AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం లక్ భయ్యా నీది! సినిమాల్లోకి రాకముందే మెగాస్టార్‌‌తో యాడ్ చేసిన టాలీవుడ్ హీరో

టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో ఆయన. ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చిన్న పాత్రలు చేస్తూ, నేడు స్టార్ హీరోగా ఎదిగి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నారు. ఇటీవల సంక్రాంతి బరిలో దిగి మరో సక్సెస్‌ అందుకున్నారు.

ఏం లక్ భయ్యా నీది! సినిమాల్లోకి రాకముందే మెగాస్టార్‌‌తో యాడ్ చేసిన టాలీవుడ్ హీరో
Chiru And Tollywood Hero
Nikhil
|

Updated on: Jan 29, 2026 | 11:31 PM

Share

‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆ హీరో వెనుక ఒక మెగా చరిత్ర ఉంది. సాధారణంగా ఎవరైనా ఒక స్టార్ హీరోతో కలిసి నటించాలంటే ఎన్నో ఏళ్లు ఎదురుచూడాలి. కానీ ఈ హీరో మాత్రం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందే ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నారు. కేవలం నటించడమే కాదు, వెండితెరను ఊపేసిన ఒక ఐకానిక్ స్టెప్పును చిరుతో కలిసి వేశారు. ఆ క్రేజీ కాంబో ఎలా సెట్ అయింది? చరణ్ స్నేహితుడు హీరోగా మారిన ఆ అద్భుత ప్రయాణం గురించి తెలుసుకుందాం..

రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్..

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులనే విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరూ ఒకే స్కూల్‌లో చదువుకోవడమే కాకుండా, శర్వానంద్ తరచుగా చిరంజీవి ఇంటికి వెళ్లి చరణ్‌తో ఆడుకునేవారు. ఈ క్రమంలోనే ఆయనకు మెగాస్టార్‌తో మంచి అనుబంధం ఏర్పడింది. ఒకరోజు తాను నటన వైపు వెళ్లాలని అనుకుంటున్నట్లు మొదట చరణ్‌కే చెప్పారు శర్వానంద్. సరిగ్గా అదే సమయంలో ఒక అద్భుతమైన అవకాశం ఆయన తలుపు తట్టింది.

చిరుతో తొలి అడుగు..

అది 2003వ సంవత్సరం. మెగాస్టార్ చిరంజీవి ఒకరోజు థమ్స్ అప్ సంస్థ ప్రతినిధులతో మీటింగ్ ముగించుకుని తన గదిలోకి వచ్చారు. ఆ యాడ్‌లో తనతో కలిసి నటించడానికి ఒక యంగ్ బాయ్ కావాలని ఆ సంస్థ వారు కోరారట. అప్పుడే అక్కడ చరణ్‌తో కలిసి కూర్చున్న శర్వానంద్‌ను చూసిన చిరంజీవికి ఒక ఆలోచన వచ్చింది. “నాతో కలిసి థమ్స్ అప్ యాడ్‌లో చేస్తావా?” అని శర్వానంద్‌ను అడగగానే, ఆయన ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

Chiranjeevi And Sharwanand

Chiranjeevi And Sharwanand

అలా శర్వానంద్ సినిమాల్లోకి రాకముందే మెగాస్టార్‌తో కలిసి ఆ యాడ్‌లో నటించారు. ఆ ప్రకటనలో చిరంజీవితో కలిసి అప్పట్లో ట్రెండ్ సెట్ చేసిన ‘ఇంద్ర’ సినిమాలోని ‘వీణ స్టెప్పు’ను శర్వానంద్ ఎంతో ఈజ్ తో వేశారు. ఆ సమయంలో ఆయనలోని చురుకుదనాన్ని చూసిన వారు భవిష్యత్తులో ఈ అబ్బాయి మంచి నటుడు అవుతాడని అప్పుడే ఊహించారు. ఆ తర్వాతే ‘ఐదో తారీఖు’ సినిమాతో నటుడిగా శర్వానంద్ ప్రస్థానం మొదలైంది.

కేవలం యాడ్‌లోనే కాకుండా, ఆ తర్వాత ‘శంకర్ దాదా MBBS’ సినిమాలో చిరంజీవికి తమ్ముడి లాంటి పాత్రలో శర్వానంద్ నటించి మెప్పించారు. ఆ తర్వాత మెల్లగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి, ‘గమ్యం’, ‘ప్రస్థానం’ వంటి సినిమాలతో హీరోగా స్థిరపడ్డారు. నేడు తెలుగులో వన్ ఆఫ్ ది మోస్ట్ రిలయబుల్ హీరోగా ఎదిగారు.

ఈ ఏడాది సంక్రాంతికి కూడా బాక్సాఫీస్ వద్ద తన సక్సెస్ పరంపరను కొనసాగిస్తూ ‘నారీ నారీ నడుమ మురారి’తో ప్రేక్షకులను పలకరించారు. చిన్నప్పుడు మెగాస్టార్ ఇంట్లో ఆడుకున్న ఆ పిల్లాడు, నేడు అదే మెగాస్టార్‌తో బాక్సాఫీస్ పోటీలో నిలబడే స్థాయికి ఎదగడం నిజంగా గొప్ప విషయం. శర్వానంద్ ఎదుగుదలను చూసి చిరంజీవి కూడా ఎన్నో సార్లు గర్వంగా చెప్పుకున్నారు.