా.. ఎవరీ సుకేశ్ అనేది కూడా తెలుసుకోవాలి. పొలిటీషియన్స్, సెలబ్రిటీస్, బిజినెన్‌మెన్ నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడన్న ఆరోపణలున్నాయి ఈ సుకేశ్‌పై. ఫార్మా కంపెనీ రాన్‌బాక్సీ యజమాని శివిందర్ మోహన్ సింగ్‌కు బెయిల్ ఇప్పిస్తానని అతని భార్య అదితి సింగ్ నుంచి ఏకంగా 200 కోట్ల రూపాయలు వసూలు చేశాడన్న అభియోగంపై ప్రస్తుతం జైలులో ఉన్నాడు సుకేశ్ చంద్రశేఖర్. ఆ 200 కోట్ల రూపాయలు కూడా.. రోహిణీ జైలులో ఉంటూనే.. వసూలు చేశాడు. ఇక.. సెలబ్రిటీలకు ఎలాంటి ఖరీదైన గిఫ్ట్‌లు ఇస్తాడంటే.. మొన్నటికి మొన్న వాలెంటైన్స్ డే రోజు.. ఏకంగా ప్రైవేట్ జెట్‌ను బహుమతిగా పంపించాడట. ఎవరికి? హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కి. కొన్నాళ్లుగా జైల్లోనే ఉన్న సుకేశ్.. ఏకంగా ప్రైవేట్ జెట్ ఎలా కొన్నాడు, ఎలా పంపించాడన్నది అతిపెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు. అసలే.. సుకేశ్‌తో సంబంధాలు ఉన్నాయన్న కారణంగా.. ఈడీ విచారణకు హాజరవుతోంది జాక్వెలిన్. ఎక్కడ అరెస్ట్ చేస్తారోనన్న భయంతో.. ముందస్తు బెయిల్ కూడా తీసుకున్నారు. బెయిల్‌పై ఉన్న కారణంగా.. ఎక్కడ దేశం విడిచి పారిపోతుందోనని అన్ని ఎయిర్‌పోర్టులలో నిఘా కూడా పెట్టారు. ప్రస్తుతానికైతే.. జాక్వెలిన్ నేరం చేసినట్టు ఎలాంటి ఆధారాలు లేవు. కాకపోతే, సుకేశ్‌తో సన్నిహితంగా ఉండడమే ఆమె కొంప ముంచింది. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు వేసే ఒకే ఒక్క తప్పటడుగు.. టోటల్ కెరీర్‌నే ముంచేస్తుందనడానికి అప్పట్లో మందాకిని, మోనికా బేడీ, మమతా కులకర్ణి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అయితే.. ఇప్పట్లో ఫెర్నాండెజ్‌ను చెప్పుకోవచ్చు.
అంతేనా.. సుకేశ్ కేసులో గట్టిగా ఇరుక్కుపోయిన మరో బాలీవుడ్ యాక్ట్రెస్ నోరా ఫతేహి. ఎంతోమంది నుంచి కోట్లకు కోట్లు వసూలు చేసిన సుకేశ్.. కేవలం జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కే కాదు నోరా ఫతేహికి కూడా ఖరీదైన గిఫ్ట్‌లు ఇచ్చాడనేది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపణ. తనకు గర్ల్‌ఫ్రెండ్‌గా ఉంటే.. పెద్ద బంగ్లా గిఫ్ట్‌గా ఇస్తానని సుకేశ్ వెంటపడ్డాడంటూ ఈడీకి స్టేట్‌మెంట్ ఇచ్చింది నోరా ఫతేహి. ఈ కేసులో ఫతేహిని కేవలం సాక్షిగానే చూస్తోంది ఈడీ.
ఏదేమైనా.. ఆ కేసులు, అరెస్టుల కారణంగా కెరీర్‌పై మాత్రమే కాదు.. వాళ్ల పర్సనల్ లైఫ్ మీద కూడా దారుణమైన ప్రభావం చూపింది. సుకేశ్‌తో పరిచయం కేసుల కారణంగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ డీఫేమ్ అయ్యారన్నది నిజం. బాలీవుడ్‌లో అవకాశాలే లేవిప్పుడు. నోరా ఫతేహి పరిస్థితి కూడా సేమ్ టు సేమ్. ఐటమ్ సాంగ్స్, యాడ్స్, రియాలిటీ షోలు మాత్రమే చేస్తోంది. ఇక మోనికా బేడీ.. చోటా రాజన్‌తో సంబంధాల కారణంగా టోటల్ స్టార్‌డమ్‌నే కోల్పోయింది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన మమతా కులకర్ణికి.. ఇప్పుడు సన్యాసం తీసుకోవాల్సినంత పరిస్థితి వచ్చింది. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినప్పటి నుంచి సంజన గల్రానీకి.. టాలీవుడ్, శాండిల్‌వుడ్ అవకాశాలే ఇవ్వడం లేదు. అశ్వతి బాబుపై అయితే.. మలయాళ చిత్రసీమలో ఆమెపై నిషేధం విధించారు. ఫైనల్‌గా.. వివాదాలు, మోసాలు, ఆర్థిక నేరాల్లో ఒకప్పుడు హీరోలే ఎక్కువగా కనిపిస్తే.. వాళ్లని మించి హీరోయిన్లు కనిపిస్తున్నారిప్పుడు. రేప్పొద్దున ఇంకెవరెవరు తమ కెరీర్‌ను ఫణంగా పెట్టబోతున్నారోచూడాలి.