- Telugu News Entertainment Tollywood Singer lata mangeshkar 1929 to 2022 a pictoral tribute and life journey
Lata Mangeshkar: గాయని లతా మంగేష్కర్ కన్నుమూత.. భారతరత్న పురస్కార గ్రహీత గానకోకిల అరుదైన చిత్రాలు..
ప్రముఖ గాయని.. భారతరత్న పురస్కార గ్రహీత లతా మంగేష్కర్ (92) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు..
Updated on: Feb 06, 2022 | 10:48 AM


1948లో లతా మంగేష్కర్‌కు గులాం హైదర్ మార్గదర్శకం చూపించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గులాం హైదర్ తనకు గాడ్ ఫాదర్ వంటివారని.. తన ప్రతిభపై పూర్తి నమ్మకం చూపించిన మొదటి సంగీత దర్శకుడని లతా తెలిపారు..

1950 తర్వాత నుంచి బాలీవుడ్‌లో బిజీ అయిన లతా మంగేష్కర్, ఐదేళ్లలోనే మ్యూజిక్ డైరెక్షన్ కూడా మొదలుపెట్టారు. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మహారాష్ట్ర సర్కారు నుంచి పురస్కారం కూడా అందుకున్నారు.ప్రొడ్యూసర్‌గా మారి నాలుగు సినిమాల్ని సైతం నిర్మించారు. నేపథ్య గాయనిగా నైటింగేల్ ఖాతాలో మూడు జాతీయ అవార్డులున్నాయి.

మరాఠీ , హిందీలో పాడిన తర్వాత, లతా మంగేష్కర్ సింహళీస్, తమిళం, బెంగాలీ మరియు మరిన్ని ఇతర భాషలలో తన గాత్రాన్ని ప్రయత్నించారు. పై చిత్రంలో, లతా మంగేష్కర్ సంగీత దర్శకురాలు ఉషా ఖన్నాతో ముచ్చటించారు.

లత పాట వినాలంటే పెట్టి పుట్టాలి. అయినా... లత స్వర మహత్యాన్ని రుచి చూడనివాళ్లుంటారా? ఆమె గొంతు ఎంత గొప్పదంటే... తంబూరా కూడా ఆమె స్వరానికి తగినట్టు తనను తానే శృతి చేసుకునేంత ఉన్నతమైనది. మరో 5 శతాబ్దాల తర్వాత కూడా మనకు ఇద్దరు సంగీతజ్ఞులే గుర్తుంటారు....ఒకరు తాన్‌సేన్ ... మరొకరు లతా మంగేష్కర్.

లత అల్లుకున్న పాటల పందిరి కింద ఒక్కసారి సేదదీరుదాం. తొలినాళ్లలో లత ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన సంగీత దర్శకులు చాలా కొద్ది మందే. ఆమె ఇండస్ర్టీలో పాతుకుపోయాక ఆమెతో పాడించని వాళ్లూ వున్నారు...అంతకు ముందు ఎన్ని పాటలు పాడినా... మహల్‌లోని ఆయేగా ఆయేగా పాట సినిమా పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది.

లతకు తొలి రోజుల్లో పాడే టెక్నిక్‌ను నేర్పి...గాయనిగా ఎస్టాబ్లిష్ కావడానికి తోడ్పడిన సంగీత దర్శకుడు అనిల్ బిశ్వాస్. వినేవారికి తెలియకుండా పాటల మధ్య శ్వాస ఎక్కడ తీసుకోవాలో... ఎక్కడ వదలాలో దగ్గరుండి విడమర్చి చెప్పారాయన. అలా పుట్టిన అందమైన పాటలకు లెక్కే లేదు

నిరాలాలోని 'మెహఫిల్ మే జల్ ఉఠీ' పాట లతకు ఎంతో పేరు తెచ్చింది.. అసలు పాట బాగోలేదన్నా.. తెరమీద మధుబాల నటన బాగోలేదన్నా టికెట్ డబ్బులు వాపస్ చేస్తామని నిర్మాతలు వాల్‌పోస్టర్లేశారంటే... ఆ పాట స్థాయి ఏమిటో అర్థమవుతుంది...

లతా పాడుతున్నప్పుడు కాలికి చెప్పులు వేసుకోరు. అంటే పాట పట్ల ఆమెకున్న భక్తిభావం ఎంతో తెలుసుకోవచ్చు. లతా స్కూల్‌కెళ్లింది ఒకే ఒక్క రోజు. అయితేనేం... ప్రపంచవ్యాప్తంగా ఆరు యూనివర్సిటీలు ఆమెకు డాక్టరేట్‌ను ప్రదానం చేశాయి. ఆమె పాటకు దాసోహం ప్రకటించాయి.

అరవై ఏళ్లపాటు అవిశ్రాంతంగా ...అపస్వరాలు దొర్లకుండా.. స్వరం సడలకుండా పాటలు పాడటం... కేవలం లతా మంగేష్కర్‌కు మాత్రమే సాధ్యమైంది. అయిదారు తరాల కథానాయికలకి గళాన్ని అరువివ్వడం, వయసు మీద పడినా ఆ ప్రభావం గొంతు మీద పడనివ్వకపోవడం... ఇటువంటి అరుదైన విషయాలు లతా మంగేష్కర్ చరిత్ర పేజీల్లో అనేకం.




