Pakeezah Vasuki: వారు నన్ను బాగా చూసుకుంటున్నారు.. హైదరాబాద్‌లోనే ఉంటా.. ఇక చెన్నైకి వెళ్లను: నటి పాకీజా
Actress Pakeezah Vasuki

సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరి జీవితాలు ఎప్పుడెలా మారుతాయో ఎవరూ ఊహించలేరు. అవకాశాలు ఉన్నప్పుడు ఎంతో లగ్జరీగా బతికిన వారు కాలం కలిసిరాకపోతే అనూహ్యంగా కిందకు పడిపోతారు. చేతిలో డబ్బుల్లేక, తినడానికి తిండిలేని దీన పరిస్థితులు ఎదుర్కొంటారు. అలా ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో దుర్భర జీవితం గడిపిన వారిలో అసెంబ్లీ రౌడీ ఫేమ్, సీనియర్ నటి పాకీజా వాసుకీ ఒకరు. మోహన్‌బాబు హీరోగా నటించిన ఈ సినిమాలో బ్రహ్మానందంతో ఆమె చేసిన కామెడీని ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. ఈ సినిమాతో పాటు రౌడీ ఇన్స్పెక్టర్, పెదరాయుడు వంటి హిట్ చిత్రాల్లోనూ తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిందామె. తెలుగుతో పాటు తమిళ్ భాషల్లో కలిపి 150 సినిమాలు కూడా చేసింది. అయితే కాలం కలిసిరాక, అవకాశాలు దూరమై గత కొన్ని రోజుల వరకు దీన స్థితిలో జీవించింది. కనీసం ఉండడానికి సొంత ఇల్లు లేక ఓ అద్దె ఇంట్లో ఉండిపోయింది. ఇదే క్రమంలో ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో తన దీన స్థితి గురించి చెప్పి వాపోయింది. దీంతో స్పందించిన మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు అలాగే మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెను అదుకున్నారు. మెగా బ్రదర్స్ తమకు తోచినంత ఆర్థిక సాయం చేస్తే మంచు విష్ణు సొంత డబ్బులతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్డ్‌ను పాకీజాకు అందించారు.
కాగా గత కొన్నేళ్లుగా చెన్నైలోనే నివాసముంటోన్న ఆమె ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఇక్కడే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని జీవితాన్ని గడుపుతున్నారు. అంతేకాదు బుల్లితెరపై అవకాశాలు వస్తుండడంతో మళ్లీ నటిగా బిజీ అయిపోయారు. దీనిపై స్పందించిన ఆమె.. ‘చెన్నైలో ఉన్నప్పుడు నేను చాలా ఇబ్బందులు పడ్డాను. హైదరాబాద్‌కు వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇక్కడ అందరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నా. వారందరికీ నా ధన్యవాదాలు. ఇక నుంచి హైదరాబాద్‌లోనే ఉంటాను. చెన్నై వెళ్లను’ అని చెబుతోంది పాకీజా. కాగా ఇటీవలే ప్రముఖ కామెడీ షో జబర్దస్త్‌లో సందడి చేసింది పాకీజా.




మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..