AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shruti Haasan: స్టార్ హీరోయిన్ శ్రుతీహాసన్ ఉదారత.. చావుబతుకుల్లో ఉన్న చిన్నారికి పునర్జన్మనిచ్చిన కమల్ హాసన్ కూతురు

వెండితెరపై గ్లామర్ ఒలకబోస్తూ, తన నటనతో కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకుంది ఆ నటి. లోకనాయకుడి వారసురాలిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమె కేవలం వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ ఒక రియల్ స్టార్ అని నిరూపించుకుంది.

Shruti Haasan: స్టార్ హీరోయిన్ శ్రుతీహాసన్ ఉదారత.. చావుబతుకుల్లో ఉన్న చిన్నారికి పునర్జన్మనిచ్చిన కమల్ హాసన్ కూతురు
Shruti Haasan
Nikhil
|

Updated on: Feb 06, 2026 | 3:03 PM

Share

అరుదైన జన్యుపరమైన వ్యాధితో మృత్యువు అంచున ఉన్న ఒక పసిప్రాణాన్ని కాపాడేందుకు ఆమె ఏకంగా దేవుడు పంపిన దేవతలా ముందుకొచ్చింది. ఆర్థిక సాయం అందించడమే కాకుండా, చికిత్స పూర్తయ్యాక స్వయంగా వెళ్లి ఆ చిన్నారిని గుండెలకు హత్తుకుంది. ఆమె చేసిన ఈ గొప్ప పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? ఆ చిన్నారి ప్రాణాలను కాపాడిన ఆ అరుదైన కథాకమీమామిష ఏంటో తెలుసుకుందాం..

చిన్నారి ఆళవి ప్రాణదాత

ప్రముఖ నటి శ్రుతీ హాసన్ తనలోని అద్భుతమైన మానవత్వాన్ని చాటుకున్నారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ‘ఆళవి’ అనే చిన్నారి చికిత్సకు భారీగా ఆర్థిక సాయం చేసి ఆ పాపను చావు నోట్లో నుంచి కాపాడారు. ఈ విషయాన్ని స్వయంగా చిన్నారి తల్లిదండ్రులు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడిస్తూ శ్రుతీహాసన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె చేసిన ఈ సాయం వల్లనే తమ కూతురు ఈ రోజు తమ కళ్ల ముందు ఆరోగ్యంగా తిరుగుతోందని వారు భావోద్వేగానికి గురయ్యారు. శ్రుతి హాసన్ కేవలం డబ్బులు ఇచ్చి ఊరుకోకుండా, ఆ చిన్నారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం గమనార్హం.

చిన్నారి ఆళవి MSMD అనే అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధికి చికిత్స చాలా ఖరీదైనది. చిన్నారికి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ (ఎముక మజ్జ మార్పిడి) చేయాల్సి రావడంతో తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఈ విషయం తెలుసుకున్న శ్రుతీహాసన్ వెంటనే స్పందించి ఆపన్నహస్తం అందించారు. ఆమె అందించిన ఆర్థిక భరోసా వల్లే పాపకు ఆపరేషన్ సాధ్యమైంది. ఆపరేషన్ తర్వాత శ్రుతీహాసన్ స్వయంగా వెళ్లి పాపను కలిసి, ఆమెతో ఆడుకుంటూ ముద్దాడిన ఫోటోలను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

కుటుంబ సభ్యురాలిలా..

శ్రుతీహాసన్ తమను అపరిచితుల్లా కాకుండా సొంత కుటుంబ సభ్యుల్లా భావించారని ఆళవి తల్లిదండ్రులు పేర్కొన్నారు. “మా కూతురు ఆళవితో ఆమె ఎంతో ఓపికగా గడిపిన తీరును మేము ఎప్పటికీ మర్చిపోలేం. దేవుడు పంపిన దేవతలా శ్రుతి హాసన్ మా జీవితంలోకి వచ్చారు. ఆళవిని అకస్మాత్తుగా ఐసీయూలో చేర్చినప్పుడు శ్రుతి, ఆమె బృందం ఎంతో సహాయం చేశారు. వారి వల్లే మాకు ఉత్తమమైన చికిత్స అందింది. మానసికంగా, ఆర్థికంగా అండగా నిలిచిన శ్రుతి చేసిన ఈ సాయాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాం” అని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.

ప్రశంసల వెల్లువ..

సాధారణంగా సెలబ్రిటీలు తాము చేసే దానధర్మాల గురించి ప్రచారం చేసుకోవడానికి ఇష్టపడతారు. కానీ శ్రుతీహాసన్ మాత్రం ఎంతో నిశ్శబ్దంగా ఈ పని పూర్తి చేశారు. చికిత్స ముగిసిన తర్వాత చిన్నారి తల్లిదండ్రులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే తప్ప ఈ విషయం బయటకు రాలేదు. ఆమె చేసిన ఈ గొప్ప పనికి చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో పాటు అభిమానులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆళవి అనే చిన్నారికి ఆమె అందించిన పునర్జన్మ ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. సినిమాల్లో హీరోలు ప్రాణాలు కాపాడటం చూస్తుంటాం, కానీ నిజ జీవితంలో శ్రుతీహాసన్ ఒక ప్రాణాన్ని కాపాడి రియల్ హీరోయిన్ అనిపించుకున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ వారసురాలిగా ఆమె తన తండ్రి పేరును మరింత సార్థకం చేశారు.